ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు

రాజకీయ నాయకులు దేనినో ఒక దానిని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతారు. అయితే ఏపీలో పాలక, ప్రతిపక్షాలు పోలవరం ప్రాజెక్టును పావుగా వాడుకుంటున్నాయి.


పోలవరం ప్రాజెక్టు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అంచనాలు రెండు రెట్లు పెరిగాయి. ఇందుకు పాలక, ప్రతిపక్షాలే కారణం. ఐదేళ్లు టీడీపీ పాలిస్తే, మరో ఐదేళ్లు వైఎస్సార్ సీపీ రాష్ట్రాన్ని పాలించింది. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. 2014లో నాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తయారు చేసిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 16,010.45 కోట్లు. 2024 నాటికి ఆ వ్యయం రూ. 55,548.87 కోట్లకు చేరుకుంది. రూ. 30,436.95 కోట్లకు (ఫేజ్-1) పెరిగింది. ఈ పెరుగుదలకు భూ సేకరణ, R&R వ్యయాలు, డిజైన్ మార్పులు, ద్రవ్యోల్బణం, నిర్మాణ ఆలస్యం, వరద నష్టం ప్రధాన కారణాలు.

రాజకీయ అస్థిరత, కేంద్ర-రాష్ట్ర వివాదాలు ప్రాజెక్టు పురోగతిని మరింత ఆలస్యం చేశాయి. 2027 నాటికి ఫేజ్-1 పూర్తి చేయడానికి కేంద్రం రూ. 12,157 కోట్ల నిధులు విడుదల చేయనుంది. అయితే మిగిలిన వ్యయాలు, R&R సవాళ్లు రాష్ట్రానికి ఇంకా పెద్ద భారంగా ఉన్నాయి.

రెండు దశలు చేసింది జగన్

పోలవరంలో రాజకీయాలు ఉన్నాయి. నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పాలకులు ఎవరి పంథా వారు అనుసరించారని ఇరిగేషన్ ఎక్స్ పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ శంకరయ్య అన్నారు. శనివారం ఆయన ’ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‘తో మాట్లాడారు. ఈ మేరకు కేంద్రానికి జగన్ లేఖ రాసింది వాస్తవమన్నారు. ఇందుకోసం రూ. 35వేల కోట్లతో ఎస్టిమేషన్ వేసి కేంద్రానికి పంపిస్తే రూ. 5వేల కోట్లు తగ్గించి ఆమోదించినట్లు తెలిపారు. ఎన్నికల సమయం వరకు ఈ ప్రతిపాదన మూలన ఉందని, ఎన్నికలు నిర్వహించే సమయంలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ ఈ ప్రతిపాదనలు బయటకు తీసినట్లు చెప్పారు. అయితే ఎన్నికలు రావడంతో బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరటంతో ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఏ విధమైన వత్తిడి తీసుకురాలేదన్నారు. తొలిదశ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రెండో దశ గురించిన ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో రెండో దశ ఉందని, దానిని కేంద్రం ఆమోదించాల్సి ఉందనే విషయం చాలా మందికి తెలియదన్నారు.

ప్రాజెక్టు వ్యయం ఎలా పెరిగిందంటే...

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మితమవుతున్న బహుళార్థసాధక జాతీయ ప్రాజెక్టు పోలవరం. 2014 నుంచి దాని అంచనా వ్యయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ పెరుగుదలకు ద్రవ్యోల్బణం, భూ సేకరణ, పునరావాస వ్యయాలు, డిజైన్ మార్పులు, రాజకీయ అస్థిరత, నిర్మాణ ఆలస్యం వంటి అనేక కారణాలు పాలకులు చూపిస్తున్నారు 2014 నుంచి ప్రాజెక్టు వ్యయం ఎలా పెరిగిందో.. దానికి గల కారణాలను ఒకసారి పరిశీలిద్దాం...

2010-11 ధరల స్థాయి (2014లో ఆమోదం): రూ. 16,010.45 కోట్లు అంచనా వ్యయం. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఈ సమయంలో 2010-11 ధరల స్థాయిలో ప్రాజెక్టు వ్యయం రూ. 16,010.45 కోట్లుగా అంచనా వేశారు. ఈ అంచనా ఎక్కువగా సాంకేతిక నిర్మాణం, కాలువలు, ఆనకట్ట నిర్మాణంపై దృష్టి సారించింది. అయితే భూ సేకరణ, పునరావాస వ్యయాలు (R&R) సరిగా సరిగా లెక్కలు లేకపోవడం కూడా ప్రభుత్వం లోపంగా చెప్పొచ్చు.

