గోదావరి జిల్లాల టూర్ కి పవన్ కల్యాణ్ ఎందుకు వెనకాడుతున్నారు?
x
పవన్ కల్యాణ్ ఫైల్ ఫోటో

గోదావరి జిల్లాల టూర్ కి పవన్ కల్యాణ్ ఎందుకు వెనకాడుతున్నారు?

పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల టూర్ కి వెళ్లడానికి ఎందుకు వెనకాడుతున్నారు? హెలికాఫ్టర్ లేదనా? లేక కాపులు తిరగబడతారని గుంజాటన పడుతున్నారా?


జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే భీమవరం టూర్ వాయిదా వేసుకున్న పవన్‌... అమలాపురం పర్యటనపైనా నీలినీడలు అలుపుకున్నాయి. ఎన్నికల కసరత్తు కారణంగా పగటి పూట పర్యటనలు ముగించుకుని రాత్రికి అమరావతి వచ్చేలా పవన్ టూర్ ను జనసేన ప్లాన్ చేసింది. హెలీప్యాడ్ ఏర్పాటుకు R అండ్ B అధికారులకు లేఖలు రాసింది. అయితే అక్కడి నుంచి అనుమతి రాకపోవడంతో జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే అసలు విషయం ఇది కాదని పార్టీలో ఉన్న తలనొప్పులు, కాపుల్లోని ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడమే కారణం అంటున్నారు.

“విజయవాడ నుంచి భీమవరం ఎంత సేపు వెళ్లిరావాలి. మహా అయితే గంటన్నర. ఈ మాత్రం ప్రయాణానికి హెలికాఫ్టర్ కావాల్నా.. అసలు విషయం అది కాదు, ఇంకేదో కారణం ఉండే ఉంటుంది” అన్నారు మాజీ మంత్రి కొడాలి నానీ ఎద్దేవా చేసినా అందులో నిజం లేకపోలేదు. ‘పొత్తు రాజకీయాలు టీడీపీ-జనసేన నాయకులకు తలనొప్పిగా మారాయి. సీట్ల సర్దుబాటులో రెండు పార్టీలు కుస్తీ పడుతుంటే.. ముచ్చటగా మూడోపార్టీ చేరితే జనసేన పరిస్థితి మరింత సంక్లిష్టం అవుతుంది’ అన్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు నాయకుడు రామకృష్ణ.

ఆశావహుల్లో టెన్షన్, టెన్షన్...

టీడీపీ-జనసేన పొత్తు రెండు పార్టీల ఆశావహుల్లోనూ టెన్షన్ పెంచుతోంది. పొత్తుల్లో ఎవరి సీటు త్యాగం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. జనసేన పొత్తుతో టీడీపీలో బలమైన నేతలు తమ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి రావడం... అధిష్టానం ఏ విషయంపైనా క్లారిటీ ఇవ్వకపోవడంతో భవిష్యత్‌పై బెంగపెట్టుకుంటున్నారు టీడీపీలోని ముఖ్యనేతలు.

ఉంగుటూరు, భీమవరం జనసేనకు ఇస్తారా?

పొత్తుల్లో ఉంగుటూరు, భీమవరం స్థానాలను జనసేన కోరుకుంటున్నదనే వార్తలు టీడీపీలో హీట్‌ పుట్టిస్తున్నాయి. భీమవరంలో జనసేనాని పవన్‌ పోటీ చేయనుండటంతో ఆ సీటుపై పెద్దగా పేచీ లేకపోయినా, ఉంగుటూరులో టీడీపీలో ప్రధాన నేత సీటుకు ఎర్త్‌పెట్టేలా జనసేన పావులు కదుపుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఉంగుటూరులో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వీరంజనేయులుకు 61 వేల ఓట్లు వచ్చాయి. అవే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన పత్సమట్ల ధర్మరాజుకు కేవలం 10 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఉంగుటూరును తమకు కేటాయించాలని జనసేన ప్రతిపాదిస్తుండటంతో టీడీపీలో అలజడి పెరిగిపోతోంది.

సమన్వయం కుదిరిన తర్వాతే...

ఇరు పార్టీల మధ్య పొత్తులపై అవగాహన కురిరిన తర్వాత రెండు పార్టీల నేతల సమన్వయంతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, సీటు వరకు వచ్చేసరికి రెండు పార్టీల మధ్య అభద్రత కనిపిస్తోంది. గత ఎన్నికల ఓడిన మరునాడు నుంచే ప్రజలకు అందుబాటులో ఉన్న తనను పొత్తుల్లో ఎక్కడ తప్పిస్తారోనని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు టెన్షన్‌ పడుతున్నారు. ఇదేసమయంలో ‘తమ పార్టీ గ్రాఫ్‌ బాగా పెరిగింది. పొత్తుల్లో ఉంగుటూరు తమకే కేటాయించాలి’ అని జనసేన నేత ధర్మరాజు. ఈయన కూడా గత నాలుగున్నరేళ్లుగా సామాజిక సేవ కార్యక్రమాలతో నియోజకవర్గ ఓటర్లకు దగ్గరవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ రెండు పార్టీలతో జట్టుకట్టే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ కూడా ఉంగుటూరు సీటుపై కర్చీఫ్‌ వేసేందుకు సిద్ధమవుతుండటంతో మరింత వేడి పెరిగింది. ఉంగుటూరుకు చెందిన బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలతీరాణి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీతో పొత్తు కుదిరితే ఉమ్మడి జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఒక అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించాస్తారని.. ఆ ఒక్క అసెంబ్లీ సీటు ఉంగుటూరేనని అంటున్నారు మాలతీరాణి. దీంతో పొత్తు రాజకీయం స్థానిక టీడీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఏవిధంగా చూసుకున్నా, జనసేన, బీజేపీ నేతలకన్నా, టీడీపీయే ఉంగుటూరులో స్ట్రాంగ్‌గా ఉన్నందున అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ నేతలు. ఈ పరిస్థితుల్లో పొత్తు ఎత్తుల్లో టీడీపీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీకి కేటాయిస్తుందనేదే హాట్‌టాపిక్‌గా మారింది.

రాజోలులో రాజకీయాలు రసవత్తరం...

రాజోలులో రాజకీయాలు రసవత్తకరంగా మారుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో రాజోలు, రాజానగరం నుంచి కచ్చితంగా పోటీచేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఆశావహులు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఒకరు.. అధినేత వద్ద మంచి మార్కులు ఉన్నాయని మరొకరు.. నేనైతే తప్పకుండా విజయం సాధిస్తానని ఇంకొకరు పోటీ పడుతున్నారు. దీంతో రాజోలు అభ్యర్థి ఎవరవుతారనే సస్పెన్స్‌ పెరిగిపోతోంది. రాజోలు అంటేనే జనసేన గుర్తుకువస్తుంది. గత ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు.. ఇక్కడి ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతూ ఉంటారు. ఆయన మాటలతో ఈ నియోజకవర్గంతో మరింత కమిట్‌మెంట్‌ పెంచుకున్నారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో రాజోలు సీటు జనసేనదేనని పవన్ ప్రకటించడం విశేషం.

Read More
Next Story