ఏపీలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మరణించారు.
రోడ్డు ప్రమాదాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ తప్పనిసరి నిబంధనలను ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది. హెల్మెట్ నిబంధనలను సరిగా అమలు చేయక పోవడం వల్ల వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబరు వరకు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించక పోవడం వల్ల 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది.
హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన సరిగా అమలు కావడం లేదని, దీని వల్ల వందలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఒ వ్యక్తి వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పై వ్యాఖ్యలను చేసింది. అయితే పోలీసుల తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ట్రాఫిక్ విభాగంలో సరైన సంఖ్యలో సిబ్బంది లేరని, దాదాపు 8వేల మంది పోలీసులు ట్రాఫిక్ విభాగంలో అవసరం కాగా ప్రస్తుతం కేవలం 1800 మంది మాత్రమే ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలను అత్రికమించిన వారిపై జరిమానాలు విధించినా వాహనదారులు చెల్లించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన స్పందించిన హై కోర్టు ధర్మాసనం రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీ చేసింది. దీంతో పాటుగా వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.