2013-14 ధరల స్థాయి (2014లో సమర్పణ): రూ. 57,940.86 కోట్లు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సవరించిన అంచనా వ్యయాన్ని రూ. 57,940.86 కోట్లుగా సమర్పించింది.

వ్యయం పెరుగుదలకు ప్రభుత్వాలే కారణం: శోభనాధ్రీశ్వరరావు

పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరగటానికి ప్రాజెక్టును అనుకున్న ప్రకారం నిర్మాణం చేయకపోవడమే కారణ మని మాజీ మంత్రి వడ్డె శోభనాధ్రీశ్వరరావు అన్నారు. ఇందుకు ఎన్డీఏ కూటమి, (తెలుగుదేశం), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కారణం. వీరు రాజకీయ అవసరాల కోసం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.


పెరుగుదలకు కారణాలు

భూ సేకరణ, పునరావాసం: 2013లో ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ యాక్ట్ (LARR) అమలులోకి రావడం వల్ల భూ సేకరణ, R&R వ్యయాలు విపరీతంగా పెరిగాయి. R&R కోసం దాదాపు రూ. 28,191 కోట్లు అంచనా వేశారు.

డిజైన్ మార్పులు: సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సిఫారసుల మేరకు స్పిల్‌వే డిజైన్‌ను 1,02,000 క్యూమెక్స్ నుంచి 1,42,000 క్యూమెక్స్‌కు సవరించారు. దీనివల్ల నిర్మాణ వ్యయం పెరిగింది.

ద్రవ్యోల్బణం: నిర్మాణ సామగ్రి, కార్మిక వ్యయాలలో ద్రవ్యోల్బణం కారణంగా వ్యయం పెరిగింది.

2015లో రాష్ట్ర అంచనా: ₹36,000 కోట్లు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 36,000 కోట్లకు సవరించింది. R&R వ్యయాలలో పెరుగుదల, నిర్మాణ కాంట్రాక్టర్ (ట్రాన్స్‌ట్రాయ్) ద్రవ్యోల్బణం కారణంగా అదనపు వ్యయాన్ని డిమాండ్ చేశారు. ఆలస్యం వల్ల నిర్మాణ పనులు ఆగిపోవడం, దీనివల్ల కాంట్రాక్టర్‌కు అదనపు ఖర్చులు చెల్లించాల్సి రావడం జరిగాయి.

2017-18 ధరల స్థాయి (2019లో ఆమోదం): రూ. 55,548.87 కోట్లు. 2019లో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) 2017-18 ధరల స్థాయిలో రూ. 55,548.87 కోట్ల సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించింది.

రివైజ్డ్ కాస్ట్ కమిటీ (RCC): రూ. 47,725.74 కోట్లను సిఫారసు చేసినప్పటికీ, CWC మొత్తం రూ. 55,548.87 కోట్లను ఆమోదించింది. ఇందులో భూ సేకరణ, R&R కు రూ. 33,168.23 కోట్లు (మొత్తం వ్యయంలో సగం కంటే ఎక్కువ).

సాంకేతిక నిర్మాణం: ఆనకట్ట, కాలువలు, 960 మెగావాట్ల హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కోసం మిగిలింది కేటాయించారు.

అధిక R&R వ్యయాలు: దాదాపు 1.05 లక్షల కుటుంబాలు (3.15 లక్షల మంది) స్థలం మారడం (displacement) వల్ల దీనికి అంచనా వ్యయం రూ. 29,000 కోట్లు అవుతుందని నిర్ణయించారు.

నిర్మాణ ఆలస్యం: 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ. 11,762 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం రూ. 4,167 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల పనులు ఆగిపోయాయి.

డిజైన్ సవరణలు: డ్యామ్ డిజైన్‌లో భద్రతా మార్పులు (ఉదా. ఎర్త్ డ్యామ్ గ్యాప్‌లు, స్పిల్‌వే క్రెస్ట్ లెవెల్) వల్ల వ్యయం పెరిగింది.

