ఎందుకు నాన్నా.. మమ్మల్నింత దారుణంగా చంపేశావు?
x

ఎందుకు నాన్నా.. మమ్మల్నింత దారుణంగా చంపేశావు?

మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనా.. అనుబంధాలు, ఆత్మీయతలు, పేగుబంధాలు వంటివన్నీ రుణపాశాల ముందు ఎందుకు కొరగావా?. విజయవాడ దుర్ఘటన అదే నిరూపిస్తోందా?


‘‘ఆర్థిక సమస్యలు ఎంత దారుణాన్నైనా చేయిస్తాయా? ఆ బిడ్డల గొంతు కోసేటప్పుడు ఆ తండ్రి ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో ? కన్నతల్లి గొంతు నులిమే టైమ్ లో ఆ డాక్టరు పడిన మానసిక వేదన ఎంతో.. కట్టుకున్న భార్యను కడతేర్చేటపుడు ఎంతగా తల్లడిల్లిఉంటాడో? అమ్మని, భార్యని, కన్నబిడ్డల్ని కడతేర్చిన తర్వాత ఆ వైద్యుడు ఉరికొయ్యకు వేలాడిన తీరు చూపరుల్ని కలసివేస్తోంది. వైద్యుడై ఉండీ ఇంతఘోరానికి పాల్పడ్డారా అని అందరూ కన్నీరు మున్నీరవుతున్నారు.


ఈ దారుణం విజయవాడ పటమటలో జరిగింది. సొంత ఆస్పత్రి పెట్టి అప్పుల పాలై మానసికంగా కుంగి పోయిన ఓ వైద్యుడు తన భార్య, ఇద్దరు పిల్లల్ని, కన్నతల్లిని తన చేతులోనే చంపేసి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. పటమట వాసవీనగర్‌ లో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. బుధవారం మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. డాక్టర్ ధరావత్‌ శ్రీనివాస్‌ ఎముకల వైద్యుడు. భార్య ఉష గృహిణి. ఆటిజంతో బాధ పడుతున్న 9 ఏళ్ల కుమార్తె శైలజ, ఐదేళ్ల కుమారుడు శ్రీహన్‌, 65 ఏళ్ల తల్లి రమణమ్మ మృతదేహాలకు పరీక్షలు నిర్వహించి బంధువులకు అప్పగించినపుడు కనిపించిన దృశ్యాలు హృదయవిదారకమనే చెప్పాలి. తండ్రి జమలయ్య నాయక్‌ పోలీసు శాఖలో పని చేసి పదేళ్ల కిందట మరణించారు. శ్రీనివాస్‌ సోదరుడు దుర్గాప్రసాద్‌ హైదరాబాద్‌లో న్యాయాధికారిగా పని చేస్తున్నారు. చెల్లెలు లక్ష్మికి వివాహం అయింది. వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు. వైద్యుడైన శ్రీనివాస్‌ సొంతంగా ఆసుపత్రి ప్రారంభించేందుకు గత ఏడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈలోగా నమ్ముకున్న వాళ్లు నట్టేట ముంచారు. అప్పులు పెరిగాయి. భాగస్వాములు ముఖం చాటేయడం మొదలు పెట్టారు. భాగస్వాములుగా చేరిన మరికొందరు స్నేహితులు శ్రీనివాస్‌ను మోసగించి రోడ్డున పడేశారు. ఇక ఆ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మనోధైర్యం వీడిన డాక్టర్ శ్రీనివాస్ బలవన్మరణ నిర్ణయానికి వచ్చారు. సోమవారం అర్ధరాత్రి దాటాక.. శ్రీనివాస్‌ వేర్వేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి, భార్య, పిల్లలను చాకుతో మెడ భాగంలో కోసేశారు. కొద్దిసేపట్లోనే వారంతా చనిపోయారు.

నేను ఎందుకు చనిపోతున్నానంటే..

