అవును, వాళ్లిద్దరూ జైల్ మేట్స్. ఆ తర్వాత పొలిటికల్ మేట్స్, ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మంత్రి. దశాబ్ద కాలానికి పైగా కలిసి మెలిసే ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి ఓడిపోయారు. ఈ రాజకీయ వేత్త ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఇంతకీ ఆ ఇద్దరెవరంటే ఒకరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రెండు మోపిదేవి వెంకటరమణ.
మోపిదేవి వెంకట రమణ వైసీపీ నుంచి బయటకు వస్తూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పార్టీలో ఉన్నప్పుడు తాను ఘోరంగా అవమానానికి గురైనట్టు చెప్పుకొచ్చారు. అంతటి ఘోరం ఏమి జరిగిందీ, జగన్ ను మోపిదేవి అంతలా ఎందుకు విమర్శించాల్సి వచ్చిందీ?
వైసీపీ పుట్టుక నుంచే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద దిక్కు. అయితే జగన్ తీరుతో పార్టీలో ఇమడలేకపోతున్నట్టు మోపిదేవి చెప్పారు. జగన్ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని టిడీపీలో చేరుతున్నారు. నిజానికి జగన్ కి మోపిదేవికి మధ్య వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచే పరిచయం ఉంది. క్విడ్ ప్రో కో కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు మోపిదేవి తోటి ఖైదీగా ఉన్నారు. జైల్లో బాగా సన్నిహితమయ్యారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చి తన సరసన కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గాని ఆ మంత్రి పదవి నుంచి తప్పిలో రాజ్యసభకు పంపారు. ఢిల్లీలో తనకు ఓ నమ్మకస్తుడు ఉండాలనే భావనతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసి ఉంటారనుకున్నారు. కానీ అది మోపిదేవికి నచ్చలేదు.
అసలేం జరిగిందంటే...
2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలన్నది మోపిదేవి ఆకాంక్ష. అందుకు జగన్ ఒప్పుకోలేదు. తనకు సీటు ఇవ్వకపోయినా తన తమ్ముడికైనా సీటు ఇమ్మని కోరాడు. అందుకు కూడా జగన్ అంగీకరించలేదు. ఎన్నికల తేదీ వచ్చే వరకు ఆయన అలా అడుగుతూనే ఉన్నారు. జగన్ తిరస్కరిస్తూనే వచ్చారు. పదే పదే మోపిదేవి అడగడంతో ఓదశలో జగన్ విసుక్కుని "సీట్ల కోసమైతే నా ఇంటికి రావొద్దన్నారని" అందుకు మోపిదేవి నొచ్చుకున్నారని అంటారు. ఇక అప్పటి నుంచి మోపిదేవి లోలోన కుమిలిపోవడం మొదలుపెట్టి వైసీపీ ఓటమితో ఆ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారని చెబుతారు ఆయన అనుచరులు.
మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకి వైసీపీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఆయన మాట ఎన్నడూ చెల్లుబాటు కాలేదని కూడా ఆయనే స్వయంగా వాపోయారు. సీట్ల ఖరారు విషయంలో మాటవరసకి కూడా తన అభిప్రాయం తీసుకోకపోవడాన్ని మోపిదేవి అవమానంగా ఫీలయ్యారు. "నేను నలుగురికి సీట్లు ఇప్పించే దశ నుంచి నా సీటు కోసం కూడా అడుక్కోవాల్సివచ్చింది. అయినా ఫలితం లేకపోయింది" అని ఇటీవల మోపిదేవి స్వయంగా చెప్పుకొచ్చారు.
వైసీపీ ఓటమి పాలయినప్పటి నుంచి మోపిదేవి జగన్ తో అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలనుకున్నారు. మోపిదేవి రాజీనామాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నాయకులు కూడా ఆయన్ను అనుసరించవచ్చు. మాజీ ఎమ్మెల్యేలు మద్ధాళి గిరి, కిలారి రోశయ్ మోపిదేవి బాట పడుతున్నారు. ఈ సందర్భంలో ఆయనకు ఇటీవల టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర సమక్షంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
నాలుగేళ్లు నరకం అనుభవించారా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి, ఎమ్మెల్యేసీటుకు బదులు రాజ్యసభ సీటు ఇచ్చినా నరకం అనుభవించానంటున్నారు "వైసీపీలో గత నాలుగేళ్లుగా నరకం అనుభవించా. చీకట్లో మగ్గా. నా నియోజకవర్గ ప్రజలకు కూడా మంచి చేయలేకపోయా. ఎంతో చిత్తశుద్ధితో రాజకీయం చేసినా జగన్ గుర్తించలేదు. వైసీపీలో అంత నరకం అనుభవించాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఆ క్రమంలోనే నాకూ జగన్ కి మధ్య గ్యాప్ వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు ఎంతో కలత చెందేలా చేశాయి. నేను ఎవరికి ద్రోహం చేయలేదు. నాకే చేయాలని కొందరు చూశారు. వైఎస్ జగన్ తో కలిసి ఉండడానికి మనసు అంగీకరించలేదు" అన్నారు మోపిదేవి. అయితే మోపిదేవి ఆరోపణలను వైసీపీ ఖండించకపోవడం గమనార్హం.