టిటిడి ఆంధ్రా  నెయ్యి ఎందుకు కొనడం లేదు: బాబుకు ఇఎఎస్ శర్మ ప్రశ్న
x

టిటిడి ఆంధ్రా నెయ్యి ఎందుకు కొనడం లేదు: బాబుకు ఇఎఎస్ శర్మ ప్రశ్న

ఆంధ్ర ప్రదేశ్ మిల్క్ కోఆపరేటివ్స్ మీద ఆధార పడక, KMF నమ్ముకుని, వారు సూచించిన ధరకు ప్రభుత్వం నెయ్యి కొనడం బాధాకరం. దేశంలో ఆంధ్రా నెయ్యి టాప్ కదా!


ఆంధ్రప్రదేశ్ మిల్క్ కోఆపరేటివ్స్ నుంచి నెయ్యి కొనాలని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ లేఖ



టీటీడీ లడ్డు నాణ్యత విషయంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, లోతుగా దర్యాప్తు చేపట్టి, నాణ్యతలో లోపం ఉంటే, అందుకు బాధ్యులు అయిన అధికారుల మీద, కంపెనీల మీద, ఇతరుల మీద, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఒక తమిళ నాడు కంపెనీ సప్ప్లై చేసిన నెయ్యి నాణ్యతలో, లోపం ఉండడం కారణంగా, మీ ఆదేశాలను అనుసరిస్తూ, టీటీడీ వారు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) వారి "నందిని" బ్రాండ్ నెయ్యిని కొనడం మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చేయి. KMF సప్ప్లై చేసే నెయ్యి నాణ్యత లో ఎటువంటి లోపం ఉండదని ఆశిస్తున్నాను.

పాల ఉత్పత్తి, ఆవు పాల నుండి సేకరించిన నెయ్యి ఉత్పత్తిలో, జాతీయస్థాయిలో మన రాష్ట్రం పోటీ పడగలదు. మన రాష్ట్రంలో 50 లక్షలకు పైగా, పాలు ఉత్పత్తి చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వారిలో చాలామంది చిన్నకారు రైతు కుటుంబాలు. జాతీయ స్థాయిలో, 7.4% పాల ఉత్పత్తి మన రాష్ట్రంలో జరుగుతున్నది. జాతీయ స్థాయిలో తలసరి, రోజుకు పాల ఉత్పత్తి 355 గ్రాములు అయితే, మన రాష్ట్రం లో సగటు ఉత్పత్తి 522 గ్రాములు. అదే కాకుండా, నెయ్యి ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం ముందు ఉంది.

గతంలో , సహకార రంగంలో, "విజయ ఘీ" రాష్ట్రవ్యాప్తంగా ప్రఖ్యాతి గణించడం అందరికీ తెలిసిన విషయం. కాని, గత ప్రభుత్వాలు, ప్రైవేట్ పాల ఉత్పత్తి దారులతో కుమ్మక్కయి, సహకార రంగంలో సమాజానికి లాభదాయకంగా పనిచేస్తున్న పాల సహకార సంఘాల (milk cooperatives )కు అపారమైన నష్టాన్ని కలిగించిన విషయం కూడా ప్రజలకు తెలియనిది కాదు.

గుజరాత్ లో డా. వర్గీస్ కురియన్ ( Dr Verghese Kurien) గారి నేతృత్వంలో అమూల్ (Amul)పేరులో, సహకార రంగంలో పాల ఉత్పత్తి సంఘాలు అత్యంత నైపుణ్యం తో, విజయవంతంగా పని చేసి, ప్రపంచ స్థాయిలో ఘనత సాధించాయి. అదే విధంగా, కర్ణాటక రాష్ట్రంలో, అక్కడి ప్రభుత్వం, దూరదృష్టితో వర్గీస్ గారు చూపిన దిశలో, KMF ను స్థాపించి, సహకార రంగ మిల్క్ కోఆపరేటివ్స్ ను ప్రోత్సహించడం జరిగింది.