పోలీసులు తలుపులు పగలగొట్టి శవాలను బయటికి తీశారు. డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ లో రికార్డు చేసి ఉంచిన మెసేజ్ ని విన్నారు. అందులో ఏముందంటే.. ‘‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశా’’ అని డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేశారు. తాను ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులను చంపి, తానూ ప్రాణం తీసుకున్నారు. తన తర్వాత కుటుంబ సభ్యులకు సమస్యలు రాకుండా ఉండేందుకే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చాలా కాలం వైద్యుడిగా పలు చోట్ల పని చేశాక సొంతంగా ఆసుపత్రి పెట్టుకోవాలనే కల నెరవేరకుండానే అప్పుల పాలై కన్నుమూయడం విషాదం.
బ్యాంకులకు మోసం చేసే తెలివితేటలున్న వారు దర్జాగా తిరుగుతుంటే ఈ డాక్టరు తన స్నేహితులకు ఇవ్వాల్సిన అప్పుకింద తన వాటాను రాసిచ్చి బజారున పడ్డారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా ఈ దారుణానికి పాల్పడ్డారు. తన బంధువులకు కానీ, భార్య తరఫు బంధువులకు కానీ ఏనాడూ తన అప్పుల గురించి చెప్పని సున్నిత మనస్కుడైన డాక్టర్ శ్రీనివాస్ చనిపోయే ముందు ఎంతటి క్షోభను అనుభవించారో చెప్పడం ఓ పట్టాన ఊహించలేం. ఏమైతేనేం ఆ కుటుంబం యావత్తు విగతజీవులయ్యారు.
దర్యాప్తు ప్రారంభం...
పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీనివాస్‌ కారులోని ల్యాప్‌టాప్‌లో పాస్‌వర్డ్‌ ద్వారా పోలీసులు అతని సెల్‌ఫోన్‌ తెరిచారు. కుటుంబ సభ్యులు నలుగురిని మెడ వద్ద కోసే ముందు ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరాడకుండా చేశాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. చంపేందుకు ఉపయోగించిన కత్తులను సమీప సూపర్‌మార్కెట్‌లో కొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు అక్కడి సీసీ టీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసు జాగిలం.. శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చి.. ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్లి బయటకు వచ్చింది. తర్వాత రోడ్డు పక్కన నిలిపిన కారు వద్దకు వచ్చి మళ్లీ వెనుదిరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
శ్రీజ ఆస్పత్రి పెట్టాలనుకున్నారు...
డాక్టర్ శ్రీనివాస్ గురించి ఆయన స్నేహితుడు డాక్టర్ భగవాన్ ఏమంటున్నారంటే... శ్రీనివాస్‌, నేను 20 ఏళ్లుగా స్నేహితులం. ఇద్దరం కలసి గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్నాం. నిరుడు సొంతంగా శ్రీజ ఆసుపత్రి పేరుతో నిర్మాణం ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వహణలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బహుశా ఆ సమస్యలే వాళ్లపాలిట శాపం అయిఉంటుంది. కుటుంబాన్ని చంపాడంటే నమ్మలేక పోతున్నాం. శ్రీనివాస్‌ చాలా సౌమ్యుడు. ఎంబీబీఎస్‌ చదివేటప్పుడు ప్రతి ఒక్కరితో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు అన్నారు భగవాన్‌. డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే డాక్టర్ మాధవి అనే ఆమె చెప్పిన కథనం ప్రకారం..ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుసు.. కానీ మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలియదు. శ్రీనివాస్‌ కుమార్తెకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మెడిసిన్‌ చదివే రోజుల్లో అందరితో కలిసి మెలిసి ఉండేవారు. శ్రీనివాస్‌ పరిస్థితి ముందుగా తెలిసి ఉంటే అండగా నిలబడేవాళ్లం అన్నారు డాక్టర్ మాధవి.
నగదును కారులో ఎందుకు పెట్టినట్టు..
బలవన్మరణానికి పాల్పడబోయే ముందు తన ఇంట్లోని బంగారాన్ని, నగదును ఓ బ్యాగ్ లో సర్దారు. ఆ బ్యాగును కార్లో పెట్టారు. దానిని తన కారులో ఉంచారు. కారు తాళానికి కాగితం చుట్టి ఎదురింటి గేటుకు ఉన్న పెట్టెలో వేశారు. తాను ఊరు వెళ్తున్నానని.. అన్నయ్య వస్తే కారు తాళం ఇవ్వమని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఉదయం 9.30 గంటలకు పనిమనిషి వచ్చి పిలిచినా పలకలేదు. గోడపై నుంచి చూడగా పోర్టికోలో శ్రీనివాస్‌ ఉరేసుకుని కనిపించారు. స్థానికులు వచ్చి చూసేసరికే శ్రీనివాస్‌ ప్రాణాలు వదిలారు. ఎదురింటివారు కారు తాళానికి చుట్టిన కాగితం తీసి చూడగా.. తన సోదరుడైన న్యాయాధికారి దుర్గప్రసాద్‌కు మాత్రమే ఇవ్వమని, ఆయన ఫోన్‌ నంబరు రాసి ఉంది. వారు ఆయనకు ఫోన్‌ చేసి తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందజేశారు. శ్రీనివాస్‌ పోర్టికోలో ఉరేసుకున్నారు. లోపల వేర్వేరు గదుల్లో ఆయన తల్లి, భార్య, కుమార్తె, కుమారుడి మృతదేహాలు పడి ఉన్నాయి. శ్రీనివాస్‌ తన ఫోన్‌లో వాయిస్‌ను రికార్డ్‌ చేసి ఉంచారు. కారులో ఉంచిన నగదు, నగలను పోలీసులు కారులో ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ. 16 లక్షల నగదు, 300 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది. తన అన్న దుర్గాప్రసాద్‌కు ఇవ్వమని ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story