RRR CASE | తులసి బాబూ.. ఎవరి అండ చూసుకుని అంతగా రెచ్చిపోయావ్?
'రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని ఎందుకు కొట్టావు? అలా కొడుతున్నప్పుడు సెల్‌ఫోన్‌లో రికార్డింగ్ చేయాలని ఎందుకు చెప్పావు.. ఎవరి కోసం రికార్డింగ్ చేయించావు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, నరసాపురం మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ నేత కామేపల్లి తులసిబాబును పోలీసులు చాలా సీరియస్ గా విచారిస్తున్నారు. రఘురామ కృష్ణం రాజు ఇటీవలే తులసిబాబు తన గుండెలపై కూర్చుని గుద్దాడని గుర్తించారు. తులసిబాబు గుడివాడ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. కామేపల్లి తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు అత్యంత సన్నిహితుడు, బిజినెస్‌లో పార్ట్‌నర్.ఇప్పుడాయన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారిస్తోంది. పోలీసు కస్టడీలోకి తీసుకున్న తులసిబాబును ఒంగోలుకు తీసుకువచ్చారు. విచారిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎస్పీ బృందం అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.
ఎందుకు కొట్టావు, ఎవరు కొట్టమన్నారు?
'రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని ఎందుకు కొట్టావు? అలా కొడుతున్నప్పుడు సెల్‌ఫోన్‌లో రికార్డింగ్ చేయాలని ఎందుకు చెప్పావు.. ఎవరి కోసం రికార్డింగ్ చేయించావు? సీఐడీ విభాగాధిపతిని కలవాలంటే పోలీసులకే అనుమతి అవసరం, అలాంటిది నేరుగా ఎలా వెళ్లి కలిసేవాడివి? దాడి జరిగినప్పుడు రఘురామ ఉన్న గదిలోకి వచ్చిన ఐదుగురు ఎవరు? రెండు, మూడుసార్లు తలుపులు మూసి తెరిచారంటే.. ఎవరెవరు వచ్చి వెళ్లారు?' అని ఎస్పీ ఏఆర్.దామోదర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం అడిగినట్టు సమాచారం.
'తాను కొట్టలేదని, ఈ కేసుకు తనకు సంబంధం లేదని' తులసిబాబు చెప్పినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సునీల్‌కుమార్‌కు తులసిబాబు ప్రధాన అనుచరుడని, ఆయన ప్రోద్బలంతోనే 2021, మే 14న సీఐడీ కస్టడీలో ఉన్న తన గుండెలపై తులసిబాబు కూర్చుని పిడిగుద్దులు కురిపించి హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 8న విచారణకు హాజరైన తులసిబాబు దర్యాప్తు బృందానికి సహకరించకపోవడంతో అతన్ని అదేరోజు అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేశారు. ఈ నెల 9న గుంటూరు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గుంటూరు జైలులో ఉన్న అతన్ని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారి, ఎస్పీ దామోదర్ కోరగా.. సోమవారం ఉదయం నుంచి ఈ నెల 29 వరకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్యపరీక్షల అనంతరం నేరుగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు జనవరి 27 సోమవారం రాత్రి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయంలోకి తీసుకెళ్లి.. రాత్రి 8.30 గంటల తర్వాత ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.
నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది..
కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో, సీసీ కెమెరాల నిఘాలో విచారణ కొనసాగింది. జిల్లా పోలీసు కార్యాలయం పైకి దండయాత్రగా వచ్చి పోలీసులను దూషించారంటే.. ఎవరి అండ ఉంది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, చట్ట ప్రకారం విచారణకు పిలిచినప్పుడు రావాలి కానీ, గొడవకు దిగితే బాధ్యులపై చర్యలు తప్పవని ఎస్పీ గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విశ్రాంత ఏఎస్పీ విజయ్‌పాల్, తులసిబాబును అరెస్టు చేయగా.. గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రభావతి ఇంటికి నాలుగు సార్లు నోటీసులు అంటించారు. అయినా ఆమె విచారణకు హాజరు కాలేదు. ఆమె ఆచూకీ దొరక్క పోవడంతో ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నట్లు తెలిసింది. ఆమె తన బెయిల్ కోసం చురుగ్గా ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Next Story