పార్లమెంటుకి సైకిల్ పై వెళ్లే పుచ్చలపల్లి సుందరయ్యలు నేడేరీ!
x

పార్లమెంటుకి సైకిల్ పై వెళ్లే పుచ్చలపల్లి సుందరయ్యలు నేడేరీ!

రష్యాలో బోల్షివిక్ విప్లవానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఆయన పుట్టారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరుగా మిగిలారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకురికారు.


పుచ్చలపల్లి సుందరయ్య.. కమ్యూనిస్టు వర్గాలు పిలిచే పేరు పీఎస్. ఈవేళ ఆయన వర్ధంతి. ఈ తరానికి సుందరయ్య ఎవరో, ఏమిటో, ఆయన విలువలేమిటో, ఆయన బతికిన బతుకేమిటో చాలా మందికి తెలియదు. కొద్దిమంది వినడమో చదవడమో చేసి ఉండవచ్చు. ఆయన జీవితకథ చదివిన వారికి ఆయనేమిటో అర్థమై ఉండవచ్చు. ఇప్పటి మాదిరి సర్వస్వం డబ్బే అనుకునే యుగంలో కాకుండా త్యాగాల యుగంలో పుట్టిన వారు సుందరయ్య. లెక్కలేనంత కాకపోయినా అవసరానికి మించి డబ్బున్న కుటుంబంలో పుట్టిన వారు. సాదా సీదాగా బతకడాన్ని అలవాటు చేసుకున్న వారు. తన బతుకే తన సంస్కృతిగా రుజువు చేసుకున్న వారు.

సుందరయ్యను త్యాగశీలి అంటే చాలామందికి నచ్చుతుందో లేదో తెలియదు గాని ఆయన త్యాగశీలే. సంపన్న కుటుంబం నుంచి వచ్చి సామాన్య జనం కోసం బతికారు. పేర్ల చివర్నన ఉండే తోకల్ని తొలగించుకుని అందరివాణ్ణని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. వైవాహిక జీవితంలో పిల్లలు వద్దనుకుని- సమాజంలోని పిల్లలే తన పిల్లలుగా భావించిన వారు. ఆదర్శప్రాయంగా బతకడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన వారు.

పుట్టుక.. గిట్టుక మే నెలలోనే...

పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే నెలలో పుట్టి అదే నెల 19న మరణించారు. చనిపోయే నాటికి ఆయన వయసు 72. ఆయన్ను చాలామంది ఆరేబియన్ హార్స్ గా పోలుస్తారు. ఆరేబియన్ హార్స్ తల్లి గర్భంలోంచి నేల మీద పడినపుడు మాత్రమే కొంచెం సేపు పడుకుంటుందని, ఆ తర్వాత మరణించినపుడే విశ్రమిస్తుందని అంటుంటారు. అలాంటి కోవకు చెందిన వారు పుచ్చలపల్లి సుందరయ్య. సుందరయ్య చిన్నతనంలో అదీ 14 ఏళ్ల వయసు వచ్చే వరకు తప్ప ఎన్నడూ విశ్రమించింది లేదన్నది నిజం. అవిశ్రాంత ఉద్యమశీలి అనడంలో రెండో మాటకు తావు లేదు. విమర్శలు ఉన్నప్పటికీ అవేవీ ఆస్తిపాస్తులకు, సంపాదనకు సంబంధించినవి కావు అనేది నిర్వివాదాంశం.

రష్యాలో బోల్షివిక్ విప్లవానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఆయన పుట్టారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరుగా మిగిలారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకురికారు. స్వాతంత్ర్యం అంటే కేవలం పాలకులను బయటకు పంపడమే కాదు, అంతర్గతంగా ఆర్ధిక అసమానతలు, ఆర్ధిక దోపిడి, వర్గ దోపిడీ ఉండకూడదని భావించారు. మన స్వాతంత్య్రాన్ని మేడిపండుగా అభివర్ణించారు. 'నా 50,60 ఏళ్ల రాజకీయ జీవితంలో అంకితభావం గల అనేకమంది సహచరులతో పని చేసే అవకాశం లభించిందని వినమ్రంగా చెప్పారే తప్ప.. తాను నిర్మించినా.. తానే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా చెప్పుకోలేదు.' కమ్యూనిస్టు సంస్కృతి, కాంగ్రెస్ సంస్కృతి వంటివనేకం ఉన్నా మన జీవిత విధానమే మన సంస్కృతి అని బలంగా నమ్మారు. ఆచరించారు. మిగతావాళ్లను కూడా అలా ఉండమని బలవంతం చేయలేదు గాని ప్రజా జీవనంలో ఉండే వాళ్లు విచ్చలవిడిగా ఉంటే జనం నమ్మరని తెగేసి చెప్పేవారు.

