న్యాయ రాజధానిని.. ఎవరు విశ్వసించలేదా!?
x

న్యాయ రాజధానిని.. ఎవరు విశ్వసించలేదా!?

"కర్నూలు న్యాయ రాజధాని" ఓట్లు రాబట్ట లేకపోయింది. తాగు- సాగునీటి పారుదుల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఫలితాలు తిరగబడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


న్యాయ రాజధాని అంశాన్ని జనం నమ్మలేదు. విద్యావంతులు విశ్వసించలేదు. నిరుద్యోగులకు భరోసా కుదరలేదు. సామాన్యులకు మేలు జరిగే అవకాశం లేకపోవడం వల్లే ఫ్యాన్ ప్రభంజనానికి అడ్డుకట్ట పడిందని సీమ ప్రాంత వ్యక్తులు అభిప్రాయపడ్డారు.

రాయలసీమ జిల్లాలకు గేట్ వే లాంటిది కర్నూలు నగరం. ఒకప్పటి రాష్ట్ర రాజధాని. ఈ నగరాన్ని "జ్యుడీషియల్ క్యాపిటల్ గా ( న్యాయ రాజధానిగా) చేస్తాను" అని తాజా మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి సానుకూల స్పందన లభించింది. కానీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సానుకూలత మటుమాయమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం కర్నూలు జిల్లాలోనే కాదు.. రాయలసీమ జిల్లాల్లో అధికార వైఎస్ఆర్ సీపీకి దిమ్మతిరిగే అనుభవం ఎదురయింది.

మూడు రాజధానుల్లో భాగంగా, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు నాంది పలుకుతూ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్ కోర్టు మొదటగా ప్రారంభించారు. ఆ తర్వాత మూడు రాజధానుల అంశం చట్టబరమైన చిక్కులు ఎదుర్కొంటున్నప్పటికీ, తాజా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి లోలోన తాను అనుకున్న పనులను పూర్తి చేయడానికి సంకల్పించారు. ఆ తరహా పనులేవి తాజాగా వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించలేదని విషయం స్పష్టమైంది. ఆ వివరాలు పరిశీలిద్దాం..

తాజా సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే, వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రాలయంలో వై. బాలనాగిరెడ్డి 12,882 ఓట్లు, ఆలూరు అసెంబ్లీ స్థానంలో విరూపాక్షి అత్యంత స్వల్పంగా 2, 831 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు మిగతా 12 స్థానాల్లో టిడిపి కూటమిలోని ఆదోని నుంచి బిజెపి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి 17,646 ఓట్లతో, మిగతా 11 మంది టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులే గెలుపొందడం ప్రస్తావనార్హం.

తన సర్వీస్ ఉన్నప్పటికీ రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కర్నూలు నుంచి పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎన్ఎండి ఇంతియాజ్ 72,814 ఓట్లు సాధించారు. ఆయనతో మొదటిసారి పోటీపడిన టిడిపి అభ్యర్థి టీజీ. భరత్ 91,690 సాధించడం ద్వారా 18,876 మెజారిటీతో విజయదుందుభి మోగించారు. అదేవిధంగా నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ని మాజీ మంత్రి ఎన్ ఎండి. ఫరూక్ 12,333 ఓట్ల మెజారిటీతో ఓడించారు. డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చేతిలో 6,049 ఓట్ల ఆధిక్యంతో ఓటమి చెందారు. పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి గౌరు చరితారెడ్డి 40,591 భారీ మెజారిటీతో విజయం సాధించారు. బనగానపల్లె నియోజకవర్గం లో కంగాటి శ్రీదేవిని టిడిపి అభ్యర్థి కేఈ శ్యాంబాబు 14,211 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సిపి అభ్యర్థి, మాజీ ఎంపీ బుట్ట రేణుక టిడిపి అభ్యర్థి బి జయ నాగేశ్వరరెడ్డి చేతిలో 15, 837 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ వివరాలన్నీ పరిశీలిస్తే న్యాయ రాజధాని అనే అంశాన్ని మేధావి వర్గం నుంచి కాస్త కోస్తూ అర్థం చేసుకునే స్వభావం ఉన్న ఓటర్లు విశ్వసించలేదు అనే విషయం స్పష్టమవుతుంది. గతంలో.. ఆ పరిస్థితి వేరు..

కదం తొక్కిన జనం ఏమయ్యారు

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లక్ష్యానికి మద్దతు పలుకుతూ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కర్నూలు కదం తొక్కారు. గ్రేటర్ రాయలసీమ జిల్లాల నుంచి న్యాయవాదులు, మేధావులు, సామాన్య ప్రజలు కూడా భారీగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. న్యాయ రాజధాని అంశంపై గత ప్రభుత్వ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సూటిగా ప్రశ్నించిన అంశం ఒకటే.. " మూడు రాజధానులు ప్రత్యేకంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు టిడిపి అధినేత సానుకూలమా? వ్యతిరేకమా?? " నిలదీశారు. టిడిపి మాత్రం అమరావతి రాజధానికే కట్టుబడి ఉందనే విషయాన్ని అనేకసార్లు విస్పష్టంగా చంద్రబాబు నాయుడుతో పాటు, ఆ పార్టీకి చెందిన రాయలసీమ, కోస్తా ఉత్తరాంధ్ర నాయకులు ప్రకటించారు. ఇదిలా ఉండగా..

