ఆ 'నలుగురి’ చేతిలో పార్టీ బందీ అంటున్న చిత్తూరు వైసిపి ఎస్సీ నేతలు
వైసిపి టికెట్లు కోల్పోయిన వారిలో ఎస్ సిలే ఎక్కువగా ఉన్నారు. అగ్రకుల పెద్దలకు నచ్చకపోతే, సర్వే పేరుతో టికెట్ నిరాకరిస్తారనేది ఈ నేతల అనుమానం. వివరాలు
-ఎస్.ఎస్.వి భాస్కర్ రావు
అధికార వైఎస్ఆర్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి సెగలను అధిష్టానం రాజేసింది. టికెట్ దక్కని నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్వరంలో గళమెత్తారు. నలుగురు వ్యక్తుల వల్లనే సర్వే నివేదికల పేరుతో తమ గొంతులు కోసారంటూ దళితులు ఓ ముస్లిం మరో బలిజ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహిస్తున్నారు.
"సర్వే నివేదిక పేరుతో జిల్లాలో మరొకరెవ్వరు ఎదగనివ్వకుండా ఆ నలుగురు వ్యక్తులు అన్యాయం చేశారు. పార్టీ కోసం కష్టపడిన తమకు ఇచ్చిన బహుమతి ఇది," అని ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసంతృప్తి వెళ్లగక్కారు. వాళ్ల మీది ఆగ్రహంతో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలలతో పాటు పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజ్యసభ సభ్యుడు దీనికి కారణమని అన్నారు.
సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరాదరణకు గురయ్యారు. తిరుపతి ఎంపీ నియోజకవర్గానికి తనను ఇన్చార్జిగా నియమించడానికి కోనేటి ఆదిమూలం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా తనకు పోటీ చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. మరో అడుగు ముందుకేసి వైయస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్న సీనియర్ మంత్రి చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై నిప్పులు చెరిగారు.
"నియోజకవర్గంలో గ్రావెల్ మెటల్ ఇసుక విపరీతంగా దోచేశారు. నాకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. నేను అవినీతికి పాల్పడి ఉంటే నివేదిక చూపించాలి," అని ఆయన సవాల్ విసురుతున్నారు. అంతేకాకుండా తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం పైన కూడా ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు.
" దళితులపై ఇంత కక్ష సాధింపు ఎందుకు మేము ఏమి అన్యాయం చేశాము మీకు దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల నాయకుల ఆత్మీయ సమావేశం మీ ఇంటి వద్ద నిర్వహించి చూపించాలని ఆయన మంత్రి పెద్దిరెడ్డికి సవాల్ విసిరారు.
ఇక తనకు ఎలాగూ టికెట్ దక్కదనే విషయంలో స్పష్టత తీసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం పెద్దిరెడ్డి పైనే కాకుండా పరోక్షంగా తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై కూడా ఆయన మాటల తూటాలు పేల్చారు
వామపక్ష భావాల నుంచి ఓనమాలు దిద్దుకున్న ఆదిమూలం సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేశారు. అయితే, 2009 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి టికెట్ నిరాకరించడాన్ని జీర్ణించుకోలేని ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెంతకు చేరారు.
"పార్టీని నియోజకవర్గంలో పాలు బలోపేతం చేయడానికి నేను 650 గ్రామాల్లో తిరిగాను. వైఎస్ఆర్సిపి కమిటీలు ఏర్పాటు చేశాను. గడపగడపకు వైఎస్ఆర్సిపి కార్యక్రమంలో జిల్లాలో ఎవరు కూడా తిరగని స్థాయిలో ప్రతి ఇంటి గడపను తొక్కాను. తద్వారా వైఎస్ఆర్సిపికి అపూర్వ సేవలు అందించాను. నలుగురు చెప్పిన ఇచ్చిన నివేదిక ఆధారంగా నాకు టికెట్ నిరాకరించడం దళితులకు అన్యాయం చేయడమే,"నని ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వైపు చూపులు
వైఎస్ఆర్ సీపీకి దూరంగా ఉన్న ఆదిమూలం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కార్యక్రమం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే, ఆయనకు టిడిపి తలుపులు తెరుచుకుంటాయా అనేది వేచి చూడాలి. ఎందుకంటే కొందరు టిడిపి కీలక నేతలు దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆదిమూలం రాకను పసిగట్టిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడొకరు అపుడే పార్టీకి రాజీనామా చేశారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా తమపై అనేక కేసులు బనాయించి వేధింపులకు గురిచేసిన ఆదిమూలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో.
