వరదనీరు, వీటీపీఎస్ నుంచి వచ్చిన వేస్ట్ నీరును బయటకు పంపిచేదే బుడమేరు కాలువ. వర్షాలు పడితే తప్ప ఈ కాలువలో నీళ్లు వుండవు. అటువంటిది విజయవాడను ఎందుకు ముంచెత్తింది.
ఆంధ్రప్రదేశ్ పటంలో బుడమేరు కాలువ గురించి ఎవరికీ తెలియదు. గోదావరి నది నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా క్రిష్ణానదిలోకి గోదావరి నీటిని కలిపేందుకు బుడమేరును కాలువను ఉపయోగించుకోవడంతో అందరికీ బుడమేరు గురించి తెలిసింది. భారీ వరదలు వస్తే తప్ప ఈ కాలువ నిండుతుంది. లేదంటే వట్టిపోతుంది. లేదా గోదావరి నీళ్లు వస్తే కాలువలో కనిపిస్తాయి. అటువంటిది ఈ కాలువ నిండటం ఏమిటి? విజయవాడ మునగటం ఏమిటనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఈ అనుమానం రావడం కూడా సహజమే.
ఇబ్రహీంపట్నాంనికి నాలుగు కిలో మీటర్ల దూరంలో వెలగలేరు ఉంది. ఈ వెలగలేరుకు సమీపంలో భలేరావు చెరువు ఉంది. ఈ చెరువుకు ఒకవైపు కట్ట, మరో వైపు కొండ ఉంటుంది. అందువల్ల చెరువు ఎక్కువ నీటిని ఆపుతుంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి కుడికాలువను భలేరావు చెరువు వరకు తవ్వించారు. ఆ చెరువులోకి నీరు నింపితే చాలా వరకు తాగు, సాగునీటికి పనికొస్తుందని ఆలోచించారు. ఆ తరువాత ఆయన చనిపోవడం, పనులు ఆగిపోవడం జరిగాయి. 2014లో గోదావరి కుడి కాలువను బుడమేరులో కలిపి అక్కడి నుంచి బుడమేరు కాలువ ద్వారా క్రిష్ణా నదిలోకి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి వచ్చే నీటిని పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అప్పుడప్పుడు గోదావరి నీరు క్రిష్ణాలో కలిసినప్పుడు సీఎం చంద్రబాబు కూడా చూసి ఆనందించారు. ఇక్కడ జరిగిందేమిటంటే భలేరావు చెరువులో గోదావరి కాలువ కలుపకుండా దాని పక్కనుంచి కాలువ తీసి బుడమేరులో కలిపారు. ఎందుకంటే చెరువంతా బాగు చేయాలంటే ఎక్కువ ఖర్చవుతుందని భావించిన ప్రభుత్వం ఈ విధంగా చేసింది.
బుడమేరు కాలువలోకి వరదనీరు, వీటీపీఎస్ నుంచి వచ్చే బాయిలర్స్ నీరు కలిపి కాలువ నిండింది. క్రిష్టానది సాగర్ నుంచి ఫుల్ గా వస్తుండటంతో క్రిష్ణాలోకి బుడమేరు నీరు వెళ్లలేకపోయింది. ఆ నీటి ప్రవాహం బుడమేరు నీటిని వెనక్కి నెట్టింది. దీంతో అధికారులు కొందరు రైతుల సాయంతో బుడమేరు కాలువ గేట్లు ఎత్తివేశారు. కాలు ప్రవాహం ఎక్కువ కావడంతో కొండపల్లి దగ్గరలోని శాంతినగర్ నుంచి లాకుల వరకు మూడు గండ్లు పడ్డాయి. మొదట శాంతినగర్ వద్ద పడిన గండి పొలాలపై నుంచి అజిత్ సింగ్ నగర్ వైపు వెళ్లింది. ఆతరువాత దానికి ఒక కిలోమీటరు దూరంలో మరో గండి, లాకులకు సమీపంలో మరో గండి పడ్డాయి. ఈ మూడు గండ్లు విజయవాడ ఉత్తర ప్రాంతాన్ని ముంచెత్తాయి.
మునిగిన ప్రాంతమంతా గతంలో పొలాలు
ప్రస్తుతం విజయవాడ సింగ్ నగర్ ప్రాంతమంతా ఒకప్పుడు వ్యవసాయ పొలాలు. డ్రైనేజీ నీరు ఈ పొలాల నుంచి కాలువలోకి వెళ్లి కొల్లేరు వైపు
. పొలాలు ప్లాట్లగా పెట్టి ఇళ్లు కట్టడంతో ఆ పొలాలకు సమీపంలో ప్రవహిస్తున్న డుడమేరు కాలువకు గండ్లు పడి ఇళ్లను ముంచింది.
మూడో గండి పూడ్చివేత పనులు
ప్రస్తుతం రెండు గండ్లు పూడ్చారు. మూడో గండి పూడ్చివేత శుక్రవారం చేపట్టారు. ఏ రాత్రయినా ఈ గండిని పూడ్చి వరద నీటి ప్రవాహాన్ని ఆపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బుడమేరు నుంచి వస్తున్న నీటిని ఆపకుండా కాలనీల్లో ఎంత మంది తిరిగినా ప్రయోజనం లేదని భావించిన ప్రభుత్వం పూడ్చివేతకు పూనుకుంది. దీంతో ప్రవాహం తగ్గి, ఇళ్ల నుంచి నీరు బయటకు వెళుతోంది. పూర్తిగా రహదారుల్లోని నీరు బయటకు పోవాలంటే వరద నీరు కాలువ నుంచి ఆగిపోవాలి. ఈ రాత్రికి బుడమేరు నుంచి వరదనీరు ఆగుతుంది. దీంతో వరద నుంచి గ్రామాలు బయటపడే అవకాశం ఉంది. బుడమేరు కాలువకు పై భాగంలో ఉండే గ్రామాలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయంటే ఎంతటి వరద వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.
ఏరియల్ సర్వే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బుడమేరు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సింగ్ నగర్ తో పాటు మరో పది ఏరియాలు మునిగిపోవడాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హెలికాఫ్టర్ ద్వా నిర్వహించిన ఈ సర్వేలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు.
మంత్రులు పలువురు వరద బాధితులను పరామర్శించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ మోకాలిలోతు నీటిలో బాధితులను పలకరిస్తూ నడిచారు. వరద సాయం ఈ రోజు నుంచి బాధితులకు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెట్టారు. ఉప ముఖ్యమంత్రి వరద సాయం అందే తీరు ఉండాలో అధికారులకు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులందరూ వరద బాధితులకు సాయం అందించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.
గంగమ్మకు పూజలు
శుక్రవారం నాలుగు అడుగుల మేర వరద నీరు బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో పెరగటంతో గంగమ్మకు స్థానిక మహిళలు పూజలు చేశారు. అమ్మా గంగమ్మా మమ్మల్ని కరుణించమ్మా అంటూ నీటికి శాంతి పూజలు నిర్వహించారు. నీరు బయటకు వెళ్లపోవడంతో బాధిత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓగిరాల గ్రామంలో ఉధ్రుతంగా నది ప్రవహిస్తోంది.