మాజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మరో సారి మీడియా ముందుకొచ్చారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను, పాలన తీరును ఎండగట్టారు.


అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబును బొంకుల బాబు అని ఎందుకు అనకూడదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దానికి పోలిక లేదన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జగన్‌ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. వలంటీర్‌ వ్యవస్థ కూడా ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను నాశనం చేసిందని, వలంటీర్లకు ఉపాధి లేకుండా చేసిందని మండిపడ్డారు. అదే విధంగా లిక్కర్‌ షాపుల్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని, ఇప్పుడు వారిని కూడా కూటమి ప్రభుత్వం తొలగించిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్‌ ఆలస్యం చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అప్పుల గురించి మరో సారి వివరించారు. బడ్జెట్‌ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018–19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయన్నారు. అప్పులపైనే కాదు చివరికి కాగ్‌ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ హయాంలో రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారని, చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబెల్‌ ప్రచారం చేసిందని, తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రూ.42,183 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి రూ.680 కోట్లు బకాయిలు పెట్టారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు. రూ. 28,457 కోట్లు పరిమితికి మించి బాబు అప్పు చేశారు. ఎవరు ఆర్థిక విధ్వంకారులో ఈ లెక్కలే సాక్ష్యం. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే, తమ హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయి. చంద్రబాబు కంటే తమ హయాంలో 4 శాతం అప్పులు తక్కువగా ఉన్నాయని, చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారని వివరించారు.
చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63 శాతం ఉంటే, తమ హయాంలో 13.57 శాతం మాత్రమే అన్నారు. తమ హయాంలో కోవిడ్‌ రాష్ట్రాన్ని పీడించిందని, దేశ వృద్ధి రేటు కూడా 9.28 శాతానికి తగ్గిపోయిందన్నారు. తమ హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు 12.61 శాతం పెరిగింది. చంద్రబాబు హయాంలో 11.92 శాతం మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు ఉంటే, చంద్రబాబు హయాంలో ఎంఎస్‌ఎంఈల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తే తమ హయాంలో 32 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని జగన్‌ అన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని విమర్శించారు. హామీలు అమలు చేయలేకనే బడ్జెట్‌ను ఆలస్యం చేశారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరన్నారు. 2018–19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని, వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 6.46 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. వాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నాయన్నారు. రూ. 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చంద్రబాబు రాష్ట్రం అప్పులపై అసత్యాలు చెప్పటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. కాగ్‌ ధృవీకరించిన తర్వాత కూడా అప్పులపై మళ్ళీ మాట మారుస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్‌ పై మాట మార్చటం చంద్రబాబు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు.
Next Story