తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించలేదు. మంగళవారంతో నామినేషన్ ఘట్టం ముగుస్తుంది. ఒకరు బీద మస్తాన్ రావు కాగా రెండో వారు ఎవరనేది సస్పెన్స్ లో పార్టీ ఉంచింది.


రాజ్యసభ ఉప ఎన్నికలపై కూటమి కూటమి ప్రభుత్వం కలిసి రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించకపోవడం చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. దీంతో ఏర్పడిన ఖాళీల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చింది. ఏపీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు రాష్ట్రాలకు కలిపి తమ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్య, ఒడిసా నుంచి సుజీత్ కుమార్, హర్యానా నుంచి రేఖా శర్మ పేర్లను బీజేపీ ఖరారు చేసింది. ఢిల్లీ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఫ్రకటించింది. ఏపీలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించినా టీడీపీ ప్రకటించకపోవడం వెనుక రాజకీయాలు ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.

మోపిదేవి వెంకట రమణకు 2026 జూన్ 21 వరకు పదవీ కాలం ఉండగా 2024 ఆగస్టు 29న రాజీనామా చేశారు. తనకు మరోసారి రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని మోపిదేవి అప్పట్లో స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావిస్తున్నట్టు చంద్రబాబుకు కూడా తన అభిమతం వెల్లడించినట్టు మోపిదేవి స్పష్టం చేశారు.

బీద మస్తాన్ రావు, ఆర్‌ కృష్ణయ్యలకు 2028 జూన్ 21 వరకు పదవీ కాలం ఉంది. బీద మస్తాన్‌ రావు మరోసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తారనే హామీతో పదవికి రాజీనామా చేశారు. తెలంగాణకు చెందిన ఆర్‌ కృష్ణయ్య వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నట్లు గతంలో ప్రకటించారు. వైఎస్సార్సీపీలో ఉంటే ఏ పనులూ కావని, అందువల్ల దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉంటే బాగుంటుందని భావించిన కృష్ణయ్య బీజేపీలో చేరారు.

బీద మస్తాన్ రావు తాను తిరిగి పోటీ చేస్తానని టీడీపీతో చెప్పి రాజీనామా చేశారు. చంద్రబాబు ముందుగా ఇచ్చిన హామీ మేరకు మస్తాన్ రావుకు తిరిగి టికెట్ ఇస్తున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. మోపిదేవి రాజీనామా చేసిన స్థానం నుంచి జనసేన పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ సీటు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తన అనుచరునికి ఇప్పించుకోనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సార్లు తన తండ్రి వద్ద ప్రస్తావించారు. కుమారుడు చెబుతున్నట్లుగా క్రికెట్ అసోసియేషన్ మాజీ నాయకుడు సానా సతీష్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం పార్టీలో చాలా మంది పట్టుబట్టారు. అయినా సతీష్ సీటు దక్కించుకున్నారని సమాచారం.

మంగళవారం నామినేషన్ లు ముగింపు కావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. అందరూ కూర్చుని మాట్లాడుకున్న తరువాత ఇరువురు అభ్యర్థుల పేర్లు ప్రకటించి వారితో నామినేషన్ లు వేయిస్తారు. శంకులో పోస్తేనే నీళ్లు తీర్థంగా మారుతాయన్న సామెతగా చంద్రబాబు అందరిని ఒప్పించేందుకు చివరి క్షణం వరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా సస్పెన్స్ లో ఉంచారని సమాచారం. సానా సతీష్ కు రాజ్యసభ ఇవ్వడాన్ని పార్టీలో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. అయితే లోకేష్ కు ముఖ్య అనుచరుడు కావడం వల్ల అతనికే సీటు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబు రాజకీయ చాణిక్యం ముందు ఎవరైనా చిత్తు కావాల్సిందేనని పార్టీలోని వారే చెబుతున్నారు. చివరి క్షణం వరకు ఏదైనా జరగొచ్చనే చర్చ జరుగుతోంది. బీద మస్తాన్ రావు పేరు మాత్రం ఖరారు చేశారని పార్టీ వారు చెబుతున్నారు.

Next Story