క్రియాశీలతను సమర్థించే, ఆచరించే వ్యక్తిగా పేరుంది. సామాజిక మార్పు కోసం పోరాడే వ్యక్తి గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది.
అదనపు డీజీపీ హోదాలో ఎప్పుడూ యాక్టివిస్ట్ గానే ఉన్న పివి సునీల్ కుమార్ సమాజంలో మార్పును కోరుకునే వ్యక్తిగా అధికార వర్గాల్లోనూ పేరు సంపాదించారు. అంబేద్కరిజాన్ని గౌరవించేవారుగా, ఆచరించే వారుగా పేరుంది. పలు సందర్భాల్లో ఆయన కులానికి సంబంధించిన సదస్సులు, సభలకు హాజరయ్యే వారు. వారిలో ఉత్తేజం నింపేలా స్పీచ్ ఉండేదని ఆయన స్నేహితులు చెబుతుంటారు. గత ప్రభుత్వంలో సునీల్ కుమార్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వేకెన్సీ రిజర్వులో ఉన్నారు. కూటమి ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.
ఎందుకు వివాదాస్పదుడు అయ్యారు..
ఏపీలో సునీల్ కుమార్ ఉద్యోగ ప్రయాణం 30 సంవత్సరాలు దాటింది. ఎంతో మంది పేదలకు సాయం చేశారనే పేరు ఉంది. గత ప్రభుత్వ హయాం వరకు కూడా ఆయనపై ఎటువంటి నిందలు, ఆరోపణలు లేవు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి అదే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వాన్ని వ్యతిరేకించి పలు ఆరోపణలు చేశారు నాటి ఎంపీ రఘురామ కృష్ణ రాజు. దీంతో దేశద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వంలో ఉంటూ ఆ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామ పై కేసు నమోదు కావడంతో అప్పట్లో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ పిలిపించి ఎంపీ హోదాలో విచారించాల్సి వచ్చింది. ఆ విచారణ సందర్భంగా తనను కొట్టి చంపించేందుకు వ్యూహం రూపొందించారని అప్పట్లో రఘురామ కేసు పెట్టినా అది ముందుకు నడవలేదు. కూటమి రావడం, రఘురామ తిరిగి కూటమి లోని టీడీపీ నుంచి గెలిచి ఉప సభాపతి కావడంతో సునీల్ పై మరిన్ని కేసులు నమోదయ్యాయి.
ఎవరీ సునీల్ కుమార్
పీవీ సునీల్ కుమార్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఎంపికయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో స్టేట్ విపత్తుల నిర్వహణ శాఖ, ఫైర్ సర్వీస్ కు డైరెక్టర్ జనరల్ గా, సీఐడీ చీఫ్ గా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో 1966 జూన్ 8న గంగరాజు, గ్రేస్ దయామణి దంపతులకు జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో BA పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషియాలజీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.
సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 30 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సీఐడీ చీఫ్ గా ఉన్నప్పుడు హై ప్రొఫైల్ కేసులు ఛేదించడంలో ప్రశంసలు అందుకున్నారు. మరో కోణంలో సునీల్ కుమార్ సృజనాత్మక రచయిత, తెలుగులో దాదాపు 40 చిన్న కథలు, రెండు నవలలు రచించినట్లు ఆయన స్నేహితులు తెలిపారు. మంచి రచయిత ఆయనలో ఉన్నారని ఆయనతో పరిచయం ఉన్న పలువురు వ్యక్తులు చెబుతుంటారు.
సాయం చేసే గుణం
తాను నమ్మిన సిద్ధాంతం కోసం పే బ్యాక్ సొసైటీ అనే అంబేడ్కర్ నినాదంతో కష్టమని వచ్చిన వారికి సహాయం చేయడమే లక్ష్యంగా పివి సునీల్ కుమార్ అడుగులు వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నోవహు అనే విద్యార్థి గుజరాత్ రాష్ట్రం వడోదరలోని పారుల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు సంపాదన లేక.. కాలేజీ ఫీజు చెల్లించలేదు. దీంతో నోవహును ఆన్‌లైన్ క్లాసులకు అనుమతించలేదు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఇక చదువు ఆపేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ విద్యార్థి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న IPS పీవీ సునీల్ కుమార్ ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా కాలేజీ ఫీజు కూడా చెల్లించారు. ఇప్పటికీ కొంత మంది ఆర్థికంగా వెనుకడిన పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
పురస్కారాలు
2010లో ఇండియన్ పోలీస్ మెడల్, 2017లో ఇండియన్ ప్రెసిడెంట్ మెడల్ సాధించారు. Utkrisht Seva Padak 2017-18, Outstanding Meritorious Service. Ati Utkrisht Seva Padak, 2018-19, Outstanding Meritorious Service. SKOCH Award 2020, SKOCH Award 2019, (E-Learning. SKOCH Award, 2019 PCR Dash Board) SKOCH Award, 2020 (E-Nirdesha SKOCH Award 2020) - Operation Muskaan-Covid-19. Tech Sabha Awards 2019, I APP Tech Sabha Award 2019-PCR Dash Board. Tech Sabha Awards 2020 - 4S4U వంటి అవార్డులు అందుకుని పలువురి ప్రశంసలు పొందారు.
