కింగ్ మేకర్ జోకరెందుకైంది!  ఏపీలో బీజేపీ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందీ
x

కింగ్ మేకర్ జోకరెందుకైంది! ఏపీలో బీజేపీ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందీ

నానాటికీ తీసికట్టు నాగంబొట్లు అన్నట్టుగా ఉంది ఏపీ బీజేపీ పరిస్థితి. పదేళ్ల కిందట చక్రం తిప్పిన కమలం ఇప్పుడు కుదేలైంది. ఎన్ని ప్రయోగాలు చేసినా కదలనంటోంది. నిజమా


కింగ్ మేకర్ కాస్తా జోకరెందుకైంది!

ఏపీలో బీజేపీ గ్రాఫ్ ఎందుకు పడిపోయిందీ?

మొన్న కన్నా లక్ష్మీనారాయణ.. నిన్న సోము వీర్రాజు.. ఇవాళ పురంధేశ్వరి.. ఐదేళ్లలో ముగ్గురు రాష్ట్రాధ్యక్షుల్సి మార్చిన ఏకైక పార్టీ బీజేపీ. తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమలం పరిస్థితి ఇది. పార్టీ అవసరాలకు తగ్గట్టుగా అధ్యక్షుల్ని మార్చుకోవడం, పార్టీ నిర్మాణాన్ని కట్టుదిట్టం చేసుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరమే. చిత్రమేటంటే బీజేపీ అధ్యక్షుల్ని మార్చినప్పుడల్లా ఆపార్టీ బలం తగ్గుతూనే వస్తోంది తప్ప పెరగడం లేదు. సోము వీర్రాజు లాంటి ఆర్ఎస్ఎస్ పునాదులున్న వాళ్లు తప్ప కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లైతే ఏకంగా వేరే పార్టీలకు వెళుతున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు కుమార్తె, ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి, చంద్రబాబు నాయుడి గారి వదిన పురంధేశ్వరి కమలం పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈమెకు బీజేపీకి పునాదిరాళ్లయిన ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ, కిసాన్ మోర్చా వంటి వాసనలు లేవు. అయినా సరే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమెపై నమ్మకం ఉంచి సామాజిక సమీకరణాలను బేరీజు వేసి పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించింది. ఇంతవరకు మంచిదే అయినా సాక్షాత్తు బీజేపీ అగ్రనాయకత్వమే ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కితే ఇప్పుడామె పార్టీని రాష్ట్రంలో ఏమి బాగు చేస్తారన్న విమర్శలూ లేకపోలేదు. పురంధేశ్వరి నియమాకంపైనా పార్టీకి సుదీర్ఘకాలం కొమ్ముకాసిన వాళ్లలో అంతోఇంతో అసహనమూ లేకపోలేదు.

ఎదగాల్సిన పార్టీ ఎందుకు తగ్గుతోంది..

2018 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరుగా ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గ్రాఫ్ ఢమాల్న కిందకు పడిపోయింది. అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు కింగ్ మేకర్‌ అనుకున్న బీజేపీ ఇప్పుడు ఒంటరిగా ఉంది. తిరిగి సొంతంగా పట్టు సాధించడానికి కష్టపడుతోంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 7.22 శాతం. 2019లో ఇది దాదాపు 0.98%కి పడిపోయింది. అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 2014లో 4.13 శాతమైతే 2019లో 0.84%కి పడిపోయింది. 2022లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లోనైతే కమలం పరిస్థితి మరీ దారుణం. ప్రాంతీయ పార్టీ తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు ఈ జాతీయ పార్టీ 2014లో నాలుగు అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌సభ సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి పవన్ కల్యాణ్ పార్టీ జనసేన (జేఎస్పీ) కూడా మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఎవరికి వారు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అందరూ తమకు తామే కింగ్ లమనుకున్నారు. సొంతంగా పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. టీడీపీతో సహా మిగతా అన్ని పార్టీలు కుప్పకూలాయి. బీజేపీ దాదాపు ఖాలీ అయింది. అప్పటి నుంచి కమలాన్ని పరిమణింపజేసేందుకు చేస్తున్న ఏ ప్రయత్నమూ గట్టెక్కలేదు. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాభవం ఇందుకు నిదర్శనం.

కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు...

కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు బీజేపీ పతనానికి అనేక కారణాలున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తిరుపతిలో సాక్షాత్తు నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నది రాజకీయవేత్తలు, పరిశీలకుల భావన. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ ఫ్రంట్ (యూపీఏ) చెప్పినప్పుడు, ఐదేమి సరిపోతుంది ఏకంగా 10 ఏళ్లు ఇస్తామని వెంకయ్య నాయుడు సహా బీజేపీ సీనియర్లందరూ హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు.

ప్రత్యేక హోదాకు మంగళం...

