నన్ను ఏమన్నా చేస్తారేమో అదనపు భద్రత కల్పించండి- వైఎస్ షర్మిల
వైఎస్సార్ ఆస్తుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతున్న తరుణంలో అదనపు భద్రత కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వైఎస్సార్ ఆస్తుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతున్న తరుణంలో అదనపు భద్రత కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆస్తుల వ్యవహారం నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పుందన్న సంకేతాల్ని ఇచ్చారు షర్మిల. ‘వై’ క్యాటగిరీ భద్రత కల్పించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.
"మా అన్న జగన్‌తో ఆస్తుల పంపకాల వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఏవైపు నుంచి ఏమి ముప్పుందో అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో అదనపు భద్రత కల్పించండి" అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆమెకు 2+2 భద్రత ఉంది. ఇద్దరు గన్ మెన్లు సెక్యూరిటీగా ఉంటున్నారు. ఈ భద్రత చాలదని ఆమె అభిప్రాయపడ్డారు. 4+4 సెక్యూరిటీతో పాటు వై-క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.
జగన్ సీఎం అయిన మొదట్లో అంటే 2019లో ఆమెకు 4+4 భద్రత ఉండేది. తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటించిన తరువాత ఆ భద్రతను 2+2కి కుదించారు. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో ఇటీవల చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. లేఖల యుద్ధం నడుస్తోంది. పరస్పరం లేఖలు సంధించుకుంటున్నారు. జగన్ కి మద్దతుగా రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి నిలువగా షర్మిల పక్కన ఆమె తల్లి విజయమ్మ నిలిచారు. షర్మిల, విజయమ్మ కూడా వైసీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులకు లేఖలు రాశారు. పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందిగా కోరారు. దీంతో కొందరు వైసీపీ ఈ ఇద్దరిపై తీవ్ర ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేశారు. పేర్ని నానీ లాంటి నేతలు కొందరు షర్మిల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో భద్రత పెంచాలని ఆమె కోరారు. నలుగురు గన్‌మెన్ల భద్రతతో పాటు పది మంది సిబ్బందితో ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని షర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బెయిల్ రద్దవుతుందని అప్పుడు తెలియదా అన్నా?
‘2019లో నాకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ మీద సంతకం చేశారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దవుతుందని? 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కు చెందిన సరస్వతి షేర్లను రూ.42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు? ఇది యధాతథస్థితిని ఉల్లంఘించినట్లు కాదా? అప్పుడు తెలియదా బెయిల్ రద్దవుతుందని?’ అని వైఎస్ షర్మిల జగన్ ను నిలదీశారు. ‘2021లో జగన్, భారతీరెడ్డి తమ షేర్లపై సంతకం చేసి విజయమ్మకు ఫోలియో నంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. అలా ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దవుతుందని. షేర్ల ట్రాన్స్‌ఫర్‌కు బెయిల్ రద్దుకు సంబంధం లేదని మీకు తెలుసు కాబట్టే అప్పుడు అవన్నీ చేశారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారని అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని షర్మిల పేర్కొన్నారు. ఈడీ ఎటాచ్ చేసింది షేర్లను కాదని, రూ. 32 కోట్ల విలువ చేసే కంపెనీ స్థిరాస్తిని మాత్రమేనని స్పష్టం చేశారు. ‘షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు కానీ, అభ్యంతరాలు కానీ లేవు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసినప్పటికీ వాటి షేర్ల ట్రేడింగ్, బదిలీలను మాత్రం ఆపలేదు. 2016లో ఈడీ భూములను ఎటాచ్ చేసినందు వల్ల షేర్లు బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదం’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
Next Story