సునీల్ పై ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు ఫిర్యాదు
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రఘురామ కృష్ణ రాజు సునీల్ పై కేసు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధిపతిగా ఉండగా తనపై నమోదైన కేసులో కస్టడీకి పిలిపించి హింసించి చంపేందుకు ప్లాన్ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన సునీల్ ‘ఆ కేసు సుప్రీ కోర్టులో మూడేళ్లు నడిచింది. సాక్షాత్తు సుప్రీ కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞత కే వదిలేస్తున్నా’ అంటూ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తరపున కేసు పెడితే దానిని ప్రశ్నించడం ఏమిటని ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అగ్రీ గోల్డ్ బాధితులకు ఇవ్వాల్సిన డబ్బునూ స్వాహా చేశారని రఘురామ మరో ఫిర్యాదు చేశారు.
విచారణాధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆర్పీ సిసోడియా
సునీల్ ను విచారించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియాను ప్రభుత్వం నియమించింది. అఖిల భారత సర్వీసు ప్రవర్తనా నియమావళిలోని 7వ నియమాన్ని ఉల్లంఘిస్తూ ట్విటర్ వేదికగా కేసులపై స్పందించారని ప్రభుత్వం తేల్చింది. ఆయనపై అభియోగాలు నమోదు చేస్తూ 2024 అక్టోబర్ 7న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు సిసోడియాను విచారణకు నియమించారు. 15 రోజుల్లో పోస్టుకు సంబంధించి వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ సాధారణమని భావించిన సునీల్ ప్రభుత్వం ఏ వివరణ కోరినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
కూటమి అధికారంలోకి రాగానే సునీల్ పై వేటు
పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2024 జూలై లో ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. జూలై 11న రఘురామ ఫిర్యాదు చేస్తే 12న ట్విటర్ వేదికగా సునీల్ స్పందించారు. సునీల్ స్పందించిన తీరు ఆల్ ఇండియా కాండక్ట్ రూల్స్ ను వ్యతిరేకించడమేనని తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రఘురామ కృష్ణ రాజు మరో ఫిర్యాదు కూడా చేశారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు అవేర్ నెస్ సదస్సుల పేరుతో కోటిన్నర రూపాయలు అవినీతి జరిగిందని కేసు పెట్టారు. ఈ కేసులను పరిగణలోకి తసుకున్న ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులోనూ వేకెన్సీ రిజర్వులో ఉన్నారు.
కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా...?
రఘురామ కృష్ణ రాజు పెట్టిన కేసులను ఎదుర్కొనేందుకు సునీల్ కుమార్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకపోయినా పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా ఉండి పలువురు తెలుగుదేశం పార్టీ వారిపై కేసలు నమోదు చేసి వేధించారనే కారణాలతో కూటమి ప్రభుత్వం సునీల్ ను పక్కన పెట్టింది. ఇటువంటి కేసులు సాధరణమైనవని, ప్రభుత్వానికి కోపం వచ్చినప్పుడు తాను మాత్రం చేయగలిగింది ఏముంటుందనే మాటలు సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది.
నా కమ్యునిటీ కోసం వెళ్లా..
శనివారం ఒంగోలులో మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాల ఉద్యోగుల సమస్యలు, ఎస్సీ వర్గీకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సమావేశానికి హాజరై కమ్యూనిటీ అభివృద్ధికి అడుగులు వేయాల్సిన పరిస్థితులను వివరించారు. సమాజంలో వెనుకబడిన వారుగా ఉండటానికి వీలు లేదని, మంచి జ్ఞానం సంపాదిస్తే అన్నింటినీ అధిగమించ వచ్చునని పేర్కొన్నారు. కమ్యూనిటీ అభివృద్ధికి చదువు గొప్ప పరిష్కారమన్నారు. సమావేశం ఎస్సీ వర్గీకరణ విషయంలో చేసిన తీర్మానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని, అటువంటి సమావేశానికి సునీల్ కుమార్ వెళ్లారని ఒక దినపత్రికలో వచ్చిన వార్తను ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధి ప్రస్తావించగా ఆయన స్పందించారు. నా కమ్యునిటీ వారు సమావేశం పెట్టుకున్నారు. వారు పిలిచారని వెళ్లాను. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా తీర్మానాలు చేసుకున్నారా? లేదా? అనేది నాకు అనవసరం. కమ్యూనిటీ బాగు పడేందుకు ఎలా వ్యవహరించాలో వారికి చెప్పాను. అది నా బాధ్యత అని చెప్పారు.