
అమరావతి ఊహాచిత్రం
రాజధాని అమరావతి బిల్లు ఎందుకు వెనక్కివచ్చిందీ?
ఎక్కడ లోపం జరిగింది? అనుభవజ్ఞులు ఉండి కూడా ముసాయిదాను ఎందుకు సరిగా తయారు చేయలేదు?
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటించే వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందీ? ఎంతో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి, పరిపాలనానుభవం ఉన్న అధికారులు ఉండి కూడా బిల్లు ముసాయిదా పంపడంలో తప్పు ఎందుకు జరిగిందీ? అనే దానిపై రాష్ట్రంలో చర్చ సాగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖను కేంద్రానికి పంపాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే...
2014 నుంచి ఏపీ రాజధానిగా ‘అమరావతి’ని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ముసాయిదా బిల్లును, ఇతర సిఫార్సులను కేంద్రం వెనక్కు పంపింది. 2014 నుంచి అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2024ను పరిగణనలోకి తీసుకుంటే నిధులు ఖర్చు చేసిన విషయంపై న్యాయ పరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉందని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో సహేతుకమైన సూచనలతో మరోసారి నోటిఫికేషన్‌తో రావాలని కేంద్రం ఏపీ పంపిన నోటిఫికేషన్‌ను వెనక్కు పంపిందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాజధానిపై కేంద్రం సందేహాలెన్నో...
రాజధాని బిల్లుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ‘అమరావతి’కి చట్టబద్దత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సులు పంపింది.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే ‘అమరావతి’ని రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రాన్ని కోరింది. ‘పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణకు ‘హైదరాబాద్’ రాజధానిగా ఉంది కదా? ఇటువంటి సమయంలో అప్పటి నుంచి ఎలా నోటిఫై చేస్తారని బాబు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించినట్లు సమాచారం.
‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2014’లో ఈ అంశాన్ని పొందుపరిచిన విషయాన్ని కేంద్రం గుర్తు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పినట్లుగా సమాచారం. 2024 నుంచి రాజధానిగా ‘అమరావతి’కి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, దీనిపై కూడా కేంద్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాగా, విభజన చట్టంలోని సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందు పరిచింది. ఇందులోని సబ్ సెక్షన్ 2లో.. ‘విభజన తర్వాత పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి ‘కొత్త రాజధాని’ ఏర్పాటవుతుంది’ అని తెలిపింది. దీంతో పాటు ఏపీ కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహకారం కూడా ఉంటుందని సబ్ సెక్షన్ 3లో కేంద్రం పేర్కొంది.
ఈ సందర్భంగా న్యాయ, చట్టపరమైన చిక్కులను అధిగవిుంచే సూచనలతో రావాలని నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు పంపినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్5(2)లో ‘అమరావతి’ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేర్చాలన్న సవరణకు కేంద్రం ఆమోదిస్తుందని ప్రభుత్వం భావించింది. కేంద్రం ఆమోదించి, వెంటనే ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాకు చెప్పారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడం, న్యాయ పరమైన చిక్కులు లేకుండా సజావుగా ఉంటే బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పుడేం జరుగుతుందీ?
అమరావతిని 2024 జూన్ 2 నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర హోం శాఖ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోం శాఖకు తాజాగా లేఖ పంపారు.
2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని కోరారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి తెలిపారు. దీని ఆధారంగా కేంద్ర హోం శాఖ కేబినెట్ నోట్ తయారుచేసి, మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. క్యాబినెట్ ఆమోదించకుండా ఈ చట్టసవరణ బిల్లు పార్లమెంటు ముందుకు వెళ్లదు. ఇదంతా జరగడానికి ఇంకా కనీసం ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉంది.
ఎవరూ అడ్డుకోలేరంటున్న పెమ్మసాని...
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా గుర్తిస్తూ విభజన చట్ట సవరణ బిల్లును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పరోక్షంగా ఆయన జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేసినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నా ఇప్పటికైతే ఆగిందనేది వాస్తవం.
అమరావతికి రాజధాని హోదా 2014 నుంచి ఇవ్వాలా? 2024 నుంచి ఇవ్వాలా? అన్న సాంకేతిక అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం స్పష్టత కోరింది. ఈసారి కాకపోయినా వచ్చే సమావేశాల్లోనయినా పార్లమెంటులో పెట్టిస్తామని మంత్రి పెమ్మసాని చెబుతున్నా పెట్టుబడిదారులు విశ్వసిస్తారా? కేంద్రం ఇందుకు సుముఖంగా ఉందా లేదా అనేది మున్ముందు తేలదు.
Next Story

