ప్రభుత్వాలే చేనేత రంగాన్ని కుదేలు చేస్తున్నాయా? సహకార సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు? ఆప్కో చైర్మన్‌లను ఎందుకు నామినేట్‌ చేస్తున్నారు? ఎన్నికలు నిర్వహించే ఆర్థిక స్థోమత లేదా?


ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగాన్ని ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రాచీన భారత దేశ సంపదల్లో ఒకటిగా పేరు గాంచిన చేనేత రంగంపై దృష్టి పెట్టడం లేదు. బడ్జెట్‌లో సరిపడిన రీతిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం కానీ ఆ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులకు భరోసా కల్పించడంలో కానీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వాటిలోని బలోపేతం చేయడంలో కానీ శ్రద్ద చూపక పోవడంతో నిర్వీర్యం అవుతున్నాయి. దీంతో చేనేత రంగం అంతరించి పోయే దశకు చేరిందనే ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాతే ఈ పరిస్థితులు ఎక్కువ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 900పైచిలుకు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 500 చేనేత సహకార సంఘాలు సరిగా పని చేయలేని దుస్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వ సహకారం కొరవడంతో సిక్‌ యూనిట్స్‌గా మారాయి. మరో 400 సహకార సంఘాలు మాత్రం తమ స్వ శక్తితో కిందా మీద పడుతూ రన్‌ అవుతున్నాయి. ఉత్పత్తులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

ఒక్కో సంఘంలో ఇంత మంది సభ్యులు ఉండాలనే నియమం లేదు. ఆయా ప్రాంతాల్లో చేనేత మగ్గాలను బట్టి, చేనేత పనులు చేస్తున్న వారిని బట్టి సభ్యులు ఎంత మందైనా ఉండొచ్చు. 50 మంది నుంచి 3500 మంది వరకు ఉండే సంఘాలు కూడా ఉన్నాయి.
చేనేత పనులు చేస్తున్న వారికి ఈ సొసైటీల్లో సభ్యులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సహకార సంఘం పాలక వర్గం తీర్మానం చేసి సభ్యత్వం కల్పిస్తారు. నెలకు రెండు సార్లు మగ్గం నేయాలి, అలాంటి వారికి సభ్యులుగా అవకాశం కల్పించాలనే నిబంధనలు కూడా కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నాయి.
11 ఏళ్లుగా ఎన్నిలు జరపని ప్రభుత్వాలు
రాష్ట్ర విభజన తర్వాత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ప్రతి 5 ఏళ్లకు ఒక సారి ఎన్నికలు నిర్వహించాలి. ఫెడరల్‌ విధానానికి ప్రతీకలు ఈ సొసైటీలు. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాన్ని, అధ్యక్షులను ఎంపిక చేస్తారు. అలా సొసైటీలకు అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారు ఆయా జిల్లాలకు ఆప్కో డైరెక్టర్‌ను ఎన్నుకుంటారు. అన్ని జిల్లాల డైరెక్టర్లందరూ కలిసి ఆప్కో చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రతి జిల్లాలోని సొసైటీ అధ్యక్షులు, ఆప్కో డైరెక్టర్‌ కలిసి అప్కో పాలక వర్గంగా ఉంటారు. వీళ్లందరూ కలిసి ఆప్కోను నడిపించాల్సి ఉంటుంది.
అయితే 11 ఏళ్లుగా ఎన్నికల్లేవు. ప్రభుత్వాలు చైర్మన్‌లను నామినేట్‌ చేస్తున్నాయి. తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెడుతూ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం గుజ్జల శ్రీనుని ఆప్కో చైర్మన్‌గా చేసింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం చల్లపల్లి మోహన్‌రావును, గంజి చిరంజీవని చైర్మన్‌లుగా నామినేట్‌ చేశారు. ఎన్నికలు మాత్రం నిర్వహించడం లేదు.
ఆర్థికంగా కూడా పెద్ద భారం కాదు..
చేనేత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్థికంగా కూడా పెద్దగా ఖర్చు ఉండదు. అయినా ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదనేది పెద్ద ప్రశ్నగానే మిగిలి పోయిందని, ప్రభుత్వాలకు చేనేత రంగం పట్ల చిత్త శుద్ది లేకపోవడంతో పాటు నేతన్నను బతికిద్దామనే ఆలోచనలు లేక పోవడమే దీనికి ప్రధాన కారణమని ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు బండారు ఆనంద్‌ ప్రసాద్‌ ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు తెలిపారు. ప్రభుత్వాల ప్రోత్సాహం సరిగా లేక పోవడం వల్ల ఇప్పటికే చేనేత రంగం కుదేలైపోయిందని, రాను రాను అంతరించి పోయే దశకు చేరుకుంటుందని, ఎన్నికల అంశంపై చేనేత నాయకులు కానీ, సంఘాలు కానీ ముందుకు రాకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలు నిర్వహించడం వల్ల లాభాలు..
