సీపీఎం నుంచి కామ్రేడ్ గఫూర్ ఔట్!
పార్టీ లోని ఏకైక ముస్లిం మైనారిటీ నాయకుడు ఎంఏ గఫూర్. గఫూర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి?
సీపీఎం తెలుగు రాష్ట్రాల మహాసభలు సక్సెస్ ఫుల్ గా జరిగాయి. నూతన కార్యవర్గాలు కొలువుదీరాయి. తెలంగాణలో ఓ దళితుడు రాష్ట్ర కార్యదర్శి కాగా ఆంధ్రాలో యథావిధిగా ఓ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తే మళ్లీ ఎన్నిక అయ్యారు. తెలంగాణ పరిణామం అనూహ్యమే అయినా ఏపీది మాత్రం ఊహించిందే. వి.శ్రీనివాసరావు విజయవాడలో జరిగిన సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలోనే ఎన్నికైనందున ఆయనకు మరోసారి ఛాన్స్ వస్తుందనే అనుకున్నారు. అదే జరిగింది.
గఫూర్ పేరు ఎలా మిస్సయిందంటే...
నెల్లూరులో జరిగిన సీపీఎం 27వ మహాసభ-15మందితో రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని, మరో 35మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఈ జాబితాలో- గత మహాసభలో రాష్ట్ర కార్యదర్శి పదవికి పోటీ పడిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్నూలు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక ముస్లిం మైనారిటీ నాయకుడు ఎంఏ గఫూర్ పేరు లేకపోవడం వామపక్ష రాజకీయాలతో అనుబంధం ఉన్న వారిని విస్మయపరిచింది.
సీపీఎం రాష్ట్ర నాయకత్వంలో ఉన్న ఏకైక ముస్లిం ఆయన. కమ్యూనిస్టులకు కుల, మతాలతో సంబంధం లేకపోయినా ఇప్పుడున్న అస్థిత్వ పోరాటాలన్నీ వీటి చుట్టే సాగుతున్నాయి. కమ్యూనిస్టులు సైతం కులగణన, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్స్ కోసం గళం విప్పిన సందర్భాలనేకం. వాస్తవానికి సీపీఎం అనుబంధంగా అనేక కులవృత్తి సంబంధిత సంఘాలూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 8 శాతంగా ఉన్న ముస్లిం కమ్యూనిటీ ప్రాతినిధ్యం కోసమైనా గఫూర్ లాంటి సీనియర్ నాయకుడికి అవకాశం ఇచ్చి ఉండాల్సిందన్న విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి.
70 ఏళ్లు దాటిన వాళ్లను పార్టీ పదవులకు తీసుకోకూడదని సీపీఎం నిబంధన పెట్టుకున్నా- మాజీ రాష్ట్ర కార్యదర్శి పి. మధుకి ఆహ్వానితుల జాబితాలో చోటిచ్చినట్టే గఫూర్ కీ ఇచ్చి ఉండాల్సిందన్న అభిప్రాయమూ లేకపోలేదు.
ఇవన్నీఎలాగున్నా, సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ నుంచి సీనియర్ నేత గఫూర్‌ను తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం పార్టీ లో అంతర్మథనానికి, భిన్నాభిప్రాయాలకు సంకేతంగా చెప్పవచ్చు.
తొలగింపునకు కారణాలపై ఊహాగానాలు..
సీపీఎం నిర్ణయానికి స్పష్టమైన కారణాలను అధికారికంగా వెల్లడించకపోయినా, కొన్నేళ్లుగా పార్టీ లోపల విభేదాలు కొనసాగుతున్నాయి. గఫూర్ పార్టీ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించారని, ఆయన్ను వివిధ సందర్భాల్లో హెచ్చరించినా పట్టించుకోలేదని, దాని ఫలితమే ఈచర్య అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలహీనపడుతోంది. ప్రజాదరణ కోల్పోవడం, నాయకత్వంపై రకరకాల ఆరోపణలు, క్రమశిక్షణ కొరవడడం వంటి అంశాలు పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి తోడు, నాయకత్వ మార్పులు, విధాన పరమైన తేడాలు పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత పెంచాయి.
బీవీ రాఘవులుతో విభేదాలు...
గఫూర్ గత మహాసభలోనే పార్టీ కార్యదర్శి పదవికి పోటీ పడ్డారని, అయితే కొందరు నేతల వైఖరికి విసిగి నాయకత్వం నుంచి పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం సాగింది.
