నియోజకవర్గం ఏర్పాటైన తరువాత అరువు నాయకులు తప్ప స్థానికి నాయకులు ఎన్నికల్లో నిలబడలేదు. అసలు ఈ నియోజకవర్గంలో పోటీచేసే నాయకుడే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.


ఆంధ్రప్రదేశ్ లోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. బైఫర్గేషన్లో నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్థానిక నాయకులు చట్టసభకు ఎంపిక కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే ఇది నిజం. పార్టీలకు కూడా స్థానికంగా ఉండే నాయకులు నచ్చడం లేదు. బయట నుంచి అరువు దెచ్చుకున్న వారే దిక్కవుతున్నారు.

మొదటి నుంచీ మార్కాపురం నేతలదే హవా..

పునర్విభజనలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంగా ఏర్పాటైన దగ్గర నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ లే నియోజకవర్గంలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. 2009లో మొదటిసారి మార్కాపురానికి చెందిన ఆదిమూలపు సురేశ్ మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సురేశ్ ను రంగంలోకి తీసుకొచ్చారు. ఆయన రైల్వే ఉన్నతోద్యోగి, ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. మొదటిసారి గెలిచారు. ఆ తరువాత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా సీటు సరేష్ కు ఇచ్చారు. గెలిచిన తరువాత వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ వైపే ఉన్నారు. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. చివరి వరకు ఆప్రభుత్వంలోనే వుండటంతో ఎర్రగొండపాలెం నుంచి సురేశ్ కు సీటు ఇవ్వకుండా వైఎస్సార్సీపీ వారు సంతనూతలపాడు పంపించారు. అక్కడ కూడా సురేశ్ వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందారు.

సురేశ్ స్థానంలో డేవిడ్ రాజు

సురేశ్ సంతనూతలపాడుకు వెళ్లడంతో సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన పాలపర్తి డేవిడ్ రాజును తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి తీసుకున్నారు. ఎర్రగొండపాలెం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో డేవిడ్ రాజు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి జంప్ అయ్యారు. తిరిగి 2019లో సురేశ్ కు వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చి ఎర్రగొండపాలెం నుంచి వైఎస్సార్సీపీ పోటీ చేయించింది. గెలిచిన తరువాత మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్లు మంత్రిగా పదవిలో ఉన్నారు. మొదట విద్యాశాఖ మంత్రిగా, ఆ తరువాత మునిసిపల్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

ఈసారి సురేశ్ కొండపి నియోజకవర్గానికి..

2024 ఎన్నికల్లో సురేశ్ ఎర్రగొండపాలెం నుంచి గెలిచే అవకాశాలు లేవని కొండపి నియోజకవర్గానికి మార్చారు. సింగరాయకొండకు చెందిన తాటిపర్తి చంద్రశేఖర్ ను ఎర్రగొండపాలెం వైఎస్సార్సీపీ నుంచి పోటీలో పెట్టారు. ఈ వ్యక్తి ఎవరో, ఈయనకు ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాలని ఎందుకు అనిపించిందో స్థానికులకు ఎవ్వరికీ తెలియదు. పార్టీ అధినేతలకు కూడా స్థానికులు కనిపించకపోవడం విశేషం. ఈయనో వ్యాపారి. డబ్బు సంపాదించాడు. హైదరాబాద్ లో ఉంటాడు.

తెలుగుదేశం పార్టీ రెండుసార్లు బూదాల అజితారావును అభ్యర్థిగా పెట్టింది. ఆమె ఓడిపోవడంతో ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు. ఎలాగైనా టిక్కెట్ సాధించి పోటీ చేయాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయోలేదో చూడాల్సిందే.

డబ్బులేకుంటే రాజకీయాల్లేవ్..

ఎర్రగొండపాలెం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి ఇక్కడి జనం జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమలు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ లేవు. ప్రభుత్వ ఆస్పత్రి తప్ప ఇతర సంస్థలు కూడా లేవు. దీంతో ఎవ్వరూ ఇక్కడికి వచ్చి స్థిరపడేందుకు కానీ, ఉండేందుకు కానీ ఇష్టపడరు. తెనాలి ప్రాంతం నుంచి కమ్మసామాజిక వర్గానికి చెందిన కొందరు 30 ఏళ్ల క్రితం వచ్చారు. అప్పట్లొ గ్రౌండ్ వాటర్ బాగుండేవి. ఇప్పుడు ఆ నీరు కూడా అడుగంటింది. దీంతో బోర్లు ఎండాయి. తాగేందుకు కూడా నీరు కరువైంది. ఇలాంటి కరువు సీమలో డబ్బున్న వారు కావాలంటే దొరకడం కష్టమే. అయినా నీతివంతమైన నాయకులు ఉన్నారు. ఏంలాభం డబ్బులేదు కదా, అందుకే సీటు ఇవ్వలేకపోతున్నామంటున్నారు పార్టీల నేతలు.

ఈ సారి ఎవరిని ఆదరిస్తారో..



ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఎవరిని నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుత అభ్యర్థులిద్దరూ అరువుకు వచ్చిన వారే. ఒకరిది ఒంగోలుకు సమీపంలోని సింగరాయకొండ ఆయనపేరు తాటిపర్తి చంద్రశేఖర్, కాగా మరొకరిది కనిగిరి ప్రాంతం. ఆయన పేరు గూడూరి ఎరిక్షన్ బాబు ఇప్పటికే సుమారు రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో ప్రజల మధ్య ఎరిక్షన్ బాబు తిరుగుతున్నారు. చంద్రశేఖర్ పేరును ఇటీవలే తాడేపల్లిలోని సీఎంవో ప్రకటించింది. స్థానికులతో ఎటువంటి సంబంధాలు లేకపోయినా గ్రామాల్లోకి వెళితే పార్టీ కండువాలు కప్పి అభినందిస్తున్నారు. ఇక్కడి ప్రజల దాత్రుత్వానికి సెల్యూట్ చేయాల్సిందే. ఇద్దరూ డబ్బున్న నాయకులే కోట్లు ఖర్చుపడతారు. వారికి ఓట్ల పండగ, ఇక్కడి వారికి నోట్ల పండగ. అంతేమరి.

బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లే ఎక్కువ

నియోజకవర్గంలో సుమారు రెండు లక్షలుపైన ఓట్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీ ఓట్టే ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, అనంతరం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వుంటాయి. రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఎస్సీల్లో డబ్బన్న నాయకులను పార్టీ నేతలు పట్టుకుంటున్నారు. పార్టీకి ఫండ్ తో పాటు ఓటర్లకూ డబ్బులు పంచాల్సిందే. ఆదిమూలపు సురేశ్ విద్యా సంస్థల ద్వరా బాగా సంపాదించారు. ఆయన భార్య ఇన్కం ట్యాక్స్ అధికారిగా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. దీంతో డబ్బుకు కొదవ లేదు. పైగా ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరు (ఎస్సీ) రిజర్వుడు నియోజకవర్గంలో సురేశ్ తమ్మడు డాక్టర్ సతీష్ కు వైఎస్సార్సీపీ వారు టిక్కెట్ ఇచ్చారు. డబ్బులు ఉండబట్టే వారికి ప్రయారిటీ పార్టీలు ఇస్తున్నాయి. ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ. 10 కోట్లు ఉంటేనే టిక్కెట్ అంటున్నాయి పార్టీలు.

Next Story