మహాసేన రాజేశ్‌పై వ్యతిరేకత ఎందుకు?
చంద్రబాబు చాయిస్‌తో టికెట్ కైవసం చేసుకున్న పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు తిరుగుబాటు చేస్తుండటం హీట్ పుట్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం ఊపందుకుంది. పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న అధికార వైసీపీ ప్రత్యర్థి టీడీపీ, జనసేన కూటమి.. అదే స్థాయిలో సభలు నిర్వహిస్తున్నాయి. సీట్ల ప్రకటన నేపథ్యంలో రగిలిన అసమ్మతి జ్వాలలను చల్లార్చేలా కసరత్తు జరుగుతూనే ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. క్యాడర్‌లో జోష్ తేవాలని చూస్తున్నాయి ఇరు వర్గాల నేతలు. ఇంతవరకు బాగున్నా లోకల్ లీడర్లు మాత్రం పార్టీ నాయకత్వానికి చికాకు కలిగిస్తున్నారు. ‘ముందు మా సంగతి తేల్చండి’ అంటూ అగ్రనాయకత్వానికి చికాకు తెప్పిస్తున్నారు.
ఎన్నికలకు మరో పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వచ్చే 50 రోజుల్లోనే ఎన్నికలే. ఎన్నికల సమరానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేసి... 45 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. వచ్చే 45 రోజుల్లో కనీసం నాలుగైదు సార్లు ఓటర్లను కలవాని ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇందుకు తగ్గట్టే ప్రతిపక్ష పార్టీ కూడా సిద్ధమేనంటూ రంగంలోకి దిగింది. పూర్తిగా అభ్యర్థులను ప్రకటించకపోయినా ప్రస్తుతానికి 99 నియోజకవర్గాలకు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ-జనసేన. ఈ 99లో చాలాచోట్ల అసంతృప్తులు చల్లారడం లేదు. ఇక జనసేనలోనూ సీట్లలొల్లి పెరుగుతోంది. ఈ దశలో పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం తెలుగు జన సభలో మరింత స్పష్టత ఇచ్చారు. నేను చెప్పిన మాటను వినేవాళ్లే నాతో ఉండండి లేదంటే మీ ఇష్టం అనే అర్థం వచ్చేలా చెప్పేశారు.
ఏడు విడతలు..72 నియోజకవర్గాలు...
ఏడు విడతల్లో దాదాపు 72 నియోజకర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించింది వైసీపీ.. దాదాపు 33 మంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరించింది. తాజాగా పొన్నూరు, కందుకూరు, గంగాధర నెల్లూరు అభ్యర్థులను మార్చింది. గెలుపు గుర్రాలకే టికెట్లు అని ప్రకటించిన సీఎం జగన్... ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతామని బెదిరించినా, వెనక్కి తగ్గలేదు. సర్వే ఫలితాల ప్రకారం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నవారిని పక్కన పెట్టారు. పార్టీలో సుదీర్ఘ కసరత్తు చేసి పార్టీకి మరమ్మతు చేయాల్సిన చోట.... మార్పులతో కొత్త పుంతలు తొక్కించారు. ఇక తాజాగా జరిగిన మేము సిద్ధం.. మా పోలింగ్ బూత్ సిద్ధం సభలో మార్పుల ప్రక్రియ పూర్తయిందని ప్రకటించారు సీఎం జగన్... అంటే దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులకే మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉంది.
మళ్లీ మారిన మూడు సీట్లు...
దాదాపు ఇన్‌చార్జులు అందరికీ టికెట్లు ఇస్తామని, ఒకటి రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని సీఎం చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో హుషారు పెరిగింది. బుధవారం అర్థరాత్రి మూడు నియోజకవర్గాలను మార్చారు. ఇప్పటికి 8 విడతల్లో మార్పులు చేయడం.. 30 మందిని పక్కన పెట్టి, మరికొందరిని నియోజకవర్గాలు మార్చడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇన్నాళ్లు అలజడి కనిపించింది. తమకు టికెట్లు దక్కుతాయా? లేదా? అన్న టెన్షన్ ఎక్కువగా ఉండేది. సీఎం జగన్ భరోసాతో మిగిలిన ఎమ్మెల్యేలు తమ సీటు సేఫ్ అనుకుంటూ హ్యామీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా వచ్చే 45 రోజులు ఏం చేయాలో? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో? అన్నదానిపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు కర్తవ్యబోధ చేశారు సీఎం జగన్.
ప్రతిపక్ష కూటమి ఇలా...
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తొలి జాబితాలోనే ఉమ్మడిగా 99 మంది ఎమ్మెల్యేలను ప్రటించింది టీడీపీ-జనసేన కూటమి. ఈ నెల 23న ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఐతే చాలా చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వడం, జనసేన ఆశించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో అసమ్మతి భగ్గమంది. అంతేకాకుండా.. తొలిలిస్టులో సీనియర్లను పక్కన పెట్టడం కూడా అసంతృప్తికి దారితీస్తోంది. ప్రస్తుతానికి టికెట్ దక్కని నేతలు గంభనంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు, జనసేనాని మరోవైపు అసమ్మతులను బుజ్జగిస్తున్నారు. ఇదేసమయంలో కొత్తగా టికెట్లు దక్కించుకున్న వారు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు చాయిస్‌తో టికెట్ కైవసం చేసుకున్న పి.గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేశ్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో రెండు పార్టీల కార్యకర్తలు తిరుగుబాటు చేస్తుండటం హీట్ పుట్టిస్తోంది. అదేవిధంగా గజపతినగరం, కల్యాణదుర్గం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో పరిస్థితులు సర్దుకోలేదు. మొత్తంగా తొలి జాబితా టీడీపీ-జనసేన కూటమికి తలనొప్పిగా మారడంతో రెండో జాబితాపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ఇంకోవైపు కూటమి నుంచి టీడీపీ రా కదలిరా సభలు నిర్వహిస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెం సభలో కనిపించారు. కూటమి పార్టీలు సభలకే పరిమితమవగా, అధికార పార్టీ జనం బాట పట్టింది. ఏదిఏమైనా వచ్చే పది పదిహేను రోజులు ప్రధాన పార్టీలకు కీలకమే. అసమ్మతులను, అసంతృప్తులను సర్దుబాటు చేయలేకపోతే టీడీపీ-జనసేన కూటమికి నష్టమే. ఇదే సమయంలో పార్టీలో అన్నిరకాలుగా సర్దుబాటు చేసుకుని వైసీపీ దూకుడు పెంచింది.