సహకార రంగంలో పాల ఉత్పత్తి జరిగితే, ప్రజలు భాగస్వాములు గా ఉండి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు. ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో పాల ఉత్పత్తి జరిగితే, లాభాలు పొందేది ఆ కంపెనీల యజమానులు మాత్రమే. ప్రజల సంక్షేమం కోరే ఏ ప్రభుత్వమైనా, సహకార రంగంలో మిల్క్ కోఆపరేటివ్స్ ను ప్రోత్సహిస్తుంది కాని, ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించకూడదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ఎడమ), డాక్టర్ ఇఎఎస్ శర్మ


ఈ రోజు, టీటీడీ లడ్డూల కోసం, నెయ్యి సేకరించడం విషయంలో, మన సహకార రంగంలో ఉన్న మిల్క్ కోఆపరేటివ్స్ మీద ఆధార పడలేక, KMF మీద, వారు సూచించిన ధరకు, మన ప్రభుత్వం ఆధారపడడం బాధాకరమైన విషయం. అంటే టీటీడీ నెయ్యి సేకరణ కార్యక్రమం వలన కలిగే ఉపాధి అవకాశాలు కర్ణాటకకు లభిస్తాయి. మన రాష్ట్ర ప్రజలకు లభించవు.


అమూల్ తమ కార్యకలాపాలను కర్ణాటకకు విస్తరించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో, ఆ రాష్ట్ర ప్రజలు ఏకకంఠంతో వ్యతిరేకించారు. అదే Amul, క్రిందటి సంవత్సరం మన రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు, మీ పార్టీ కూడా అందుకు వ్యతిరేకత చూపించడం జరిగింది

కురియన్ గారు చూపిన దిశలో, ప్రభుత్వం మన సహకార రంగ పాల ఉత్పత్తి సంఘాలను బలపరిచి, గుజరాత్ కర్ణాటక ప్రభుత్వాలు ప్రోత్సహించే విధంగా, ఆ సంఘాలను ప్రోత్సహించి ఉంటే, టీటీడీ నేతి సేకరణ కార్యక్రమం వలన మన పాడి పరిశ్రమకు, ఆ పరిశ్రమ మీద ఆధారపడే లక్షలాదిమంది కుటుంబాలకు, లాభం కలిగి ఉండేది. ఇప్పుడైనా, రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రైవేటు కంపెనీల ఒత్తిడికి లొంగకుండా, మన రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న మిల్క్ కోఆపరేటివ్స్ :ను బలపరిస్తే, రాష్ట్ర ప్రజలకు లాభం కలుగుతుందని మీ ప్రభుత్వం గుర్తించాలి.

టీటీడీ లడ్డూలకు కావలసినది, ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యి. అటువంటి నెయ్యి రాయలసీమ ప్రాంతంలో అధికంగా లభించడం కారణంగా, టీటీడీ అవసరాల కోసం అక్కడిమిల్క్ కోఆపరేటివ్స్ నుంచి నేతిని సేకరిస్తే, ఆ ప్రాంతానికి లాభం కలిగే అవకాశం ఉంది
అమూల్ , KMF దిశలో పాలు, ఇతర పాల ఉత్పత్తుల నాణ్యత పరీక్షించే సౌకర్యాలను రాష్ట్రంలో, వివిధ జిల్లాలలో స్థాపించి, మిల్క్ కోఆపరేటివ్స్ కు గిట్టుబాటు ధరను ఇస్తే, మన రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించగలడు. మన రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న మిగిలిన దేవాలయాల్లో కూడా భక్తులకు ఇస్తున్న ప్రసాదం నాణ్యత విషయంలో, మీ ప్రభుత్వం అదే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మన రాష్ట్ర అభివృద్ధికి, పాడి పరిశ్రమే కాకుండా, వ్యవసాయం, మత్స్య సంపద వెన్నెముక లాంటివి- ప్రకృతి ఇచ్చిన అటువంటి విలువైన వనరులను, ప్రభుత్వం చేతులారా పోగొట్టు కొంటున్నది:

వ్యవసాయ రంగం సమస్యలు:

రాష్ట్ర బహుముఖ అభివృద్ధికి ముఖ్యమైన ఆధారం వ్యవసాయరంగం. 60% కు పైగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కాని ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా, ప్రతి సంవత్సరం, వేలాది ఎకరాల సాగు భూములు, ప్రాజెక్టుల కోసం, వ్యవసాయేతర కార్యక్రమాల కోసం, కేటాయించబడి, రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం తగ్గుతున్నది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కూడా తగ్గుతున్నది.

