జీబీఎస్పీ జిమ్మిక్కులు ఎందుకు?
x

జీబీఎస్పీ జిమ్మిక్కులు ఎందుకు?

ఈ మరణాలను దాచిపెట్టాలని ఒత్తిళ్లు. వీరి డెత్లపై వైద్యులు తప్పుడు సమాచారం. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్న భయమేనా?

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక వంకను వెతుక్కుంటూనే ఉంటుంది. అది ఏ ప్రభుత్వమైనా సరే ఇదే వైఖరిని అవలంబిస్తుంది. ఏటా మలేరియా మరణాల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుంది. ముఖ్యంగా అపిడమిక్ సీజనులో మన్యం (ఏజెన్సీ) ప్రాంతాల్లో మలేరియా మరణాలు అధికంగా సంభవిస్తుంటాయి. అక్కడ గిరిజనులు మలేరియా బారిన పడి పిట్టల్లా రాలిపోతుంటారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారెవ్వరూ మలేరియాతో చనిపోయినట్టు చూపించరు. మలేరియాకే వైద్యం జరిగి చనిపోయినట్టు అందరికీ తెలిసినా.. మరేదో రోగం బారిన పడో, లేక కార్డియాక్ అరెస్టుతోనో చనిపోయినట్టు అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తుంటారు. ఇలా మలేరియాతో ఎవరూ చనిపోలేదని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఏటా జరుగుతున్న తంతే! అయితే ఇప్పుడు గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) విషయంలోనూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు అలాంటి జాగ్రత్తలనే తీసుకుంటున్నారు. జీబీఎస్ మరణాల సంఖ్యను దాచిపెడుతున్నారు.

ఇటీవల శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి మండలం కాపు గోదాయవలసకు చెందిన వాతాడ యువత అనే పదేళ్ల బాలుడు జీబీఎస్ లక్షణాలుండడంతో తొలుత శ్రీకాకుళం ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నయం కాకపోవడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈ బాలుడికి సోకింది. జీబీఎస్ గా తేల్చారు. అనంతరం పరిస్థితి విషమించడంతో యువతను శ్రీకాకుళం జిల్లా రాగోలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలుడు బ్రెయిన్డ్ అయి ఈనెల 10న చనిపోయాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా సహా అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కానీ ఆ బాలుడి చావుకు జీబీఎస్ కాదన్నట్టుగా వ్యవహరించింది. ఇంతలో గుంటూరు జీజీహెచ్ లో ఈనెల మరో జీబీఎస్ మరణం సంభవించింది.


ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్ తో చనిపోయింది. ఆరంభంలో ఆమెది జీబీఎస్ చావు కాదని చెప్పేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. చివరకు కమలమ్మ జీబీఎస్ తోనే చనిపోయినట్టు ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది. పన్నెండు రోజుల క్రితం విశాఖపట్నం కేజీహెచ్ లో విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం మల్లివీడుకి చెందిన రేణుక మహంతి (41) అనే మహిళ జీబీఎస్ లక్షణాలతో చేరింది. కేజీహెచ్లో ఈ చికిత్సకు అవసరమయ్యే ఇమ్యునో గ్లోబిలిన్స్ ఇంజక్షన్ల కొరతతో వైద్యులు ఆమెకు రెండు మాత్రమే ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు ఒక్కో ఇంజక్షనుకు రూ.20 వేలు వెచ్చించి మరో 10 వరకు బయటే కొనుక్కున్నారు. రోజుకు రోగికి కనీసం ఐదారు ఇంజక్షన్లయినా అవసరమవుతాయి.

ఈ లెక్కన రోజుకు రూ. లక్ష భరించాల్సి వస్తుంది. అంతకు మించి కొనుగోలు చేసే స్థోమతు వీరికి లేకపోవడం, కేజీహెచ్లో తగినన్ని ఇంజక్షన్లు లేకపోవడంతో ఆమె సోమవారం చనిపోయింది. అయితే ఆమెది జీబీఎస్ మరణం కాదని చెప్పడానికి కేజీహెచ్ వైద్యులు పడరాని పాట్లు పడ్డారు. రేణుక కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్టు ప్రకటించారు. ఆమెకు జరిగింది జీబీఎస్ వైద్యమే. కానీ చనిపోయింది మాత్రం జీబీఎస్ తో కాదని వైద్యులు చెబుతుండడం చూస్తే వారిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. జీబీఎస్ మరణాలను చూపిస్తే ప్రభుత్వ అసమర్థతగా ప్రజలు భావిస్తారన్న ఉద్దేశంతోనే జీబీఎస్ చావులను దాచిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేస్ షీట్లలో జీబీఎస్ గా నమోదు చేయవద్దని..

మరో విచిత్రమైన, దుర్మార్గమైన విషయం ఏమిటంటే... రేణుక మహంతి మరణానంతరం విశాఖ కేజీహెచ్ లో జీబీఎస్ లక్షణాలతో ఎవరైనా రోగులు చేరితో వారి కేస్ షీట్లలో జీబీఎస్ గా నమోదు చేయవద్దని విధుల్లో ఉన్న వైద్యులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఒకవేళ ఆ రోగి చనిపోయినా జీబీఎస్ వల్ల కాదని తేల్చడానికి వీలవుతుంది. అయితే కేస్ షీట్లో పేర్కొన్న జబ్బుకే వైద్యం అందుతుంది తప్ప జీబీఎస్ కు అందకుండా పోయి రోగి మరణించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కేజీహెచ్ లో ఐదుగురు జీబీఎస్ రోగులు...

విశాఖ కేజీహెచ్ లో ప్రస్తుతం ఐదుగురు జీబీఎస్ రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి'తో చెప్పారు. వీరెవరికీ ప్రాణాపాయం లేదన్నారు. తమ ఆస్పత్రిలో జీబీఎస్ చికిత్సకు అవసరమయ్యే ఇమ్యునో గ్లోబులిన్స్ ఇంజక్షన్లు 400 వరకు ఉన్నాయని, వీటి కొరత లేదని వివరించారు. అయితే కేజీహెచ్ జీబీఎస్ రోగులు మరింత మంది ఉన్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

రిపోర్టుల రాక ఆలస్యం..

జీబీఎస్ లక్షణాలతో వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన వారికి వెంటనే చికిత్స అందించడంలో జాప్యం జరుగుతోంది. జీబీఎస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేస్తున్నారు. వాటి ఫలితాలు రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది. ఈలోగా జీబీఎస్కు తగిన వైద్యం అందక తీవ్రరూపం దాలుస్తోంది. తీరా నివేదికలో జీబీఎస్ గా నిర్ధారణ అయ్యాక చికిత్స మొదలు పెడుతున్నారు. కానీ అప్పటికే రోగి పరిస్థితి చేయి దాటిపోతోంది. గుంటూరు జీజీహెచ్ లో చనిపోయిన మహిళ విషయంలోనూ ఇదే జరిగిందని ఉదహరిస్తున్నారు. అందువల్ల జీబీఎస్ నిర్ధారణ పరీక్షలు సత్వరమే వచ్చేలా చర్యలు చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

Read More
Next Story