20 రోజులు తిరక్కముందే మహిళా ఎస్పీ మల్లికను బదిలీ చేశారెందుకు?
తిరుపతి జిల్లాకు వచ్చిన మొదటి మహిళా ఎస్పీకి ప్రభుత్వం చుక్కలు చూపింది. 20 రోజులు తిరక్కుండానే బదిలీ వేటు వేసింది ఎందుకో మరి..
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
‘కనిపించే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్" అనే సినిమా డైలాగ్ గుర్తుందిగా.. సినిమా హీరో శ్రీహరి చెప్పిన ఆ పవర్ ఫుల్ డైలాగ్ కి హాలంతా దద్దరిల్లినా రియల్ లైఫ్ లో మాత్రం ఇబ్బందులు తప్పవని మరోసారి రుజువైంది. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి మల్లిక గర్గ్. బదిలీపై వచ్చి నిండు మూడు వారాలు ముగియకమునుపే బదిలీ వేటు పడింది. గతంలో ఒక్క రోజులోనే ఒక ఎస్పీ తిరుపతి నుంచి బదిలీ అయిన సంఘటన ఉండడంతో మల్లిక బదిలీ వ్యవహారం ఎవరికీ పెద్దగా వింతని పించలేదు. అయితే ఈ విషయాన్ని టీడీపీ, జనసేన చాలా సీరియస్ గా తీసుకున్నాయి.
ప్రకాశం నుంచి తిరుపతికి...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రకాశం జిల్లా నుంచి మల్లికా గర్గ్ ను ఫిబ్రవరి 12న తిరుపతి జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లాలో రెండున్నర ఏళ్లు పని చేసిన ఆమె సమర్థవంతమైన, నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటి మనిషిగా పేరున్న ఈమే రాజసత్కారాలకు దూరం. తాను సన్మానాలు చేయించుకోవడమూ లేదూ చేయడమూ లేదు. జిల్లాకు వచ్చి రాగానే ... విధి నిర్వహణలో అలసత్వం, అనినీతి ఆరోపణలతో హెడ్ కానిస్టేబుల్ మరొక కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. వారిలో ఒకరిపై చర్యలు వెనక్కి తీసుకోవాలని అధికార పార్టీ నేత సూచనలు కూడా ఖాతరు చేయలేదని సమాచారం.
అధికార పార్టీకి రుచించని చర్య
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తమ కార్యకర్తలపై అకారణంగా రౌడీషీట్ తెరుస్తున్నారంటూ టిడిపి నేతల వినతితో ఆమె విచారణకు ఆదేశించారు. ఇది అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నచ్చలేదన్న ప్రచారం ఉన్నా గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వారిని బైండోవర్ చేయడంతో పాటు మూడుకు మించి కేసులు ఉంటే రౌడీషీట్లు తెరవాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. "తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖకు చెడ్డ పేరు వచ్చింది. రానున్న ఎన్నికల్లో ఇలాంటి జరగడానికి లేదు"నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి అని ఆమె సూచించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో నకిలీ కార్డుల వ్యవహారం ఒక ఐఏఎస్ అధికారి తో పాటు వివిధ స్థాయిలోని ఐదుగురు పోలీసు అధికారులు కూడా సస్పెండ్ అయిన విషయం ఆమె పరోక్షంగా ప్రస్తావించినట్టయింది. పోలీస్ స్టేషన్లో తనిఖీ సమయంలో కూడా అధికారులకు ఇదే మాట చెబుతూ వచ్చారు. గీత దాటితే నిర్మోహమాటంగా చర్యలు తీసుకుంటామని కఠినంగా హెచ్చరించారు. ఉలిక్కిపడిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎస్పీ మల్లిక గర్గ్ ను రోజుల వ్యవధిలోనే సాగనంపారని భావిస్తున్నారు.
రిలీవ్ అవుతున్నా..
"ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు పనిచేయాలి" సేవలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి బదిలీ చేస్తారు. మంగళవారం విధుల నుంచి రిలీవ్ అవుతా" అని ఫోన్లో పలకరించినప్పుడు ఎస్పీ మల్లిక గర్గ్ ఫెడరల్ ప్రతినిధితో అన్నారు.
విజయరావునైతే ఒక్క రోజులోనే...
గతంలో కూడా తిరుపతికి ఎస్పీగా వచ్చిన విజయరావు అనే ఐపీఎస్ అధికారి 24 గంటలు బదిలీకి గురయ్యారు. సాధారణంగా తిరుపతి అంటే ప్రోటోకాల్ డ్యూటీ లతోపాటు టిటిడి ఆలయాల్లో భద్రత కూడా పరివేక్షించాలి. అయితే విజయరావు సతీమణి తిరుమల ఆలయం వద్ద ప్రసాదం తీసుకోడాన్ని తిరస్కరించిన వ్యవహారం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందరంతో.. బదిలీ చేశారని విషయం అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది.
ఆటలు సాగవనే..: టిడిపి
తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్ల వ్యవహారం నిగ్గుతేలుతుందని అధికార పార్టీ నేతలు భయపడ్డారు" అని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎం. సుగుణమ్మ ఆరోపించారు. టిడిపి తిరుపతి పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు జి. నరసింహ యాదవ్, కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ,జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి కార్పొరేటర్, మునికృష్ణ పులిగోరు మురళీకృష్ణారెడ్డి మబ్బు దేవనారాయణ రెడ్డి ఊక విజయ్ కుమార్ ఆరోపించారు. ఎస్పీ బదిలీనీ నిరసిస్తూ వారు తిరుపతి బెస్ట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
మాట వినకుంటే మార్చేస్తారా...
"నాయకులు చెప్పింది చేయకుంటే బదిలీ చేస్తారా? అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా ఉంది" అని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ప్రభుత్వ పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు."రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అరాచక పాలన సాగుతోంది" అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామాజిక శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఆశీస్సులు లేకుంటే ఏ ప్రభుత్వ అధికారి పనిచేయరనే సంకేతం ఇస్తున్నారని అన్నారు.
బదిలీ బహుమానమా?
నాలుగు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. నీతి, నిజాయితీ కలిగిన మహిళా ఎస్పీ మల్లికా గార్గ్ కు బదిలీని బహుమానంగా ఇచ్చిన వైసిపి తీరు అభ్యంతర కరమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విమర్శించారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మహిళా ఎస్పీ మల్లికా గార్గ్ ను బదిలీ చేయమని ఒత్తిడి తేవటం దారుణమని, మహిళల పట్ల వైసిపి కున్న గౌరవం ఏ పాటిదో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.