అభ్యర్థుల మార్పుతో వైసిపిలో భగ్గమన్న అసంతృప్తి

వైఎస్సార్‌సీపీపై ఉన్న వ్యతిరేకత అభ్యర్థుల మార్పులు, చేర్పులతో పోతుందా?


అభ్యర్థుల మార్పుతో వైసిపిలో భగ్గమన్న అసంతృప్తి
x
YSRCP FLAG

రాష్ట్రంలో అధికార వైఎస్‌ఆర్‌సీపీకి ఉన్న వ్యతిరేకతను అభ్యర్థుల మార్పుతో సానుకూలంగా మార్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కసరత్తే చేపట్టారు. ఇప్పటికే రెండు జాబితాల్లో కలిపి 35 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను మార్చారు. మూడో జాబితా ఈనెల 7లేదా 9 తేదీల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా సుమారు 60మంది అభ్యర్థులను మార్చే దిశగా జగన్‌ చేస్తున్న ప్రయోగం ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో ఎన్నికలే తేల్చాలి. పేరుకు మాత్రమే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అంటున్నా వీరే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారు.

మారిన అభ్యర్థులు వీరే...
అనంతపురం ఎంపీ స్థానానికి మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ స్థానానికి జోలదరాశి శాంత, అరకు ఎంపీ (ఎస్టీ) స్థానానికి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, అభ్యర్థులుగా ఉంటారు.
రాజాం తాలె రమేష్, అనకాపల్లి మలసాల భరత్‌కుమార్, పాయకరావుపేట (ఎస్సీ) కంభాల జోగులు, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, పి గన్నవరం (ఎస్సీ) విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం వంగా గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రత్తిపాడు పరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్‌ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పోలవరం (ఎస్టీ) తెల్లం భాగ్యలక్ష్మి, కదిరి బిఎస్‌ మగ్బూల్‌ అహ్మద్, ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాచాని వెంకటేశ్, తిరుపతి భూమన అభినయ్‌రెడ్డి, గుంటూరు ఈస్ట్‌ షేక్‌ నూరి ఫాతిమా, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, పెనుకొండ కెవి ఉష శ్రీచరణ్, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, అరకు (ఎస్టీ) గొడ్డేటి మాధవి, పాడేరు (ఎస్టీ) మత్స్యరాస విశ్వేశ్వరరాజు, విజయవాడ సెంట్రల్‌ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఈస్ట్‌ షేక్‌ ఆసీఫ్‌లు ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారు. నేటి నుంచి వీరు ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల వేట చేపట్టాల్సి ఉంటుంది.
విజయవాడలో భారీ మార్పులు
విజయవాడ నగరంలోని రెండు నియోజకవర్గాలకు మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు వెస్ట్‌ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విషయం ఏమీ తేల్చలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కే అవకాశం లేదు. విజయవాడ వెస్ట్‌ నియోజకవర్గానికి ముస్లిమ్‌ను అభ్యర్తిగా ప్రకటించారు. షేక్‌ ఆసీఫ్‌ మొదటి నుంచీ పార్టీలో ఉన్నారు. డివిజన్‌ కార్పొరేటర్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. 2014లో టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు. అప్పట్లో జలీల్‌ ఖాన్‌కు వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇచ్చింది. జలీల్‌ఖాన్‌తో అనుకూలంగా ఉంటూ పలు కార్యక్రమాలు చేశారు. ఒకటి నుంచి 13 వరకు, 18,19,76,77,78 డివిజన్‌లు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈస్ట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న దేవినేని అవినాష్‌ను పెనమలూరు నియోజకవర్గానికి పంపించేందుకు నిర్ణయించారు. వంగవీటి రాధాను తిరిగి పార్టీలోకి తీసుకుని ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతున్నది.
రాజమండ్రి రూరల్‌కు మంత్రి చెల్లుబోయిన
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి తప్పించి రాజమండ్రి రూరల్‌కు మార్చారు. ఈ నియోకవర్గం కూడా బాగానే ఉంటుందని ఆయన అనచరులు అంటున్నారు. ఎందుకు ఇక్కడి నుంచి మార్చాల్సి వచ్చిందంటే పిల్లి సుభాష్‌చంద్రబోష్‌ తనకు కేటాయించాలని పట్టు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో సుభాష్‌ చంద్రబోస్‌ రామచంద్రాపురంలో వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో ఆయనకు కాకుండా 2019లో వేణుకు టిక్కెట్‌ ఇచ్చారు. ఇరువురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. తోట త్రిమూర్తులు వర్గంలో ఉన్న వేణు త్రిమూర్తులను పార్టీలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వేణుకు వ్యతిరేక వర్గంగా ఉన్న కుడిపూడి సూర్యనారాయణను సుభాష్‌చంద్రబోస్‌ వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యారు.
పాయకరావుపేటకు జోగులు
విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కంభాల జోగులును ఈస్ట్‌గోదావరి జిల్లా పాయకరావుపేట అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ఎంపిక చేసింది. కంభాల జోగులు రెండు సార్లు రాజాం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం పాయకరావుపేట కొత్త నియోజకవర్గం ఇక్కడి నాయకులను సమన్వయం చేసుకుని ఎలా ముందుకు వెళతారో వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ ఇన్‌చార్జ్‌గా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పనిచేస్తున్నారు. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే కంభాల జోగులు తీవ్రస్థాయిలో ఆమెను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
పి గన్నవరం నియోజకవర్గం నుంచి విప్పర్తి వేణుగోపాల్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన కొత్తగా అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యే చిట్టిబాబును అధిష్టానం పక్కనబెట్టింది.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉష శ్రీచరణ్‌ను పెనుగొండకు మార్చారు. కారణాలు ఏవైనా మాలగుండ్ల శంకరనారాయణ ఆశీస్సులు ఉంటే ఆమెకు గెలుపు అవకాశాలు ఉంటాయి. శంకరనారాయణను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఇప్పటి వరకు ఎంపీగా పనిచేస్తున్న తలారి రంగయ్యను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. కొత్త సీసాలో పాత రాసాలాగా అభ్యర్థుల మార్పులు, చేర్పులు ఇక్కడ జరిగాయని చెప్పొచ్చు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, మంత్రి సురేష్‌ను కొండపి నియోజవర్గానికి మార్చిన విషయం తెలిసిందే. కొత్తగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్‌ను అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈయన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి పూర్తిగా కొత్త. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన వ్యక్తి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఈయనకు సీటు దక్కిందని పలువురు చెబుతున్నారు.
మధ్యాహ్నం కండువా.. సాయంత్రం టిక్కెట్‌
బళ్లారికి చెందిన మాజీ మంత్రి బి శ్రీరాములు సోదరి జోలదరాశి శాంత మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమెకు సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాయంత్రానికి హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించారు. పార్టీలో చేరగానే టిక్కెట్‌ ఇచ్చారంటే ఆమె పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులు జనానికి తెలియాల్సిన అవసరం లేదు. పార్టీ అధ్యక్షుడైన జగన్‌కు తెలిస్తే చాలు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పక్కన పడేశారు. ఆయన సేవలను పార్టీ వినియోగించుకునే అవకాశం కూడా లేదని సమాచారం.
Next Story