చేనేత రంగం పట్ల అవగాహన ఉన్న వాళ్లు, అభివృద్ది చేయాలనే తపన ఉన్న వాళ్లు పాలక వర్గంలోకి వస్తారు. సొసైటీల నుంచే ఎన్నుకోబడిని ఒకరు ఆప్కో డైరెక్టర్‌ అవుతారు. అందరు డైరెక్టర్లు కలిసి ఒక చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అధ్యక్షలు స్థాయి నుంచి చైర్మన్‌ స్థాయి వరకు కూడా చేనేత రంగం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్లే ఉంటారు. అంటే సొసైటీల్లో సభ్యుడు కూడా ఆప్కో చైర్మన్‌ కావడానికి చాన్స్‌ ఉంటుంది. చేనేత రంగం కష్ట నష్టాలు పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి చేనేత రంగాన్ని అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుంది. గత 11 ఏళ్ల క్రితం వరకు ఇలానే జరిగింది.
సొసైటీల ప్రాముఖ్యత..
సహకార సంఘాలు అనేవి చేనేత కార్మికులకు ఒక భరోసా లాంటివి. వీటి వల్ల చేనేత కార్మికులకు ఎంతో లాభాలు ఉంటాయి. అసంఘటితంగా ఉన్న వీవర్స్‌ను సంఘటితం చేసి వారికి నిత్యం పని కల్పిస్తూ, పనికి తగ్గట్టు మజ్దూరీలిస్తూ, వేతనాలిస్తూ, వారికి ఒక భరోసా కల్పించడం కోసం సొసైటీలను ఏర్పాటు చేశారని వాటి ప్రాముఖ్యతను గురించి ఆనంద్‌ ప్రసాద్‌ ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’కు వివరించారు.
ఒక వేళ సహకారు సంఘాలు లేకపోతే చేనేత కార్మికులందరూ మాస్టర్‌ వీవర్‌ వద్దకు వెళ్లిల్సా ఉంటుంది. మాస్టర్‌ వీవర్స్‌ అనే వాళ్లు ప్రధానంగా తమ స్వలాభం చూసుకుంటారు. తమ వద్ద పని చేస్తున్న కార్మికుల కష్టాన్ని చూడరు. మాస్టర్‌ వీవర్‌కు నచ్చిన విధంగా కూలీలు ఇస్తారు. ఒక వేళ అలా కాకుండా వీవర్‌ ఇండిపెండెంట్‌గా మగ్గం నేయాలనుకున్నా యార్న్‌ కానీ, జరీ కానీ మొత్తం వారే భరించాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంత పెట్టుబడులు పెట్టుకునేందుకు ఆర్థిక స్థోమతలు ఉండవు. అందువల్ల సొసైటీలలో సభ్యత్వం తీసుకొని వాటికి నేస్తారు. దీంతో మజ్దూరీలు ఎక్కువ అవుతాయి. దీంతో పాటుగా బెనిఫిట్స్‌ కూడా ఎక్కువుగా ఉంటాయి. ప్రభుత్వాలు అందించే అన్ని పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.
ఇలా సొసైటీలకు నేయడం వల్ల వాటికి వచ్చే లాభాల్లో సభ్యులకు వాటా పంచుతారు. అదే మాస్టర్‌ వీవర్‌ అయితే తనకు వచ్చే లాభాల్లో వీవర్‌లకు పంచరు. సొసైటీలకు నేయడం వల్ల లాభాలు చేకూరుతాయనే ఉద్దేశంతో చేనేత సహకార సొసైటీలను ఏర్పాటు చేశారు. దీని వల్ల వీవర్‌లు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. పనులు కల్పించడం కోసం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం సొసైటీలను ఏర్పాటు చేశారని ఆనంద ప్రసాద్‌ తెలిపారు. అదే మాస్టర్‌ వీవర్‌లైతే బిజినెస్‌ ఉన్న సమయంలో నేత నేయించుకుంటారు, బిజినెస్‌ డల్‌గా ఉన్న సమయాల్లో వీవర్‌లను పనుల నుంచి ఆపేసే పరస్థితులు కూడా ఉంటాయని, ఈ కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకునే సొసైటీలను ఏర్పాటు చేశారని ఆనంద్‌ ప్రసాద్‌ తెలిపారు.
చేనేత సహకార సంఘాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే వీటిని ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పోలవరం గ్రామంలో ఇండిపెండెన్స్‌కు ముందే సొసైటీని ఏర్పాటు చేశారని ఆనంద ప్రసాద్‌ తెలిపారు. చేనేత సహకార సంఘాలకు పుచ్చల సత్యనారాయణ ఆధ్యుడుగా పేర్కొంటారు.
Next Story