డ్రగ్స్ పడగనీడలో విశాఖ....
x
Source: Twitter

డ్రగ్స్ పడగనీడలో విశాఖ....

ప్రశాంత విశాఖ నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది.అంతర్జాతీయ డ్రగ్ మాఫియా విశాఖనే ఎందుకు టార్గెట్ చేసింది...?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు విశాఖ వేదిక అయిందా... దేశవ్యాప్తంగా దొరుకుతున్న గంజాయి మూలాలు విశాఖలోనే ఉన్నాయా... మత్తుమందుల రవాణాకు విశాఖ ఎందుకు అడ్డాగా మారింది.. ప్రస్తుతం ఈ ప్రశ్నలు అన్ని వర్గాలను వేధిస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. అన్ని మౌలిక సదుపాయాల నగరంగా పేరుగాంచింది. వాయు, జల, రోడ్డు రవాణా సదుపాయాలు కలిగిన నగరంగా విశాఖ ఉంది. ఈ సౌకర్యాలే విశాఖ వైపు డ్రగ్ మాఫియాను ఆకర్షించాయి. దీంతో ప్రపంచవ్యాప్త డ్రగ్ రవాణాకు విశాఖ కేంద్రంగా మారిపోయింది. వాయు, రోడ్డు మార్గాలలో విపరీతమైన నిఘా ఉండడంతో జల మార్గాన్ని డ్రగ్స్ రవాణాకు వాడుకుంటుంది అంతర్జాతీయ డ్రగ్ మాఫియా. ఈ విషయం విశాఖ పోర్టులో సి.బి.ఐకి చిక్కిన డ్రగ్ కంటైనర్‌తో తేటతెల్లమయింది.

మత్తులో విశాఖ...

గంజాయి.. లిక్విడ్ గంజాయి... మత్తు ఇంజక్షన్లు...టాబ్లెట్లు.. కొకైన్.. హెరాయిన్... ఇలా అన్ని రకాల మాదకద్రవ్యాలు విశాఖ మీదుగానే రవాణా అవుతున్నాయి. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు విస్తృతంగా జరుగుతుండగా...ఇక్కడ నుండే దేశ నలుమూలలకు సప్లై అవుతుంది. గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్ర పోలీసులు తీసుకున్న చర్యలతో పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడినప్పటికీ మూలాలు మాత్రం విశాఖ ఏజెన్సీలోనే ఉన్నాయి. యువతను మత్తులో ముంచేత్తే మాదకద్రవ్యాల నియంత్రణ కోసం గత కొంతకాలంగా ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. పీఓడబ్ల్యూ ఇటీవల కాలంలో విశాఖ నగరంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం మహోద్యమం చేపట్టింది. మత్తు పదార్థాలను అరికట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. విశాఖలో జరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు 'పీ ఎంజీ మత్తుమందులకు రాజధానిగా మారిన విశాఖను కాపాడండి' అంటూ వినూత్న కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

డ్రగ్స్ కలకలం....

ప్రశాంత విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. మునుపెన్నడూ లేని విధంగా వేలకోట్ల రూపాయలు విలువచేసే వేల కేజీల డ్రగ్స్ బయటపడ్డాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ అధికారులు 'ఆపరేషన్ గరుడ' పేరుతో డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు. కాకినాడకు చెందిన సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట విశాఖపట్నం పోర్టుకు చేరిన కంటైనర్ను సీజ్ చేసి తనిఖీలు నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ బయటపడటంతో సీబీఐ అధికారులతో పాటు దేశం మొత్తం విస్తుపోయింది.

బ్రెజిల్ టు విశాఖ...

దక్షిణ అమెరికా బ్రెజిల్ నుంచి బయలుదేరిన కంటైనర్ దక్షిణ భారతదేశంలోని తూర్పు తీరానికి చేరింది. 25 వేల కిలోల డ్రై ఈస్ట్ పేరిట గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్న కొకైన్ బాగోతాన్ని సీబీఐ భగ్నం చేసింది. ఈ డ్రగ్స్ మాఫియాపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సంధ్య ఆక్వాకు ఇందులో సంబంధం ఏంటి... డ్రగ్స్ రవాణా వెనుక వ్యక్తులు ఎవరు... ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ రవాణా వెనుక దాగి ఉన్న కుట్ర కోణాలను బయట పెట్టేందుకు సీబీఐ అధికారుల బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.

రాజకీయ దుమారం...

విశాఖపట్నం పోర్ట్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ బయటపడటంతో రాజకీయ దుమారం లేగింది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సంధ్య ఆక్వా కంపెనీ యాజమాన్యం బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి దపురందేశ్వరికి తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడికి బంధువులనీ, రెండు పార్లీలకు ఈ డ్రగ్స్ తో సంబంధం ఉందని వైసిపి ప్రధాన కార్యదర్శి రాష్ట్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అయితే, ఈ కంపెనీ యజమానులు రాజకీయంగా వైసిపికి దగ్గరి వారని బిజెపి ఆరోపించింది. ఈ డగ్స్ తో కూడిన ప్రాణ్ ఫీడ్ కంటైనర్ పట్టుబడటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

Read More
Next Story