ఓసి అభ్యర్థులను మార్చరా?
" సర్వేలో మీ పనితీరు బాగాలేదు. అసమ్మతి ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడుకోండి" అని తనతో వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆ నివేదిక ఏంటో చూపమంటే మాత్రం చూపు లేదంటూ పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎస్ బాబు ఘాటుగా అన్నారు.
పనితీరు బాగాలేదని చెబుతూ దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో అభ్యర్థులను మారుస్తున్నారు. అయితే పనితీరు ఏమాత్రం బాగాలేకున్నా, కోట్ల అక్రమార్జనకు పాల్పడిన ఓసీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చడం లేదు" అని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు సూటిగా ప్రశ్నించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో టికెట్ దక్కించుకున్న ఎం ఎస్. బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. పోలింగ్ రోజు ఆయనపై జరిగిన భౌతిక దాడులు నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం కావడం కూడా ఆయనకు అధిక మెజార్టీ రావడానికి దోహదం చేసింది. పనితీరు బాగాలేదని సర్వే నివేదిక నేపథ్యంలో అధిష్టానం టికెట్ నిరాకరించడంతో అసంతృప్తితో ఉన్న పైకి పార్టీ అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటానంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
ఇదే తరహాలో గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ టికెట్ కోల్పోయారు. ఏం జరిగిందో ఏమో తిరిగి సునీల్ కుమార్ కు టికెట్ ఇచ్చారు. కొద్ది మేరకు దళిత ఓటు బ్యాంకులో అసంతృప్తిని చల్లార్చేందుకే ఎలా చేశారని టాక్.
ఏకైక బలిజ ఎమ్మెల్యే అవుట్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా, చిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులు ఒకరే ఉన్నారు. అయితే ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపారు. ఆరని శ్రీనివాసులును తప్పించడంలో కూడా ఓ పెద్దన్న హస్తం ఉందనేది అధికార వైసిపిలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజ్యసభ స్థానం పై హామీ ఇచ్చి గాలికి వదిలేసారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆరని శ్రీనివాసులు స్థానంలో చిత్తూరు శాసనసభ నియోజకవర్గానికి ఇన్చార్జిగా విజయానంద రెడ్డిని నియమించారు. ఈయన గంగాధర నెల్లూరు సీనియర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కళతూరు నారాయణ స్వామికి అండదండలు అందిస్తుంటారని అందువల్లే విజయ ఆనంద రెడ్డిని చిత్తూరు శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినట్లు భావిస్తున్నారు.
అంతా దైవాదీనం
"ఇచ్చేది వాడే. తీసుకునేది వాడే అంతా దేవుని దయ" ఈ తరహా వేదాంతంలోకి వెళ్లిపోయారు. మదనపల్లి సిటీ ఎమ్మెల్యే నవాజ్ బాషా. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కీలక నేతగా చక్రం తిప్పే సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో నవాజ్ భాషా అనూహ్యంగా తెరపైకి వచ్చి టికెట్ దక్కించుకున్నారు. వైఎస్ఆర్సిపి చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి హవా దానికి తోడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న అర్ధ, అంగబలాలు తోడు కావడం వల్ల నవాద్ భాషా విజేత అయ్యారు.
" స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి నాకు లేదు. తండ్రి, బాబాయ్, కుమారుడు వీర పెత్తనం సాగాలి," అని మంత్రి పెద్దిరెడ్డి ఆయన సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, తనయుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిపై ఆయన అసంతృప్తి ఉన్నారు. రాజకీయాలు మానేసి ఇక నా వ్యాపారం చూసుకుంటా అని సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నట్లు తెలిసింది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి సన్నిహితంగా మెలుగుతున్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాజీ డిఈ నిస్సార్ అహ్మద్ కు కూడా పెద్దిరెడ్డి ఆశీస్సులతోనే టికెట్ ఇచ్చే దిశగా మదనపల్లి నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారని పార్టీ వర్గాల సమాచారం. మళ్లీ ముస్లింకే ప్రాధాన్యం ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి నిరాశకు గురైనట్లు భావిస్తున్నారు. అయితే, పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆయనకు పదవి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి కాస్త నిరాశ చెందినా తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించాలని సీఎం వైఎస్ జగన్ ను కోరినట్లు తెలిసింది.
Next Story