కమ్యూనిస్టులకు మహాత్మాగాంధీ భావజాలానికి మధ్య పెద్ద అగాధం ఉన్నా సుందరయ్యను కమ్యూనిస్టు గాంధీగా భావిస్తారు. 'గాంధీ బోధనలతోనే తాను ప్రభావితమైనట్టు' సుందరయ్యే చెప్పుకున్నారు. కమ్యూనిస్టులు గాంధీ విధానాలను వ్యతిరేకించారే తప్ప ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని చెప్పలేదు. ఆ సిద్ధాంతాన్నే సుందరయ్య పాటించారు. "కమ్యూనిస్టు గాంధీ"గా పిలిచే సుందరయ్య పార్లమెంటు భవనం వద్ద చప్రాసీలు పెట్టే సైకిళ్ల స్టాండ్ వద్దే తన సైకిల్ కూడా పెట్టుకునే వారు. అసెంబ్లీకి కూడా ఆయన సైకిల్ పైన్నే వెళ్లేవారనడానికి ఆనాటి ఫోటోలే సాక్ష్యం.

అలగానిపాడు నుంచి హస్తిన వరకు...

పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూ స్వామ్య కుటుంబంలో 1913, మే 1 న జన్మించారు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందరరామిరెడ్డి. ఆయన పెట్టుకున్న పేరు సుందరయ్య. ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. ప్రాథమిక విద్య వీధిబడిలోనే పూర్తిచేసారు. వాళ్ల అక్కయ్య ఇంటి వద్ద ఉంటూ తిరువళ్ళూరు, ఏలూరు, రాజమండ్రి, మద్రాసు లలో చదివారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని కోరిన కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా సుందరయ్య.. విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరిట రాష్ట్రాలు ఎందుకు సమైఖ్యంగా ఉండాలో చెబుతూ ఓ చారిత్రక పుస్తకాన్ని రాశారు. ఇది చారిత్రక ప్రాధాన్యత గల రచన. తెలుగు ప్రజల సర్వత ముఖాభివృద్ధికి సమైక్యతకు పధ నిర్దేశం చేసిన పుస్తకం అంటుంటారు. కమ్యూనిస్టుల సామాజిక దృక్పథం ఎంతో లోతయిందో కూడా తెలుస్తుంది. అదే సమయంలో సుందరయ్య అపారమైన అధ్యయనం, దూరదృష్టి మనకు అర్థమవుతాయి. ప్రాంతాల వారి ఉద్యమాలు, పాలక పక్షాల రాజకీయ క్రీడలు పరాకాష్టకు చేరిన నేటి తరుణంలో ఇది ప్రత్యేకించి చదవదగిన పుస్తకం. ఈ పుస్తకానికి అప్పట్లో మా గోఖలే ముఖచిత్రం రూపొందించారు. పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప సంకలనాల్లో ఇది ఒకటి.

తొలి ప్రధాని నెహ్రూ తొలి ప్రతిపక్ష నేత పీఎస్..

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానిగా ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రతిపక్ష నాయకుడు. 1951-52లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో కమ్యూనిస్టులు పెద్దప్రభావాన్ని చూపారు. ప్రతిపక్షంగా నిలిచారు. ఆ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య సహా అనేక మంది కమ్యూనిస్టు వీరులపై కాంగ్రెస్ వాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నప్పుడు దీటైన జవాబులు చెప్పేవారు. అటువంటి వాటిలో ఒకటి. ముస్లింలీగ్ కు సంబంధించింది. ఆ వేళ కమ్యూనిస్టులు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారో ఇప్పుడు కాంగ్రెస్.. బిజెపి నుంచి అటువంటి నిందలే మోయడం వైచిత్రి.

ఆవేళ ఏమి జరిగిందంటే...

