విద్యుత్ ఒప్పందాల్లో అడ్డగోలుగా వార్తా కథనాలు ప్రచురించాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం వేస్తానని జగన్ ప్రకటించారు.
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో అదానితో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్లపై ధ్వజమెత్తారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)తో పాటు అంతర్జాతీయ వార్తా పత్రికలపై ఎందుకు పరువు నష్టం దావా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ తన పరువు నష్టం కోసం తెలుగు దినపత్రికలను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారని నిలదీశారు. అదానితో జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో చోటు చేసుకున్న అక్రమాలను జగన్ సొంత పేపరైన సాక్షి తప్ప జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించాయన్నారు. వీటితో పాటుగా లండన్ ఎకనమిస్టు వంటి ప్రముఖ ఆంగ్ల పత్రికలు కూడా వెలుగులోకి తెచ్చాయన్నారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో జరిగిన అవినీతిని అంతర్జాతీయంగా ప్రపంచమంతా గుర్తించినా, అవినీతి నేరాన్ని జగన్ మాత్రమే ఖండిస్తున్నారని విమర్శించారు. అదానితో విద్యుత్ కొనుగోళ్లో జగన్‌కు రూ. 17,50 కోట్లు ముట్టాయని ఎఫ్‌బీఐ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. జగన్ తన నిరాధారమైన వాదనలతో, పరువు నష్టం దావా కేసులతో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అదానితో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, కావాలనే..కక్షపూరితంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు టీవీ5 టీవీ చానల్ అసత్య కథనాలు ప్రచురించాయని, దీంతో తన పరువుకు భంగం కలిగిందని, అందువల్ల వాటిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు జగన్ ఇది వరకు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.