చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అధికారి ఎందుకు ఎగతాళి చేశారు?
x
Siddharthi Subhash, GST Officer, Tirupati

చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈ అధికారి ఎందుకు ఎగతాళి చేశారు?

ఎవరీ ఈ సిద్దార్థి సుభాష్? ఎందుకు సస్పెండ్ అయ్యారు?


ఈయన పేరు ఎన్. సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్.. ఏపీ ప్రభుత్వంలో తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్. ఈ ఆఫీస ర్ ను రాష్ట్రప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది. కొందరు బోసుకి మద్దతుగా మరికొందరు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం చేస్తున్నారు.

తన వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడం సుభాష్ చంద్రబోస్ పద్ధతి. ఆయన ఫేస్ బుక్ వాల్ ఆలోచనాత్మకంగా ఉంటుందని ఆయన అభిమానులు చెబుతుంటారు. విషయాన్ని ఉన్నదున్నట్టు చెప్పడం ఆయన స్టైల్.
ప్రభుత్వ అధికారిగా పని చేస్తున్నప్పుడు రాజకీయ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికపైన పంచుకోవడం ప్రభుత్వం దృష్టిలో నేరం. కొన్నాళ్ల క్రితం వరదల టైంలో అమరావతిపైన సుభాష్ చంద్రబోస్ చేసిన ఫేస్ బుక్ పోస్ట్ వైరలైంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీసు నిబంధనలు అతిక్రమించినట్లు ప్రభుత్వం ఆరోపించింది. సస్పెండ్ చేసింది.
బోస్ పెట్టిన పోస్టులు ఏమిటీ?
గత నెలలో బోస్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో అమరావతిపై కొన్ని పోస్టులు పెట్టారు. రాజధానిలో సీఆర్‌డీఏ- 3 రిజర్వాయర్లు నిర్మించిందంటూ వచ్చిన వార్తను ట్యాగ్‌ చేస్తూ ‘అమరావతి కోసం మూడు రిజర్వాయర్లెందుకు? అమరావతినే రిజర్వాయర్‌గా కడితే పోలా?..’ అంటూ పోస్ట్‌ చేశారు. ఇది వివాదమైంది.
అదే రోజు మరో పోస్టులో ఆ అధికారి అమరావతి అభివృద్ధి ప్రణాళికలను ఎగతాళి చేసేలా ఇలా రాశారు: “ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటం వ్యాలీ. ఇక్కడ అతి పెద్ద రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్ రావలసి ఉంది. అయినా ఒక్క వర్షం పడితేనే అమరావతి మొత్తం మునిగిపోతుంది.”
అధికారుల వాదన ప్రకారం, "ఇటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగికి తగవు. ఇవి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. అందుకే సుభాష్‌కు షో-కాజ్ నోటీసు ఇచ్చాం. “ఇవి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే” అంటూ బోసు ఇచ్చిన వివరణ ఉన్నతాధికారులను సమాధాన పరచలేక పోయింది."
అనంతరం ప్రభుత్వం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసింది. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు నిర్లక్ష్యపు ప్రవర్తన కనబరచడాన్ని సహించబోమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికార్యాలయం స్పష్టం చేసింది.
ఫేస్ బుక్ పోస్టులకూ ప్రభుత్వం భయపడాలా?
"అంత మెజారిటీతో గెలిచి కూడా ఒక వ్యక్తి పెట్టిన Facebook పోస్టులకు భయపడే ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే.. ఈ మెజారిటీ నిజంగా వచ్చిందా? లేక దొంగతనం చేస్తే వచ్చిందా? అన్న అనుమానం కలుగుతూ ఉందని" కొందరు ధ్వజమెత్తారు. "I Stand With Sidharthi Subhash" పేరిట ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.
నిజంగా ప్రభుత్వ అధికారులు- ప్రభుత్వాలు, పాలకుల తీరుపైన వ్యక్తిగత అభిప్రాయాలు కలిగి ఉండకూడదా? అదే నిజమైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే కాదు, పొగిడినా తప్పే కదా..? అని బోసు మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.
విమర్శించే వాళ్లనే కాకుండా భజనపరులవీ కూడా అభిప్రాయాలే కదా, వాళ్లను ఎందుకు సస్పెండ్ చెయ్యకూడదు? కనీసం వాళ్లను వివరణ అయినా అడుగుతారా ఎందుకు పొగిడావ్ అని..? అలాంటిదేమీ లేనప్పుడు బోసును సస్పెండ్ చేయడం పద్ధతి కాదన్న విమర్శలు వస్తున్నాయి.
"ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్న భయపెట్టేస్తోంది. ప్రశ్నకు సమాధానం చెప్తే సరిపోతుంది గానీ ప్రశ్నకు సమాధానం శిక్ష కాదు. శిక్షే అన్నప్పుడు పొగిడిన వాళ్లను కూడా శిక్షించడం న్యాయం కదా. ఇది అన్యాయం!" అంటున్నారు ఆయన మద్దతుదారులు.
అయితే సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తుల అవసరం ఆంధ్రప్రదేశ్ యువతరానికీ, రాష్ట్రానికీ, ప్రజలకీ చాలా ఎక్కువగా ఉంది. నిద్రలో ఉన్న ఏపీ పౌరసమాజం, యువత ఇలాగైనా చైతన్యవంతమౌతారేమో చూడాలని వ్యాఖ్యానిస్తున్నారు.
బోసును వ్యతిరేకించే వాళ్లు ఏమంటున్నారంటే...
ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యం ప్రణాళికలు అమలుపరిచే పనిముట్లు. బ్రూరోక్రాట్లు అయినా సాధారణ ఉద్యోగులు అయినా ఉద్యోగంలో చేరే ముందు నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేసే కదా చేరుతున్నారు. అది పాటించనపుడు సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది కదా అనే వాదనా ఉంది.
మేధావులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు స్వేచ్ఛగా వారి వారి అభిప్రాయాలను చెప్పినా రాజ్యం తన ఉనికికి సమస్య లేనంత వరకూ ప్రజాస్వామ్యంగా నటిస్తూ ఉంటుంది. సమస్య సృష్టిస్తారనుకున్నప్పుడే అణచివేత మొదలవుతుంది. రాజ్యం రెండు పార్శాలుగా వ్యవహరిస్తుంది.
అయితే సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తుల అవసరం ఆంధ్రప్రదేశ్ యువతరానికీ, రాష్ట్రానికీ, ప్రజలకీ చాలా ఎక్కువగా ఉంది. ఏపీ పౌరసమాజం, యువత ఇలాగైనా చైతన్యవంతమౌతారేమో చూడాలని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read More
Next Story