ప్రత్యేక హోదా ఇవ్వలేం ప్యాకేజీ ఇస్తామన్నారు. దానికి చంద్రబాబు ఓకే అని తప్పుతెలుసుకునే లోగా చేతులు కాలాయి.అది వేరే ముచ్చట. ప్రత్యేక ప్యాకేజీని ఆంధ్ర ప్రజలు అంగీకరించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవసరమైన ప్రాథమిక ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్ కు లేవని, అందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఫైనాన్స్ కమిషన్‌ చెప్పినట్టు బీజేపీ చెప్పుకొచ్చింది. ఇదంతా నాటకమేనని ఏపీ ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు. బీజేపీ, టీడీపీల మధ్య వివాదానికి కారణమైంది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. బీజేపీ ఆంధ్రా పట్ల వివక్ష, పక్షపాతం చూపుతోందని ప్రజలు బహిరంగంగానే విమర్శించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆంధ్రా ప్రజలు తిట్లు, శాపనార్ధాలకు లంకించుకున్నారు.

పోలవరం పాపం ఎవరిదీ?

ఇక రెండో కారణం పోలవరం.. ఈ ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడేమి జరిగిందో సామాన్య జనానికి తెలియకపోయినా నిధులు ఇవ్వలేదన్నది బహిరంగ రహస్యం. టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు కూడా అదే చెబుతున్నాయి. 2023 సెప్టెంబర్ మొదట్లో పోలవరం ప్రాజెక్ట్ కు 12 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్లేట్ ఫిరాయించింది. సవరించిన ప్రాజెక్ట్ ఖర్చుల్ని జమ చేయడంలో జగన్ ప్రభుత్వమే ఆలస్యం చేసిందని బట్టకాల్చి మొహం మీద వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్‌ను రూపొందించాలనే ఆలోచన చేసింది. అందుకు ఆనాటి సీఎం చంద్రబాబు అంగీకరించ లేదు. రాష్ట్రమే నేరుగా నిధులను ఖర్చు పెడుతుందన్నారు. చేతులు కాల్చుకున్నారు. ప్రతి సోమవారం.. పోలవరం అంటూ జాప్యం చేశారు. దెబ్బతిన్నారు. ఇప్పుడు వైసీపీ వచ్చాక కూడా నిధులు లేక ఈ జాతీయ ప్రాజెక్ట్ కునారిల్లుతోంది.

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు తుప్పు...

ఇక, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం.. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కంటూ పోరాడి సాధించుకున్న స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఈ రాష్ట్రంలో బీజేపీని ఏమాత్రం క్షమించరాని విషయం. బీజేపీని దెబ్బతీసే తాజా అంశం. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు తంటాలు పడొచ్చుగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు బీజేపీ ఏమి చెప్పినా ప్రయోజనం ఉండదన్నది ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటం చేస్తున్న వామపక్ష నేతల అభిప్రాయం.

బీజేపీ వాదన ఎలా ఉందంటే...

వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నేరవేర్చామని ఓ లెక్క చెబుతున్నారు. ఆరు జాతీయ సంస్థలు - ఐఐటి తిరుపతి, ఎన్‌ఐటి-ఆంధ్రప్రదేశ్, ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎస్‌ఇఆర్ తిరుపతి, సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ-విశాఖపట్నం -వంటివి మేమిచ్చినవి కావా అని వాదిస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రానున్నాయి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్థలం ఇచ్చి ఉంటే మరికొన్ని సంస్థలు వచ్చేవన్నది కూడా బీజేపీ నేతల మాట. పీఎం గతి శక్తి ప్రోగ్రామ్ కింద ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఎన్డీఏలోకి పవన్ కల్యాణ్...

ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటున్నారు పవన్ కల్యాణ్. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కల్యాణ్..బీజేపీని కలుపుకుని వస్తానంటున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్టీల మీటింగ్ కి వెళ్లి మోదీని కలిసివచ్చారు. పవన్ నిర్ణయాన్ని బీజేపీ అధిష్టానం అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి. మరోపక్క బీజేపీకి అంతర్గత సమస్యలున్నాయి. మూడేళ్ళలో మూడుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. బలమైన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా కూడా ఖరారు కాలేదు. కొత్తగా వచ్చిన పురంధేశ్వరి ఒకవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతూనే మరోవైపు జనసేన-టీడీపీ కూటమితో కలిసిపోయే విషయమై సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది బీజేపీని దెబ్బతీస్తోందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏపీపై బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇస్తుందని రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు పార్టీలతో కలిసి పోరాడుతుందా లేక ఒంటరిపోరుకు దిగి వైసీపీకి సాయపడుతుందా అనేది తేలుతుందంటున్నారు విశ్లేషకులు.

Read More
Next Story