ఇజ్రాయెల్ వైపు భారత్ మొగ్గు ఎందుకు?
x
మాట్లాడుతున్న అతిథులు

ఇజ్రాయెల్ వైపు భారత్ మొగ్గు ఎందుకు?

తొలి నుంచి భారత దేశం పాలస్తీనాకు వెన్నుదన్నుగా ఉందని, దేశంలో మతోన్మాద శక్తులు బలపడుతున్నప్పటి నుంచి మన దేశం ఇజ్రాయిల్ వైపు మొగ్గు చూపడం మొదలైందని సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ అన్నారు.



తిరుపతి అమరావతి నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో జి. ప్రతాప్ సింగ్ అధ్యక్షతన ఆదివారం ఉదయం పాలస్తీనా ప్రజల పోరాట సంఘీభావ సదస్సు లో ఆయన ప్రసంగించారు.

పౌరచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పాలస్తీనాను రెండుగా విభజించడాన్ని గాంధీ, నెహ్రూలు వ్యతిరేకించారని, పాలస్తీనాను గుర్తించిన తొలి ముస్లీమేతర దేశం భారత్ మాత్రమేనని అన్నారు.

దేశంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మధ్య భారతదేశంలోని ఆదివాసీలను అణచివేయడానికి భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు.

జర్నలిస్టులు, రచయితలు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల సెల్ ఫోన్లపై పెగాసెస్ స్పైవేర్ ను ఉపయోగించి వారి గోప్యత హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాచేలా చేసిందన్న ఆరోపణను గుర్తు చేశారు.

ఈ పేగసెస్ స్పైవేర్ సృష్టించింది ఇజ్రాయిల్ అన్న విషయం మనం మర్చిపోకూడదని పేర్కొన్నారు.

పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపినందుకు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలోని నలుగురు విద్యార్థులపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిందన్నారు.

పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపిన జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాత్ ఆదేశాల మేరకు నిర్బంధించారని గుర్తు చేశారు.

‘‘తీవ్రవాదం ఏరూపంలో వ్యక్తమైనా భారత దేశం నిస్సందేహంగా ఖండిస్తుంది’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే కెనడాలోని సిక్కు వేర్పాటు వాది హర్ దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత సంస్థల ప్రమేయం గురించి ఆదేశం ఆరోపణ చేయడం, అమెరికాలోని మరో సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం పై విచారణ చేయిస్తామని అమెరికా ప్రకటించడం ప్రధాని మోదీ ట్వీట్ కు, ఆచరణకు పొంతన లేకుండా పోతోందనడానికి తార్కాణమని వ్యాఖ్యానించారు.

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష్లులు కె.కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్నది యుద్ధం కాదని, మారణహోమమని అన్నారు. యుద్ధం పేరుతో బాంబులు వేసింది సైన్యం పైన, దళారీలపైన కాదని, పౌరులపైన, ఆసుపత్రులపైన, రోగులపైన, డాక్టర్లు, వైద్య సిబ్బందిపైన, ఐక్యరాజ్య సమితి శరణార్థి శిబిరాలపైన, జర్నలిస్టుల పైన బాంబులు వేశారని గుర్తు చేస్తూ, ఇది చాలా దుర్మార్గమని ఆరోపించారు.

ఇజ్రాయిల్ దుర్మార్గానికి వ్యతిరేకంగా పాలస్తీనా పౌరులకు సంఘీభావంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయని గుర్తు చేశారు.

సభకు అధ్యక్షత వహించిన పౌరచైతన్య వేదిక సభ్యుడు ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ యుద్ధం మొదలవగానే నిజం చనిపోతుందని, తరువాత ప్రజలు చనిపోతారని వ్యాఖ్యానించారు.

రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముషీర్ అహ్మద్ మాట్లాడుతూ యుద్ధం ఒక రాక్షస క్రీడ అని అన్నారు. సామాజిక కార్యకర్త అజీజ్ బాషా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా చేసిన తీర్మానాన్ని సభికులంతా తమ హర్షధ్వానాలతో ఆమోదించారు.

హరీష్, మహేష్, తేజస్వీ, ఉన్నతి, అజయ్, మహ్మద్ అసీఫ్ తదితరులు ఈ సదస్సులో ప్రసంగించారు.

Read More
Next Story