ATTACK | సజ్జల భార్గవ్ కారు డ్రైవర్ ను ఎందుకు చితకబాదారు?
x
సజ్జల భార్గవ్ రెడ్డి కారు డ్రైవరు సుబ్బారావు (మధ్యలో ఉన్న వ్యక్తి)ను ఆస్పత్రికి తరలిస్తున్న వైసీపీ నాయకులు

ATTACK | సజ్జల భార్గవ్ కారు డ్రైవర్ ను ఎందుకు చితకబాదారు?

ఇప్పుడు రాష్ట్రంలో కొందరు వైసీపీ నేతలపై నమోదైన కేసులు వాళ్ల అనుచరులు, డ్రైవర్లు, ఇతర కుటుంబ సభ్యుల పాలిట శాపాలుగా మారాయి.


ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందని తెలుగులో ఓ మోటు సామెత. ఇప్పుడు రాష్ట్రంలో కొందరు వైసీపీ నేతలపై నమోదైన కేసులు వాళ్ల అనుచరులు, డ్రైవర్లు, ఇతర కుటుంబ సభ్యుల పాలిట శాపాలుగా మారాయి. గుర్తుతెలియని వ్యక్తుల పేరిట కొందరు ముసుగు వీరులు- వైసీపీ నేతలతో సంబంధం ఉన్న వారి ఇళ్లపై దాడులు చేసి శారీరకంగా, మానసికంగా వేధింపులకు (ATTACKS) గురి చేస్తున్నారు. తాజాగా ఆ కోవలో వైసీపీలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఇన్ చార్జీ సజ్జల భార్గవ్‌ రెడ్డి కారు డ్రైవర్‌ చేరారు. డ్రైవర్ వేమర్తి సుబ్బారావును గుర్తుతెలియని వ్యక్తులు విజయవాడకు తీసుకువచ్చి కొట్టి రోడ్డుపై పడేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇది పోలీసుల పనేనని వైసీపీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబును కలిసి ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే...
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి (SAJJALA BHAGAV REDDY). ఆయన్ను ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ సోషల్ మీడియా విభాగం అధిపతిని చేశారు. ఆయన కింద పదుల సంఖ్యలో సిబ్బంది పని చేసేవారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో పని చేసిన వారిపై వేట కొనసాగుతోంది. పలువురిపై అసభ్య పోస్టులు పెట్టారనేది ఆరోపణ. అందులో భాగంగా ఇప్పటికే చాలా మందిపై కేసులు నమోదు అయ్యాయి.

భార్గవ్ రెడ్డిపై కడప పోలీసులు కేసు పెట్టారు. భార్గవ్ రెడ్డి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా పోలీసులు ఆలోగా అరెస్ట్ చేయాలని గాలిస్తున్నారు.
భార్గవ్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలో ఆయన కారు డ్రైవర్ సుబ్బారావు పై దాడి జరగడం గమనార్హం. వైసీపీ నాయకుల వివరాల ప్రకారం.. వేమర్తి సుబ్బారావుది ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సింహాద్రి అప్పారావుపేట. వైసీపీ సోషల్‌ మీడియా హెడ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భార్గవ్‌ రెడ్డిపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కొద్దికాలం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు ఇంటి వద్దే ఉంటున్నారు.
డిసెంబర్ 2వ తేదీ రాత్రి ఆగిరిపల్లిలోని ఇంటి వద్ద ఉండగా ఇద్దరు వ్యక్తులు- వేమర్తి సుబ్బారావును- బలవంతంగా వెంబెట్టుకుని విజయవాడ గవర్నర్‌పేటలోని ఆంధ్రా ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ముసుసు వేసి కారులో తీసుకువెళ్లారు. ఒక భవనంలోకి తీసుకువెళ్లారు. సజ్జల భార్గవ్‌రెడ్డి గురించి పలు ప్రశ్నలు అడిగారని సుబ్బారావు చెబుతున్నారు.
భార్గవ్‌రెడ్డిని ఎప్పుడు కలిశావు? ఆయన్ని చివరి సారిగా ఎక్కడ దింపావు? వంటి ప్రశ్నలు అడిగారని సుబ్బారావు కథనం. తనకు తెలిసిన విషయాలు చెప్పినా "నిజం చెప్పమని కొట్టారని.. ముసుగేసి ఆంధ్రా ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారని" వివరించారు. ఆ తర్వాత తాను వైసీపీ నాయకులకు ఫోన్‌ చేయడంతో వారు వచ్చి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చినట్లు చెప్పారు. సుబ్బారావును చిత్రహింసలు పెట్టింది విజయవాడ పోలీసులే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. దీనిపై డిసెంబర్ 3వ తేదీ రాత్రి పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబును కలిసి ఫిర్యాదు చేశారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, సుబ్బారావును తాము అదుపులోకి తీసుకోలేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంతో వైసీపీ నేతలకు కారు డ్రైవర్లుగా పని చేసిన వాళ్లు బిక్కుబిక్కు మంటున్నారు.
Read More
Next Story