అనకాపల్లిలో అభ్యర్థులేరి?
x
Source: Twitter

అనకాపల్లిలో అభ్యర్థులేరి?

రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్లు ఇంచుమించు ఖరారైనా అనకాపల్లికి సంబంధించి మాత్రం ప్రధాన పార్టీలు ఏవీ తమ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు....?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇంచుమించు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఖరారైన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కూడా జోరుగానే సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి మాత్రం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరూ కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో అనకాపల్లి ఎంపీ సీటు అభ్యర్థుల విషయం మిస్టరీగా మారిపోయింది. గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించడానికే ఈ ఆలస్యం అంటూ రాజకీయ పార్టీలు చెబుతుంటే... ఆయా పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరొస్తారోనని ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గం టికెట్ కోసం ఆశావహుల నుంచి మంచి డిమాండే ఉంది.

అనకాపల్లి హిస్టరీ...

అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో సింహభాగం గవర, కాపు సామాజిక వర్గాలదే. ఆయా పార్టీలు కూడా ఇప్పటివరకు ఈ రెండు సామాజిక వర్గాలకే సీట్లు ఇస్తూ వచ్చారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చోడవరం, అనకాపల్లి, మాడుగుల, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పాటుగా... తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెస్ మూర్తి ఎన్నికయ్యారు.

1967,1971లలో SRAS అప్పలనాయుడు, 1977,1980,1984 లలో తెలుగుదేశం పార్టీ నుంచి పెతకం శెట్టి, అప్పల నరసింహం, 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ, 1991, 1996 లలో టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు,1998లో కాంగ్రెస్ నుంచి గుడివాడ గురునాధరావు,1999లో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, 2004 లో పప్పల చలపతిరావు, 2009 లో సబ్బం హరి, 2014 ముత్తంశెట్టి శ్రీనివాసరావు, 2019లో బీసెట్టి వెంకట సత్యవతి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అనకాపల్లిలో ప్రధానంగా గవర, కాపుల మధ్యే పోటీ ఉంటుంది. దీంతో అన్ని పార్టీలూ ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లలో ఒకటి కాపులకు, మరొకటి గవర్లకు కేటాయిస్తూ వచ్చేవి. తాజాగా వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మలసాల భరత్‌ కుమార్‌ (కాపు)ను, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (గవర)ను బరిలోకి దించాయి. ఎటొచ్చి ఎంపీ అభ్యర్థుల జాబితాయే ఇంకా వెలువడలేదు.

ఎందుకీ ఆలస్యం...

వాస్తవానికి అన్ని జాబితాలతో పాటే అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇప్పటికే ఖరారు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ వస్తారనే వార్తలు రావడంతో రగడ మొదలైంది. ఆయన స్థానికుడు కాదని, ఆయనకు సీటిస్తే సహకరించేది లేదంటూ కొన్ని వర్గాలు నిరసనకు దిగాయి. మరోవైపు సీఎం రమేష్‌కు దీటైన వ్యక్తిని రంగంలోకి దించేందుకే వైసీపీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పటికీ పెండిరగ్‌లోనే ఉంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేసేసిన తర్వాత వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో మంతనాలు జరిపారు. తనకు అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇస్తే గెలుస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో గవర సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్‌ ఎంపీ బీవీ సత్యవతి కూడా తనకు రెండోసారి ఛాన్సివ్వాలని అడుగుతున్నారు.

యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బోడ్డేడ ప్రసాద్‌ కూడా క్యూలో ఉన్నారు. మరోవైపు విశాఖలోని కిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌, ప్రముఖ ఆర్థో వైద్యులు డాక్టర్‌ పెతకంశెట్టి సతీష్‌కుమార్‌ కూడా అనకాపల్లి ఎంపీ సీటుపై మొగ్గు చూపిస్తున్నారు. అదే విధంగా విశాఖకు చెందిన ప్రముఖ వ్యాపారి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒకప్పటి అనుచరుడు, బిల్డర్‌, వైసీపీ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథం (కాశీ) కూడా తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ తన వర్గీయులతో వైసీపీ అధిష్టానాన్ని అడిగిస్తున్నారు. తన బలాన్ని నివేదించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని బేరీజు వేసుకుంటోంది. త్వరలోనే ఈ మిస్టరీ వీడనుందని నేతలు చెబుతున్నారు.

Read More
Next Story