పుట్టిన రోజు నాడూ ఎవ్వరికీ పట్టని చిత్తూరు జిల్లా!
x
చిత్తూరు

పుట్టిన రోజు నాడూ ఎవ్వరికీ పట్టని చిత్తూరు జిల్లా!

ఆధ్యాత్మికతకు నెలవు చిత్తూరు. తన పుట్టినరోజును మౌనంగా జరుపుకుంది. ఎవరూ.. పట్టించుకునే దిక్కు లేక!


(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: ఏప్రిల్ 1.. అంటే ఫూల్స్ డేగా పాటిస్తారు. ఇప్పుడు అది సందర్భంగా కాదు. జోక్ చేసే సమయం అంతకన్నా కాదు. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు ఈరోజు విశిష్టమైనది. ఒక చారిత్రక నేపథ్యం కలిగినది. ఎందుకంటే.. మనుషులకు పుట్టిన రోజులు ఉంటాయి. చెట్టూ పుట్టకు కూడా వయసును నిర్ధారించే ప్రమాణాలు ఉన్నాయి. ఊర్లకు కూడా పుట్టిన రోజులు ఉన్నాయి. ఆధ్యాత్మిక నగరి తిరుపతి కూడా గత నెలలో పుట్టిన రోజు జరుపుకుంది. అదేవిధంగా... ఈ ఏప్రిల్ 1వ తేదీన చిత్తూరు జిల్లా పుట్టినరోజు జరుపుకుంది. అధికారులు ఎన్నికల్లో నిమగ్నమయ్యారు. రాజకీయ వేత్తలు వాళ్ళ వ్యాపకాల్లో తలమునకలుగా ఉన్నారు. ఇవన్నీ తెలియని చిత్తూరు జిల్లా చరిత్ర మౌనంగా తన పుట్టినరోజు మూగగా కాలచక్రంలోకి సాగిపోయింది. ఎందుకిలా..

చిత్తూరు జిల్లా మూడు రాష్ట్రాలకు కూడలిగా ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుగుతోపాటు తమిళం , కన్నడ భాషలతో మిళితమై ఉంటాయి. స్వాతంత్ర ఉద్యమంలో చారిత్రక మైలురాళ్లకు కూడా చిత్తూరు జిల్లా వేదికగా నిలిచింది. భారత జాతీయ గీతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి మదనపల్లి బీటీ కాలేజీలో అనువాదం చేసిన ఘటన చరిత్రలో నిశ్శబ్దమైంది. ఈ జిల్లా ప్రాశస్త్యం తెలిసిన వ్యక్తులకు కొదవలేదు. కవులు, కళాకారులకు అంతకన్నా తక్కువ లేదు. జిల్లా గురించి మాట్లాడే... తీరిక, ఓపిక లేదేమో అనిపిస్తుంది. అసలు మనం పుట్టిన ఊరు గురించి మనకు తెలుసా? లేదా? తెలిస్తే మరిచిపోయారా? ఈ ప్రశ్నలకు కవులు, కళాకారులు, చరిత్రకారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మూడు భాషలు.. సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు వ్యవహారలే కాదు..! ఆధ్యాత్మిక ఆలయాల సంపదకు కొలువుగా ఉన్న చిత్తూరు జిల్లాకు ఘనమైన చరిత్ర ఉంది.. అదేంటో ఒకసారి పరిశీలిద్దాం...1911 ఏప్రిల్ 1.. 19వ శతాబ్దంలో పూర్వపు మద్రాసు రాష్ట్రంలో ఆర్కాట్ జిల్లాగా విభజించి చిత్తూరులో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న చిత్తూరు జిల్లా పురుగుని తమిళనాడు, కర్ణాటకకు సరిహద్దులో ఉంది. చిత్తూరులో సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు, తమిళం, కన్నడ భాషలతో మిళితమై ఉంటాయి. 1911లో ఏర్పాటైన చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు పలమనేరు, చంద్రగిరి, అప్పటి కడప జిల్లాలోని మదనపల్లి వాల్మీకిపురం తాలూకాలతో పాటు, పుంగనూరు శ్రీకాళహస్తి పుత్తూరు, పాత కార్వేటి నగరం ఎస్టేట్లోని మాజీ జమీందారుల ప్రాంతాలు ఉండేవి.

ఆ తర్వాత నార్త్ ఆర్కాట్ జిల్లాలోని కంగుంది తాలూకా (కుప్పం సమీపంలో ఉన్న కోట) లోని గ్రామాలను మినహాయించి, పలమనేరు తాలూకాలోకి 1928 డిసెంబర్ 1వ తేదీన తెలిపారు. ఈ తాలూకా ప్రావిన్స్, మైసూరు రాష్ట్రంలోని ఎన్‌క్లేవ్‌గా ఉన్న ఎనిమిది గ్రామాలను కూడా ఇందులో కలిపారు. 1960 ఏప్రిల్ ఒకటో తేదీ జరిగిన పటాస్కర్ అవార్డు ఫలితంగా భాష ప్రాతిపదికన రాష్ట్రాల వ్యవస్థీకరణ జరిగింది. తిరుత్తని తాలూకాలను చాలా భాగం చెంగల్ పట్టు జిల్లాకు బదిలీ చేశారు. తిరువళ్ళూరు తాలూకాలోని 72 గ్రామాలు, పుత్తూరు తాలూకాలో 17, తిరుత్తణి 19 గ్రామాలతో సత్యవేడు తాలూకాను చిత్తూరులో కలిపారు. అలా... కుప్పం, పలమనేరు, పాలెం తాలూకాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1985లో జిల్లాలో 66 రెవెన్యూ మండలాలుగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 31 మండలాలు, నాలుగు రెవెన్యూ డివిజన్లతో 2022 ఏప్రిల్ 4వ తేదీ చిత్తూరు జిల్లాను పునర్వ్యవస్థీకరించారు.

ఆధ్యాత్మికతకు నెలవు

చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం, శ్రీకాళహస్తిలోని శివాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. సౌభాగంగా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతంలో టమాటా, వేరుశనగ, తూర్పు ప్రాంతంలో చెరకు పంటలకు, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందినవి. ఆంధ్ర వూటీగా నిలిచిన హార్‌స్లీ హిల్స్ మదనపల్లి సమీపంలో ఉంది. ఈ పట్టణంలో ఉన్న బీటీ కాలేజీ ఎంతో చరిత్ర కలిగినటువంటి విద్యాసంస్థ. గుర్రంకొండ కోట కూడా చారిత్రాత్మకమైనది. ఎంతటి ఘనమైన చరిత్రను కలిగిన చిత్తూరు జిల్లా పుట్టినరోజును అందరూ మర్చిపోయారు. ఆవిర్భావ దినోత్సవం జరపాలనే ఆలోచన కూడా మరిచిపోయారు. చిత్తూరు జిల్లా చరిత్ర మనందరినీ క్షమిస్తుందని ఆశిద్దాం.



Read More
Next Story