ఆవేళ ముస్లింలు కోరిన పాకిస్తాన్ నినాదాన్ని కమ్యూనిస్టులు బలపరిచి భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు కమ్యూనిస్టులపై నింద మోపారు. భారత్ అంటేనే వివిధ జాతుల సంగమం. వాటి భవిష్యత్తు అవే నిర్ణయించుకోవడం న్యాయమని కమ్యూనిస్టులు అన్నారు. ఈ న్యాయమైన సూత్రాన్ని అనుసరించే పాకిస్తాన్ ను ఏర్పాటు చేయాలన్న కోర్కెను- ఎంతవరకు న్యాయం ఉందో అంతవరకు - కమ్యూనిస్టులు బలపరిచారు. అంతే తప్ప ముస్లిం లీగ్ కోరినట్టు ఆరు రాష్ట్రాలతో కూడిన పాకిస్తాన్ ను ఏర్పాటు చేయాలన్న అన్యాయపు కోర్కెను అంగీకరించలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ వాళ్లు కమ్యూనిస్టులపై విషప్రచారాన్ని చేశారు.

కమ్యూనిస్టు నాయకులను నిందిస్తూ ప్రచారాన్ని సాగించినపుడు సుందరయ్య లాంటి నాయకులు తిప్పిన కొట్టిన తీరు అసాధారణం. కాంగ్రెస్, ముస్లిం లీగ్ కలిసి రాక ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల ఆటలు సాగనివ్వడాన్ని కమ్యూనిస్టులు ఇష్టపడలేదు. ఇంగ్లీష్ సామ్రాజ్యవాదుల కుట్రను తిప్పికొట్టడానికి బదులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్ని కమ్యూనిస్టులు విమర్శించారు. భారతదేశంలో 17 పెద్ద జాతులు ఉన్నాయని, అవి వాటి సరిహద్దులు నిర్ణయించుకోవాలని, ఆ సరిహద్దుల్లో నివసించే వయోజనులందరూ ఎన్నుకున్న వేర్వేరు స్వతంత్ర రాజ్యాంగ ప్రజాపరిషత్తులు- ఈ వివిధ జాతుల భవిష్యత్తు రాజ్యాంగాన్ని- నిర్ణయించడానికి హక్కు కలిగి ఉంటాయని కమ్యూనిస్టులు చెప్పారు.

ఈ రాజ్యాంగ పరిషత్తుల ప్రతినిధులు కలిసి ఒక రాజ్యాంగ పరిషత్తుగా ఏర్పడి ఇంగ్లీష్ సామ్రాజ్య ప్రభుత్వాన్ని భారతదేశం నుంచి వెళ్లిపోండి అనే పత్రంపై సంతకం చేయమని అడగాలని, దాన్ని నిరాకరిస్తే అందరం కలిసి ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతిమ స్వాతంత్ర కోసం యుద్ధాన్ని ఆరంభించాలని కమ్యూనిస్టులు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండు ఈ రీతిన కలిసి పనిచేయాలని కమ్యూనిస్టులు విజ్ఞప్తి చేశారు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కాలేదు. ఫలితం భారత దేశం విడిపోయింది. పాకిస్తాన్ ఏర్పాటైంది. ఇలాంటి ఎన్నో సంఘటనలకు పుచ్చలపల్లి సుందరయ్య సాక్షి.

కమ్యూనిస్టు ఉద్యమ నేతగా ఉమ్మడి పార్టీ బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మోసిన వారిలో సుందరయ్య ఒకరు. తెలంగాణ సాయుధ పోరాట అగ్రగామి. పార్టీ చీలిన తర్వాత ఏర్పాటైన సీపీఎంకు ప్రధాన కార్యదర్శి. సొంతపార్టీలోనే బీటీ రణదీవే లాంటి నాయకులతో తీవ్ర విభేదాలు ఎదు ర్కొన్నవారు. అదే పార్టీ ప్రధానకార్యదర్శి పదవికి రాజీనామా చేసి తన సొంత నియోజకవర్గమైన గన్నవరం నుంచి పోటీ చేశారు. ఇంటా బయటా అనేకానేక సమస్యల్ని ఎదుర్కొంటూనే పార్టీ క్షేమాన్ని కాంక్షించి కృషి చేశారు.

1985, మే 19న మద్రాసులోని అపోలో ఆస్పత్రిలో పుచ్చలపల్లి కన్నుమూశారు. హైదరాబాద్ భాగ్‌లింగంపల్లిలో ఆయన పేరుతో గ్రంథాలయం, ఆడిటోరియం, పార్కు ఏర్పాటయ్యాయి. గాంధీజీ నిరాడంబరత, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యం, పటేలు వంటి పట్టుదల, నెహ్రూ వంటి రాజకీయ పరిణతి సుందరయ్యలో ఉన్నాయని ఆయనతో కలిసి పని చేసిన నాయకులు చెబుతుంటారు.

Read More
Next Story