పార్టీ అంతర్గత విషయాల్లో పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, ఎంఏ గఫూర్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఓ దశలో ఈ ఇద్దరూ పార్టీ కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల ఎంపిక అంశంపై పార్టీలో అంతర్గతంగా ఈ ఇద్దరూ గొడవ పడ్డారని, ఆ ఎంపికలో రాఘవులు ఏకపక్షంగా వ్యవహరించారని రాష్ట్ర నేతలు పార్టీ కేంద్ర కమిటీకి లేఖ రాసినట్లు మీడియా ఆనాడు కోడై కూసింది. ఈ లేఖ తర్వాత రాఘవులు ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలను చాలా కాలం పట్టించుకోలేదు. ఆ తర్వాత బీవీ రాఘవులే మళ్లీ తెలుగు రాష్ట్రాలలో కీలకమయ్యారు. అంతా సవ్యంగా సాగితే వచ్చే ఏప్రిల్ లో జరిగే పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఎవరీ గఫూర్...
ఈ పరిణామాలన్నింటినీ గమనించినందు వల్లే ఏమో గఫూర్ చాలాకాలంగా పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఓ దిగువ మధ్యతరగతి వర్గానికి చెందిన ఎం. అబ్దుల్ గఫూర్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, ఆల్ ఇండియా సిఐటియు ఉపాధ్యక్షుడు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, అవాజ్ అనే ముస్లిం మైనారిటీల సంస్థ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు. 1994, 2004లో కర్నూలు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీకి చెందిన టి.జి. వెంకటేష్ ను ఓడించిన చరిత్ర ఆయనకు ఉంది. 2009 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఆయనది మతాంతర వివాహం. ఆయన భార్య నిర్మలా రెడ్డి. ఈమెది మహబూబ్ నగర్ జిల్లా. ఆమె కూడా పార్టీ పూర్తికాలపు కార్యకర్త. ప్రస్తుతం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు. భార్యభర్తలిద్దరూ కార్మికవర్గంలోనే పని చేస్తున్నారు.
సీపీఎం వంటి కమ్యూనిస్టు పార్టీలు వ్యక్తిగత సంబంధాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా, క్రమశిక్షణ, సిద్ధాంతాలను కీలకంగా పరిగణిస్తాయి. పార్టీ నిర్ణయాలు వ్యక్తిగత జీవితం కన్నా సిద్ధాంతాలను ప్రాముఖ్యతనిస్తాయని అనేక సందర్భాల్లో పార్టీ నేతలు స్పష్టంగా ప్రకటించారు.
గఫూర్ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, తన రాజకీయ వైఖరి పార్టీ ఆలోచనలకు భిన్నంగా ఉందని ఆయనపై చర్యలు తీసుకుని ఉండవచ్చు. అయితే, అదే సమయంలో ఆయన భార్యను పార్టీలో కొనసాగించడం గమనార్హం. ఒకే కుటుంబంలో ఒకరిని తొలగించి, మరొకరిని కొనసాగించడాన్ని పార్టీ ఎలా సమర్థించుకుంటుందో? మున్ముందు చూడాల్సిందే.
గఫూర్ తొలగింపును సీపీఎం ఒక వ్యూహాత్మక చర్యగా భావిస్తే, దీని ప్రభావం ఆ పార్టీతో ఉండే ముస్లింవర్గాలపై ఉండే అవకాశముంది. దళితులకు, ముస్లిం మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు సీపీఎంకు కొత్తేమీ కాదు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు మతతత్వ వ్యతిరేక, సామాజిక సమానత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూనే, ముస్లింల రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మాత్రం నామ మాత్రంగా వ్యవహరిస్తున్నాయన్న భావన ముస్లిం వర్గాల్లో ఉంది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు సీపీఎం- ముస్లిం నాయకులు కొంతమందిని ముఖ్యమైన పదవులకు పంపినప్పటికీ, పెద్దస్థాయిలో ఆ వర్గానికి చోటు కల్పించలేకపోయింది.
కేరళ, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ముస్లిం మైనారిటీలకు కొంతవరకు ప్రాతినిధ్యం దక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సీపీఎం నుంచి ముస్లిం నాయకత్వం తక్కువగా ఉండటం వల్ల మైనారిటీ వర్గాల మద్దతు పార్టీకి తక్కువగానే ఉంది. గఫూర్ తొలగింపు వంటి సంఘటనలు పార్టీపై నమ్మకాన్ని మరింత దెబ్బతీయవచ్చు. భవిష్యత్‌లో వామపక్షాలు- ముస్లిం మైనారిటీలను విశ్వసించగలిగేలా చేస్తాయా లేదా అన్నదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న.
Next Story