బీసీలపై ప్రేమంటే ఇంకేదో అనుకున్నామే చంద్రన్న!
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతవరకు న్యాయం చేస్తున్నాయి. ఎంతమందిని చట్టసభలకు పంపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో కూటమి ఏం చేసింది..?
(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: 'బీసీ డిక్లరేషన్ ఇచ్చాం… బీసీల రక్షణకు చట్టం చేస్తాం… బీసీలకు పెద్దపీట వేసింది మా పార్టీయే' ఎన్నికల కాలంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇవి... కానీ విజయనగరం జిల్లాలో ఏం జరిగింది...? ఎంతమంది బీసీలకు కూటమి టికెట్లు ఇచ్చింది. బీసీలపై చంద్రబాబు మాటల్లో చూపించిన ప్రేమ చేతల్లో కనిపించట్లేదంటూ విజయనగరం జిల్లాలో సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. విజయనగరం ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా... టీడీపీ-జనసేన-బీజేపీల కూటమి కేవలం రెండు స్థానాల్లో బీసీలకు సీట్లు కేటాయించగా... అధికార వైసీపీ అయిదు చోట్ల బీసీలకు అవకాశం ఇచ్చింది.
బీసీలకు ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది.....
విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ, వైసీపీ.. బీసీలకు ర కేటాయించారు. అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్ 2024 ఎన్నికల బరిలో దిగగా.. టీడీపీ తరఫున అదే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉండగా.... విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన గజపతిరాజు పోటీ చేస్తుండగా... వైసీపీ నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నికల బరిలో ఉన్నారు. గజపతినగరం నియోజకవర్గం నుంచి ఇరు పార్టీల నుంచి తూర్పు కాపులే పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి కొండపల్లి శ్రీనివాస్, వైసీపీ నుంచి బొత్స అప్పలనరసయ్య పోటీ చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీ.. ఓసీ, వెలమ దొరకు టికెట్ కేటాయించింది. వైసీపీ.. బీసీ, కొప్పల వెలమకు టికెట్ కేటాయించింది.
ఆర్‌విఎస్‌కేకే రంగారావు( బేబీ నాయనా) టీడీపీ నుంచి, తంభంగి వెంకట అప్పలనాయుడు.. వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన కొండ్రు మురళి.. టీడీపీ నుంచి, డాక్టర్ తాలే రాజేష్.. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎచ్చెర్లలో కూటమి తరపున కమ్మ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు ఎన్నికల బరిలో నిలవగా... వైసీపీ నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గొర్లె కిరణ్ కుమార్ పోటీ పడుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తూర్పు కాపుల మధ్య పోటీ జరుగుతుంది. బొత్స సత్యనారాయణ.. వైసీపీ నుంచి, కిమిడి కళా వెంకట్రావు.. టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి తరపున జనసేన అభ్యర్థి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవి పోటీలో ఉండగా.... తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీ అప్పలనాయుడు.. వైసీసీ ఎన్నికల బరిలో నిలిచారు.
బీసీలకు ఎవరు న్యాయం చేశారు...?
విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలను చూసుకుంటే బీసీలకు టీడీపీ రెండు సీట్లు కేటాయించగా.. వైసీపీ ఐదు సీట్లు కేటాయించింది. దీంతో అక్కడ బీసీ వర్గాలు కూటమి పార్టీలపై గుర్రుగా ఉన్నారు. ఇదేనా బాబు బీసీలపై ప్రేమ అంటూ వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామంతో విజయనగరం జిల్లాలో టీడీపీ కూటమికి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
Next Story