గతాన్ని స్పర్శిస్తే...

మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత శ్రీ బాగ్ ఒడంబడిక మేరకు ఆంధ్రప్రదేశ్ కు కర్నూలు రాజధానిగా కూడా ఆశ్రయం కల్పించింది. ఆ తర్వాత మూడు ప్రాంతాల ప్రజల సౌలభ్యం కోసం హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ఏర్పాటయింది. మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో అమరావతి తరలింది. 2019లో అధికారం చేపట్టిన తర్వాత "అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని" వైఎస్ఆర్సిపి అధినేత సీఎం హోదాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయినా..

వక్ఫ్ ట్రిబ్యునల్ వచ్చినా నమ్మలేదా..?

ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ రెండున్నర సంవత్సరాల క్రితం న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలులో ప్రభుత్వ కార్యాలయాన్ని అప్పటి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బి. కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలన్నీ బహిరంగంగానే జరిగాయి. కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం మొత్తం హాజరైంది. అప్పటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మంత్రులు కూడా పాల్గొన్నారు. వీటన్నిటిని కర్నూలు జిల్లా, రాయలసీమలోని అన్ని ప్రాంతాల ప్రజలు దగ్గరగా చూడడంతో పాటు వేలాదిమంది ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

దీనిపై సిపిఎం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకుడు కందారపు మురళి స్పందించారు. "కర్నూల్ కు న్యాయ రాజధాని అవసరమే. దీనివల్ల కొందరికి మాత్రమే ప్రయోజనం జరిగినప్పటికీ. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది. అని కండారపు మురళి వ్యాఖ్యానించారు. " తాజా మాజా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ సెంటిమెంట్తో లబ్ధి పొందాలనే వ్యూహం బెడిసి కొట్టింది. అని అభిప్రాయపడిన ఆయన, విద్యావంతులే కాదు, కాస్త ఆలోచన జ్ఞానం ఉన్నవారు విశ్వసించలేదు" అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందువల్లే ఊహించని దారుణమైన ఫలితాలతో వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు పాఠం నేర్పారు. అని గంగారం మురళి విశ్లేషించారు.

సాక్ష్యాలు ఉన్నా...

పరిపాలన వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ, తాజా మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కర్నూలు నగరంలో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అవన్నీ కళ్ళముందే కనిపిస్తున్నాయి. వైయస్ జగన్ చేసే పనులకు సాక్షాలు కూడా సజీవంగా ఉన్నాయి. కానీ, ఆయనను, అధికార వైయస్ఆర్సీపీని జనం విశ్వసించలేదనే విషయం 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా వెళ్లడైంది. దీనిపై...

సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ స్పందించారు. " కర్నూలుకు కోర్టు వస్తుందని నమ్మకం జనంలో ఏమాత్రం లేదు. ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసం కూడా లేదు. అని గౌస్ ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. " వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రచారం కోసం దీన్ని బాగా వాడుకుంది. ఈ అంశం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే ఉండేది" అని గౌస్ విశ్లేషించారు.

తాజా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఆయన జనంలో మమేకం కాకపోయినా, పరదాల మాటున ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. ఆయన పేరు తో ఎమ్మెల్యేలు గెలిచినా, సీఎం హోదాలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఎవరికి దొరికేది కాదు.

ఈ అంశాలను ప్రస్తావించిన కర్నూలు నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్ అను ఫెడరల్ ప్రతినిధి పలకరించగా.. " న్యాయ రాజధాని సాధ్యం కాదనే విషయం ఎప్పుడో స్పష్టమైంది. దీనివల్ల కోర్టు పరిసర ప్రాంతాల్లో మినహా ఎవరికి ఉపాధి లభిస్తుంది?" అని మహమ్మద్ షరీఫ్ ప్రశ్నించారు. ఈ అంశంపై ఎవరికి ఆశలు కరగలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జిల్లాలో డోన్ నియోజకవర్గ మినహా ఎక్కడ అభివృద్ధి లేదు. ఆ నియోజకవర్గంలో మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్రనాథరెడ్డి రు. వందల కోట్ల తో అభివృద్ధి చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి లేదు. ఈ అంశంపై ఆత్మకూరు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్

నాగేశ్వరరావు మాట్లాడుతూ, "జనానికి డబ్బులు పంచడం మినహా అభివృద్ధి లేదు. జనానికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు లేదు. అని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. నగదు బదలి పథకంలో డబ్బులు తీసుకున్న వారి కంటే నిరుద్యోగులు, రైతులు, సామాన్య మధ్యతరగతి తో పాటు అక్షరజ్ఞానం ఉన్న వారందరూ ఆలోచన చేసి ఓట్లు వేశారని ఆయన విశ్లేషించారు. అంతేకాకుండా కొండలు గుట్టలను కూడా వదలకుండా దోపిడీ చేసిన ప్రజాప్రతినిధుల దోపిడీకి అంతులేకుండా పోయిందని ఆయన వివరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే.. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 45 స్థానాలు టిడిపి, బిజెపి, జనసేన దక్కించుకుంది. ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సిపి పరిమితమైంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి, ప్రజా ప్రతినిధులపై ఉన్న వ్యతిరేకత వల్ల ఈ ఫలితాలకు కారణమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Read More
Next Story