దేశంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. అక్కడి ఎంపీలు ప్రజా ప్రతినిధులు కాదా?


దేశంలో అధికార పక్షమే పాలకులని, ప్రతిపక్షంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నా వారు పాలకులు కాదని ఎంతో కాలంగా అధికార పార్టీలు భావిస్తున్నాయి. ఈ పద్ధతి ఎప్పటికి మారుతుందో తెలియాదు. దేశంలో ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. అందులో కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఆ పార్టీ కూడా ‘ఇండియా’ కూటమి పేరుతో కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతిపక్షంలో గెలిచిన వారిని పూచిక పుల్లలా తీసేస్తున్నారు. పాలక పక్షం వారిలో ఈ సంస్కృతి ఉన్నంత కాలం అభివృద్ధి అనేది కలగానే ఉంటుందని పలువురు రాజకీయ మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇవ్వలేదు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు పైసా కూడా కేటాయింపులు లేవు. కేంద్ర బడ్జెట్‌ ప్రభుత్వ శాఖలకు కేటాయింపులలోను ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక ప్రాజెక్టును ప్రకటిస్తే ఆయా రాష్ట్రాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. కేంద్రానికి నిధుల కొరత ఉందని, రాష్ట్రాలపై ఆధార పడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని, అందువల్ల తాము ఏ రాష్ట్రానికీ ఎటువంటి నిధులు ఇవ్వలేమని చెప్పిఉంటే ఎవరైనా మాట్లాడేవారు కాదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏదో ఒక తాయిలం ఇచ్చి మిగిలిన రాష్ట్రాలకు ఏమీ ఇవ్వకపోవడం చర్చకు దారి తీసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం అప్పుగా రూ. 15వేల కోట్లు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి బడ్జెట్‌లో కేటాయించారు. వెనుక బడిన అభివృద్ధి ప్రాంతాలకు నిధులు అన్నారే కాని ఎంత ఇస్తారు? ఎలా అభివృద్ధి చేస్తారనేది స్పష్టం చేయలేదు. తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయినా అక్కడి నుంచి ఎంతో మంది ఎంపీలు ఎన్నికై దేశానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు వారు ఏమని సమాధానం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది.
విదేశాలకు చేసే సాయం రాష్ట్రాలకు చేయలేరా?
కేంద్ర బడ్జెట్‌లో బూటాన్‌కు రూ. 2,068 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, మాల్దీవులకు రూ. 400 కోట్లు, మారిషస్‌కు రూ. 370 కోట్లు, శ్రీలంకకు రూ. 245 కోట్లు సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. కానీ దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలకు సున్నా బడ్జెట్‌ ఇచ్చారు. ఇదేమి న్యాయమని వారు అడిగితే కేంద్ర ప్రభుత్వ నేతలు మీ రాష్ట్రాలు మా పరిధిలోవి కావన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story