ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి భోగాపురం వెళ్లడంలో ఆంతర్యం ఏమిటి? అకస్మాత్తుగా, అత్యంత సీక్రెట్‌గా సీఎస్ వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అకస్మాత్తుగా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాల పనుల పరిశీలనకు వెళ్ళడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరిగిపోయినా ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హంస, దానిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడం, నిజ నిర్థారణకు సిట్‌ను ఏర్పాటు చేయడం, లా అండ్ ఆర్డర్ సమస్యలు, వేసవిలో తాగు నీటి సమస్యలు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ సమయం వాటికి కేటాయించకుండా కీలకమైన సమయంలో భోగాపురం వెళ్లడం తాజాగా చర్చగా మారింది. పైగా సీఎస్ భోగాపురం పర్యటనపై సీఎస్ గోప్యతను పాటించడంపైన కూడా పలు అనుమానాలకు తావిచ్చినటై్టందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం భోగాపురం పర్యటనకు వెళ్లారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణాల పనులను పరిశీలించారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనంతో పాటు రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ భవనాలు, ఇతర నిర్మాణాల ప్రోగ్రెస్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులతో చిన్న పాటి సమీక్ష నిర్వహించిన సీఎస్ వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థకు ఆదేశాలిచ్చారు. వీలైనంత త్వరగా నిర్మాణాల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లిన సీఎస్ లోకల్ అధికారులకు మాత్రం తాను వస్తున్నట్లు సమాచారం అందించడంతో విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, ఆర్డీఓ ఎంవీ సూర్యకళ, తాహశీల్దార్ శ్యామ్ ప్రసాద్, జీఎంఆర్ సంస్థ సీఈఓ మోమయ్ రాయ్, ప్రాజెక్టు హెచ్ బిహెచ్ ఏ రామరాజు, ఇతర రివెన్యూ అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
అయితే భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు సక్రమంగా జరగడం లేదని పనులు వేగవంతం కాకుండా ఆలస్యంగా జరుగుతుండటం, నిర్మాణాల్లో కొన్ని లోపాలున్నాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అక్కడకు వెళ్లి తనిఖీలు చేపట్టారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాత విమానాశ్రయం నిర్మాణాల పనులను జిఎంఆర్ సంస్థ కాంట్రాక్టు తీసుకుంది. 36 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వస్తున్నారనే విషయాన్ని విశాఖ జిల్లా అధికారులు గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్ ఎయిర్ పోర్టుకు వచ్చి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించే వరకు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడని, విదేశీ పర్యటనల్లో ఉన్నందు వల్ల అన్నీ తానై పాలనా వ్యవహారాలను చూస్తున్న సీఎస్ వేసవిలో తాగు నీరు, అకాల వర్షాలు, కరువు, ఇరిగేషన్, వ్యవసాయం వంటి అంశాలపై సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవలసింది పోయి బోగాపురం ఏయిర్ పోర్టు పనులపై అంత అర్జెంటుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అనేది విమర్శలకు తావిస్తోంది. దశల వారీగా నిర్మాణ పనులు కాంట్రాక్టు సంస్థ అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిర్మాణ పనుల సమీక్ష సమయంలో మీడియాకు కూడా అవకాశం కల్పించి ఉంటే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంలో ఏమి జరుగుతుందో అనేది ప్రజలందరికీ క్లియర్‌గా తెలిసి ఉండేదని. అలా కాకుండా గోప్యత పాటించడం వల్ల ఇక్కడేదో జరగ కూడని వ్యవహారమేదో జరుగుతోందనే విమర్శలకు తావిచ్చినటై్టందనేది చర్చగా మారింది. నిర్మాణ పనులు ఇంకా రెండున్నర ఏళ్ల కాలం చేసేందుకు కాంట్రాక్టు సంస్థకు అవకాశం ఉంది. నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యత, లోపాలు తదితర అంశాలపైన అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం జవహర్‌రెడ్డి కారణాలు ఏమిటనే విషయాన్ని మీడియాకు కూడా వివరించే ఉంటే బాగుండేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.
Next Story