ఆంధ్రప్రదేశ్‌ను వదిలి ఏకంగా వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారు. అక్కడ పోరు చేస్తే ఏపీకి రక్షణ ఉంటుందా? ప్రధాన మంత్రికి వీరి మొర వినపడుతుందా?


ఈనెల 24న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు సన్నగిల్లాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించనున్నారు.

ఢిల్లీలో ధర్నాతో జరిగేది ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో ధర్నా నిర్వహిస్తే దేశమంతా తెలిసే అవకాశం లేదని, పార్లమెంట్‌ సమావేశాలు ఈనెల 22 నుంచి మొదలవుతున్నందున తమ సత్తా చూపించాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ వారు ఉన్నారు. తమ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందినా పార్లమెంట్, రాజ్యసభ, శాసన మండలిలో ఉన్న తమ సభ్యుల సత్తా చూపేందుకు ఢిల్లీని వేదికగా చేసుకున్నట్లు సమాచారం. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా దేశమంతా ఒక్కసారి వైఎస్సార్‌సీపీ వైపు చూసే విధంగా జగన్‌ ప్లాన్‌ చేసి ధర్నాకు పిలుపు నిచ్చారని వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. మొదటి ఆరు నెలల కాలం ఎటువంటి ఆంధోళనలకు పిలుపు ఇవ్వకుండా ఉండాలని మొదట వైఎస్సార్‌సీపీ భావించిందని, అయితే రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని, పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను నరికి చంపుతున్నారని తెలియజెప్పడం ద్వారా ప్రధాని దృష్టిని ఆకర్షించవచ్చుననే ఆలోచనతో జగన్‌ ఉన్నట్లు సమాచారం.
వైఎస్సార్‌సీపీ మద్దతు ఎన్‌డీఏకే..
వైఎస్సార్‌సీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్య సభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరి మద్దతు ఎన్‌డీఏ కూటమికే ఉంటుందని ఇప్పటికే జగన్‌ ప్రకటించారు. అంటే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సానుభూతి తప్పకుండా తమపై ఉంటుందనే నమ్మకం జగన్‌కు ఉంది. నెలన్నర క్రితం వరకు జగన్‌ ఏపీకీకి ముఖ్యమంత్రిగా ఉండి ఆ హోదాలో పీఎంను అనేక సార్లు కలిసారు. గత ప్రభుత్వంలో 22 మంది ఎంపీలు వైఎస్సార్‌సీపీకి ఉండగా వారు ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించారు. ఒక్క రోజు కూడా ప్రధాన మంత్రిపై కానీ, ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంపై కానీ వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన విభజన హామీల గురించి కూడా ఐదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదు. అందువల్ల తాము చేస్తున్న ధర్నాను కేంద్రంలోని ఎన్‌డీఏ వారు సమర్థిస్తారనే నమ్మకంతో జగన్‌ ఉన్నారు.
రాజకీయాల్లో ఇవన్నీ పనికొస్తాయా?
రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. కేంద్రంలో ఎన్‌డీఏను వైఎస్సార్‌సీపీ సమర్థిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమిని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోంది. కేంద్రంలోని అధికార కూటమికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరం. వారి మద్దతుతోనే దేశంలో ఒడిదుడుకులు లేని పాలనను మోదీ కొనసాగిస్తున్నారు. అలాంటప్పుడు జగన్‌ మంత్రం ఏమాత్రం పనిచేయదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ధర్నా సక్సెస్‌ అవుతుందా?
వైఎస్సార్‌సీపీ ఈనెల 24న ఢిల్లీలో నిర్వహించే ధర్నా సక్సెస్‌ అవుతుందా.. అనేది ఇప్పుడు వైఎస్సార్‌సీపీని వేదిస్తున్న ప్రశ్న. కేంద్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో మొదటి సారిగా జగన్‌ ఢిల్లీ కేంద్రంగా ఆంధోళనకు దిగారు. దీనిని ప్రధాన మంత్రి కానీ, ఎన్‌డీఏ కూటమి కానీ సమర్థిస్తుందా? లేదా? అనేది ఆలోచించాల్సి ఉంది. ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎత్తిన జెండా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా సక్సెస్‌ అయ్యే అవకాశాలు లేవనే మాటలు అధికార పక్ష కూటమి నేతల నుంచి వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున శాంతి భద్రతల సమస్యగా పరిగణించి ప్రభుత్వం ముందుగానే అరెస్ట్‌ చేస్తుందా? లేక ధర్నా చేస్తున్న సమయంలో అరెస్ట్‌ చేస్తారా? అనేది చర్చగా మారింది. ప్రధాన మంత్రి, మంత్రుల అపాయింట్‌మెంట్స్‌ కోరుతామని జగన్‌ వినుకొండ వేదికగా ప్రకటించారు. అయితే కేంద్ర నేతలు జగన్‌ బృందానికి కలిసే అవకాశం ఇస్తారా.. లేదా.. అనేది కూడా చర్చగా మారింది.
దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఢిల్లీలో ఆంధోళన చేయాలనే ఆలోచనలో వైఎస్‌ జగన్‌ ఉన్నారు. 4గురు పార్లమెంట్‌ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 45 మంది శాసన మండలి సభ్యులతో కలిసి మొత్తం 60 మంది ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన వారిని కలుపుకుని ఆంధోళనలో పాల్గొంటామని ఇప్పటికే జగన్‌ ప్రకటించారు. ఎమ్మెల్సీల్లో పార్టీ తరపున గెలిచిన వారు 35 మంది కాగా, నామినేటెడ్‌ పద్దతిలో ఎన్నికైన వారు 6గురు, స్వతంత్రులు 4 గురు ఉన్నారు. ఈ లెక్కన పది మంది ఎమ్మెల్సీలు ధర్నాకు వస్తారా? రారా? అనే సందేహం కూడా వారిని వెంటాడుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమి పాలైనందున కొందరు వెనుకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. నామినేషన్‌ ద్వారా రాజ్యసభకు, శాసన మండలికి ఎంపికైన వారిలో బిజెపి మద్దతు దారులు ఉన్నారు. వారు వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందనేది పలువురు పరిశీలకులు చెబుతున్న మాట.
Next Story