రాష్ట్ర విభజన గాయాన్ని టీజీ వెంకటేశ్ ఇప్పుడెందుకు రేపారు?
x
Ex MP T.G. VENKATESH

రాష్ట్ర విభజన గాయాన్ని టీజీ వెంకటేశ్ ఇప్పుడెందుకు రేపారు?

రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత మానిన గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారన్నది రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.


రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన సంఘటనలను రాజ్యసభ మాజీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త టీజీ వెంకటేశ్ ఇప్పుడెందుకు బయటపెడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన పదేళ్ల తర్వాత మానిన గాయాన్ని మళ్లీ ఎందుకు రేపుతున్నారన్నది రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర విభజనను ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వ్యతిరేకించారని టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు కలకలం సృష్టించింది. ఆయన ప్రకటనపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. మానుతున్న గాయాన్ని మళ్లీ రేపడం ఎందుకని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.
అసలింతకీ టీజీ వెంకటేశ్ ఏమన్నారు?
"తెలంగాణ విభజనకు అప్పటి సిఎంగా ఉన్న రోశయ్య మద్దతు తెలపలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకూలంగా ఉంది. ట్యాంకు బండ్‌పై విగ్రహాలు పగలకొడుతున్నప్పుడు శ్రీ కృష్ణ దేవరాయ విగ్రహం పగలగొట్టే ముందు మాపై దాడి చేయండని నేను కోరాను. వెంటనే ఆందోళన కారులు మమ్మల్ని గౌరవించి వెనక్కి వెళ్ళారు" అని టీజీ వెంకటేశ్ చెప్పారు. జరిగిన సంఘటనలను మర్చిపోవాలంటూనే మళ్లీ వాటినే ప్రస్తావించడం గమనార్హం. జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పటికైనా రాష్ట్ర విభజన హామీలు అమలయ్యే దిశగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని, విభజన హామీల అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని టీజీ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి (Revanth Reddy), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చొరవ తీసుకోవాలని, విభజన హామీలు అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు సహకరించాలని వెంకటేశ్ (TG Venkatesh) జనవరి 18న విజ్ఞప్తి చేశారు. కర్నూల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాల్ని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ (Telangana) ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని, కానీ తప్పుడు ప్రచారంతో రాష్ట్ర విభజన చేశారని ప్రస్తుతం బీజేపీలో ఉన్న వెంకటేశ్ చెబుతున్నారు. నిజానికి ఆవేళ బీజేపీ కూడా రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది.
"ఇప్పటికైనా మాకు (ANDHRA PRADESH) న్యాయం జరగాలి. తెలంగాణ సీఎం, మంత్రులతో పాటు మిగతా పార్టీలలోని లీడర్లంతా సమైక్యాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయత్వం వహించిన వారు. మీకు పరిస్థితులన్నీ తెలుసు. ఢిల్లీలో ఏపీకి గెస్ట్ హౌస్ లేదు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదు. కొన్ని ఆస్తులు ఉమ్మడిగానే ఉన్నాయి. ఇవేవి ఇంకా పరిష్కారం కాలేదు. భవిష్యత్ లో ప్రజలు ఘర్షణ లేకుండా ఉండాలంటే వీటికి పరిష్కారం చూపాలి" అని కోరారు.
ఏపీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో ఏపీకి రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి సారించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో ఎప్పటినుంచో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖతతో ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుందని ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.
కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే ఆంధ్రప్రదేశ్ లో వేగంగా ముందుకు వెళ్తున్నాయని, తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని టీజీ వెంకటేష్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సమైక్య రాష్ట్రం (United State)గా ఉండాలని పోరాటం మొదలు పెట్టింది తానేనని, రాయలసీమ (Rayalaseema) ప్రాంతం వెనకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని.. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) మాకు పూర్తి మద్దతు తెలిపారని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ (TG Venkatesh) అన్నారు.
ఇప్పుడీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీజీ వెంకటేశ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటన్నది బోధ పడడం లేదని సీనియర్ జర్నలిస్టు జి. రాఘవ వ్యాఖ్యానించారు. "ఇప్పుడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కన్నా ఏపీ అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ వంటి అంశాలపై ఆయన తన పలుకుబడిన ఉపయోగిస్తే బాగుంటుందని" సీపీఐ నాయకుడు కేవీవీ ప్రసాద్ అనడం గమనార్హం.
Read More
Next Story