2020లో కేంద్రం క్యాప్: రూ. 20,398.61 కోట్లు. 2020లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు వ్యయాన్ని 2013-14 ధరల స్థాయిలో రూ. 20,398.61 కోట్లకు క్యాప్ చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.

రాష్ట్రం ఈ అంచనా అవాస్తవమని, నిర్మాణం, R&R వ్యయాలు విపరీతంగా పెరిగాయని వాదించింది. జగన్‌మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి, ఈ క్యాప్ వల్ల ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోతుందని హెచ్చరించారు.

2021లో సవరణ: మొత్తం బడ్జెట్ రూ. 57,205.87 కోట్లు. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఆనకట్ట వ్యయాన్ని రూ. 1,657 కోట్లు పెంచి, మొత్తం వ్యయాన్ని రూ. 57,205.87 కోట్లకు సవరించింది.

డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ (DDRP) సిఫారసుల ప్రకారం ఎర్త్ డ్యామ్ గ్యాప్‌లు, స్పిల్ చానెల్, హైడ్రోఎలక్ట్రిక్ పవర్ హౌస్ ఫౌండేషన్‌లలో మార్పులు జరిగాయి. గ్రావెల్ తవ్వకం పరిమాణం 32 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి 1.16 కోటి క్యూబిక్ మీటర్లకు పెరిగింది.

2023లో ప్రతిపాదిత సవరణ (ఫేజ్-1): రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1 (41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ) పూర్తి చేయడానికి రూ. 17,144 కోట్ల సవరించిన అంచనాను ప్రతిపాదించింది. ఇది పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA), CWC పరిశీలనలో ఉంది. అదనంగా 2019లో గోదావరి వరదల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో రిపేర్‌ల కోసం రూ. 2,000 కోట్లు కేటాయించాలని కేంద్రం పరిశీలిస్తోంది.

2024లో సవరించిన అంచనా (ఫేజ్-1): రూ. 30,436.95 కోట్లు. 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఫేజ్-1 (41.15 మీటర్ల ఎత్తు వరకు) పూర్తి చేయడానికి రూ. 30,436.95 కోట్ల సవరించిన అంచనాను ఆమోదించింది. ఈ అంచనాలో మిగిలిన పనుల కోసం రూ. 12,157.53 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఇది 2024-25లో రూ. 6,000 కోట్లు. 2025-26లో రూ. 6,157 కోట్లుగా విడుదల చేయాల్సి ఉంటుంది.

2019లో జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ మార్పు, రివర్స్ టెండరింగ్ విధానం వల్ల పనులు ఆగిపోయాయి. దీనివల్ల రూ. 4,900 కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం (రూ. 993 కోట్లు) రిపేర్ పనులు చేపట్టారు.

వ్యయం ఎందుకు పెరుగుతోందంటే...

భూ సేకరణ, పునరావాస వ్యయాలు (R&R): 2013 LARR చట్టం అమలు తర్వాత, భూ సేకరణ, R&R వ్యయాలు అతిగా పెరిగాయి. ప్రాజెక్టు వల్ల 1.80 లక్షల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇందులో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి, 9,000 ఎకరాల అటవీ భూమి ఉన్నాయి. 44,574 కుటుంబాలను మొదట అంచనా వేయగా, ఇప్పుడు 1.05 లక్షల కుటుంబాలు ఉన్నందున ముందు అనుకున్న స్థలం కాకుండా మార్పు చేయాల్సి ఉంటుంది. దీనికి రూ. 29,000 నుంచి రూ. 33,168 కోట్లు అవసరం అవుతాయి.

డిజైన్ మార్పులు, భద్రతా సవరణలు: CWC 2006లో గోదావరి వరద స్థాయిని 1,02,000 క్యూమెక్స్ నుంచి 1,42,000 క్యూమెక్స్‌కు సవరించింది. దీనివల్ల స్పిల్‌వే డిజైన్ మార్పులు అవసరమయ్యాయి. 2021లో DDRP సిఫారసుల ప్రకారం ఎర్త్ డ్యామ్ గ్యాప్‌లు, స్పిల్ చానెల్, పవర్ హౌస్ ఫౌండేషన్‌లలో మార్పులు చేయాల్సి వచ్చింది.