ఉదాహరణకు, ప్రభుత్వం 30,000 ఎకరాలకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, రాజధాని కోసం సేకరించిన సందర్భంలో, 2013 భూసేకరణ చట్టం 10వ సెక్షన్ క్రింద, ఆ ప్రాంతం ఆహార భద్రత కోసం, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గడానికి ఒక ముఖ్యమైన కారణం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం.

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర విషయంలో, స్వామినాథన్ కమిటీ వారు సిఫార్స్ చేసిన కనీస మద్దతు ధర కన్నా మన రాష్ట్రంలో వరి పంటకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన MSP 40% తక్కువగా ఉంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే గోధుమ పంటకు, కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర మాత్రం స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిన ధరకు దగ్గరిలో ఉండడం, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి నిదర్శనం. ఎన్ డి ఎ ( NDA )ప్రభుత్వంలో భాగస్వాములు గా ఉన్న మీ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ వారు సిఫార్స్ చేసిన కనీసం మద్దతు ధర ని మన రాష్ట్రంలో పండించే పంటలకు వర్తింపచేయాలని ఒత్తిడి తెచ్చినప్పుడే, మన రాష్ట్రంలో రైతాంగం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

రాష్ట్రంలో పనిచేస్తున్న పరిశ్రమలలో సరి అయిన కాలుష్య నియంత్రణ లేకపోవడం కారణంగా, జలవనరులు, ముఖ్యంగా భూగర్భ జలవనరులు, కాలుష్యానికి గురి అవ్వడం వలన, వ్యవసాయ ఉత్పత్తి నాణ్యత నష్టపడుతున్నది అందువలన నష్టపోయేది ప్రజల ఆరోగ్యం. మత్స్య సంపద మీద ఆధారపడే సాంప్రదాయ మత్స్యకారుల పరిస్థితి:

రాష్ట్రం సముద్రతీర ప్రాంతంలో, 555 సాంప్రదాయ మత్స్యకారుల శివార్లలో నివసిస్తున్న 8 లక్షల సంప్రదాయ మత్స్యకారుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. తీరప్రాంతంలో, కాలుష్యాన్ని వెదజల్లుతున్న ప్రాజెక్టులు రావడం కారణంగా, తీరప్రాంత మత్స్య సంపద తగ్గడమే కాకుండా, నాణ్యత కూడా లోపించి, ప్రజల ఆరోగ్యానికి నష్టం కలుగుతున్నది. సంప్రదాయ మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచి, తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల మీద రాష్ట్ర కాలుష్య నియంత్రణ వ్యవస్థ సరిగా నియంత్రణ చేయగలిగితే, ప్రకృతి ప్రసాదించిన మత్స్య సంపద వలన రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంది.

తిరుపతి లడ్డు నాణ్యత కు ఇస్తున్న ప్రాముఖ్యత, ప్రభుత్వం, ప్రజలు తింటున్న ఆహార పదార్థాల నాణ్యత కు, వారు పీలుస్తున్న గాలి లో కాలుష్య పదార్థాల నియంత్రణకు ఇవ్వాల్సి ఉంది:తిరుపతి ప్రసాదం నాణ్యత మీద ప్రభుత్వం చాలా ఆవేశంతో, ఆవేదనతో దృష్టి పెట్టడం హర్షణీయం.

అదే ఆదేశంతో, అదే ఆవేదనతో, ప్రజలు నిరంతరం ఆధారపడే ఆహార పదార్థాల నాణ్యత మీద, వారు నిరంతరం తాగే నీటి నాణ్యత మీద, ప్రజలు నిరంతరం పీల్చే గాలి లో విస్తృతంగా ప్రవేశించిన కాలుష్య పదార్థాల నియంత్రణ మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి, ప్రజల ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరుస్తుందని ఆశిస్తున్నాను.


Read More
Next Story