2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 79.61 శాతం పనులను పూర్తి చేసినప్పటికీ, 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ మార్పు, రివర్స్ టెండరింగ్ విధానం వల్ల పనులు నిలిచిపోయాయి. ఈ ఆలస్యం వల్ల రూ. 4,900 కోట్ల నష్టం, 38శాతం వ్యయం పెరిగింది.

కేంద్రమే వర్క్ చేపట్టి ఉంటే బాగుండేది: రిటైర్డ్ ఈఎన్సీ

పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన వెంటనే పనులు కేంద్రం చేపట్టి ఉంటే పనులు వేగంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండేవని ఇరిగేషన్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కె సతీష్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి కారణాలు అనేకం ఉంటాయని, టెక్నికల్ సమస్యలు 60 శాతం ఉంటే మిగలిన సమస్యలు 40 శాతం ఉంటాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇన్వెష్టిగేషన్, న్యాచురల్ కలామెటీస్, ఫండ్స్ ముఖ్యమని, ఇన్వెష్టిగేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి సహజమని, పైగా గోదావరి కాబట్టి వరదలు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. నిధులు సకాలంలో విడుదలైతే పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇక ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరి ప్రయారిటీలు వారికి ఉంటాయని చెప్పారు.

నిర్మాణ గడువుపై వైరుద్యాలు

పోలవరం ప్రాజెక్టు పూర్తి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పలు సందర్భాల్లో వివిధ గడువులు ప్రకటించారు. 2024 డిసెంబర్‌లో ఆయన ప్రాజెక్టు స్థలంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 అక్టోబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ గడువు కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం 2025 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని, ఎర్త్-కమ్-రాక్‌ఫిల్ (ECRF) డ్యామ్ నిర్మాణం సమాంతరంగా జరుగుతుందని అధికారులు సూచించిన నేపథ్యంలో వచ్చింది.

గతంలో చంద్రబాబు నాయుడు 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని 2024 ఆగస్టు, నవంబర్‌లలో ప్రకటించారు. ఈ వైరుధ్య గడువులు ప్రాజెక్టు సంక్లిష్టత, భూసేకరణ, పునరావాసం, సాంకేతిక సవాళ్లు, ఆర్థిక ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు. ఉదాహరణకు 16,440 ఎకరాల భూసేకరణ, 2026 నాటికి పునరావాసం పూర్తి చేయాల్సిన అవసరం, రూ. 12,157 కోట్ల నిధుల సమీకరణ వంటి అంశాలు గడువును ప్రభావితం చేస్తాయి.

డయాఫ్రం వాల్ నిర్మాణం 2025 జనవరిలో ప్రారంభమైంది. 2026 మార్చి నాటికి పూర్తవుతుందని అంచనా. ఎడమ కాలువ పనులు 77 శాతం పూర్తయ్యాయి. మిగిలినవి 2025 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఉంది. కేంద్రం రూ. 12,157 కోట్ల నిధులను రెండు విడతల్లో (2024-25లో రూ. 6,000 కోట్లు, 2025-26లో రూ. 6,157 కోట్లు) కేటాయించింది. ఇది పనులను వేగవంతం చేయడానికి సాయపడుతుంది.

2026 అక్టోబర్ గడువు సాధించడం సాధ్యమే, కానీ ఇది సాంకేతిక ఆమోదాలు, నిధుల విడుదల, పునరావాస పనుల వేగంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ అంశాల్లో జాప్యం జరిగితే, 2027 మార్చి లేదా అంతకు మించి ఆలస్యం కావచ్చు. ప్రాజెక్టు పూర్తయితే... 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు జీవఫలంగా మారుతుంది.

ప్రాజెక్టు చరిత్ర

ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే... 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమై, 33 శాతం పనులు 2014 నాటికి పూర్తయ్యాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 71 శాతం సివిల్ పనులను పూర్తి చేసిందని, 2019-24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో కేవలం 4 శాతం పురోగతి సాధించిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 2020 లో జరిగిన వరదలు డయాఫ్రం వాల్‌కు నష్టం కలిగించాయి. ఇది ఆలస్యానికి ప్రధాన కారణం.

Next Story