ఈ సభలైనా ఉద్యమాలకు ఊపిరిపోస్తాయా?
x

ఈ సభలైనా ఉద్యమాలకు ఊపిరిపోస్తాయా?

తిరుపతిలో మూడురోజులు జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు ప్రారంభం కానున్నాయి. భవిష్యత్ కార్యాచరణ, నాయకత్వ మార్పు ఇందులో ప్రధానాంశాలు.


తిరుపతిలో అఖిల భారత యువజన సమాఖ్య (All India Youth Federation AIYF ) మూడు రోజుల జాతీయ 17వ మహాసభలు గురువారం సాయంత్రం ప్రారంభం కానున్నాయి. జాతీయ సమైక్యత, యువతకు ఉపాధి అనే అంశాల ప్రధాన అజెండాగా ప్రతినిధుల మహాసభలో చర్చలు జరగనున్నాయి. ఈ మహాసభలో నాయకత్వ మార్పు కూడా ఉంటుంది. దీనికోసం సీపీఐ (CPI ) అగ్రనేతల సారధ్యంలోని త్రిసభ్య కమిటీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పదవులకు యువ నేతలను ఎంపిక చేయనున్నారనేది ఏఐవైఎఫ్ నేతల నుంచి తెలిసిన సమాచారం.

దేశంలోని రాజకీయ పరిస్థితులు సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో యువజన సంఘంలో రిక్రూట్ మెంట్ తగ్గడం, నామమాత్ర పోరాటాలతో ఎలా సమాధానం చెబుతారనేది ఓ ప్రశ్న. గతంలో వామపక్ష యువజనోద్యమాలకు ఏఐవైఎఫ్ నేతల్లో శారదమిత్ర, సికే. చంద్రప్పన్, సురవరం సుధాకరరెడ్డి, అమరేంద్ర నారాయణ సింగ్ నారాయణ్, రామకృష్ణారెడ్డి, రాజాజీ మాథ్యూ థామస్, డి. రాజా, జావేద్ అలీఖాన్ వంటి వారు సారధ్యంలో ఉద్యమాలు ఎగసిపడ్డాయి. వారందరూ మచ్చుకు కొందరే. ఆ నాటి ప్రాభవానికి తిరుపతి మహాసభలు మళ్లీ ఊపిరిపోస్తాయా?
ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు గురువారం సాయంత్రం ప్రదర్శన, బహిరంగసభతో ప్రారంభం అవుతాయి. 16వ తేదీ నుంచి రెండు రోజుల తుడా కార్యాలయం సమీపంలో కచ్చపి ఆడిటోరియంలో ప్రతినిధుల మహాసభలు జరుగుతాయి. భవిష్యత్తు కార్యాచరణ, తీర్మానాలు, నూతన నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. 27 రాష్ట్రాల నుంచి 680 మంది ప్రతినిధులు మహాసభల్లో యువత సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
తిరుపతిలో ప్రథమం
రాష్ట్రంలో మొదటిసారి తిరుపతిలో జరుగుతున్న ఈ మహాసభల్లో గురువారం సాయంత్రం శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ (SV Arts Collage ) నుంచి Tirupati TUDA మైదానం వరకు నిర్వహించ తలపెట్టిన ప్రదర్శనకు భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మహాసభల ఆహ్వాన సంఘం ప్రతినిధి జీ. ఈశ్వరయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ప్రదర్శన అనేది యువతకు ప్రేరణ కలిగిస్తుంది. సంఘం ఆశయాలు చెప్పడానికి ఓ సాధనం" కూడా అని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర వ్యాఖ్యానించారు. ప్రదర్శనకు అనుమతి నిరాకరించడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.
నాయకత్వం మార్పు.. పోటీ..
పార్టీ, ప్రజాసంఘాల మహాసభల్లో నాయకత్వ మార్పు సహజంగా ఉంటుంది. జాతీయ స్థాయి సంఘాల వ్యవహారంలో మాత్రం ప్రత్యేకత ఆసక్తి ఉంటుంది. వామపక్ష పార్టీలు, సంఘాల మహాసభల్లో ఇదే కీలకం. తిరుపతిలో జరిగే అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ మహాసభల్లో భవిష్యత్తు కార్యాచరణతో పాటు నాయకత్వం మార్పు కూడా ప్రధానంగా మారింది.
ప్రస్తుతం ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా పంజాబ్ నుంచి సుఖ్జిందర్ మహేసరి, ప్రధాన కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన ఆ తిరుమలై రామన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మహాసభల్లో నాయకత్వం మార్పులో భాగంగా అధ్యక్షుడిని మరో టర్మ్ కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధుల ద్వారా తెలిసింది. ప్రధానకార్యదర్శి రామన్ వైదొలగనున్నారని తెలుస్తోంది.
ప్రధాన కార్యదర్శి పదవికి త్రిముఖ పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి డాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి (ఈయన గతంలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయనతో పాటు పాండిచేరికి చెందిన కర్ణాటక యువజన విభాగం నుంచి నాయకత్వం వహిస్తున్న హరీష్ బాల, బీహార్ నుంచి రోషన్ సేన్ పోటీలో ఉన్నట్లు సమాచారం.
త్రిసభ్య కమిటి?
వామపక్ష, యువజన సంఘాలు స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయనేది ఆయా సంఘాల ప్రతినిధులు చెప్పా మాట.
"మా సంఘం కార్యక్రమాలు, నాయకత్వ ఎంపిక ఆ కోవలోనే ఉంటుంది" అని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుగ్జీందర్ మహేశ్వరి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. కానీ, సీపీఐకి అనుబంధంగా పనిచేసే ప్రజా సంఘాల్లో ఆ పార్టీ కీలక నేతల నిర్ణయాలపైనే ఎంపిక ఆధారపడి ఉంటుందనే విషయం ఆ సంఘాల్లో పనిచేసే వారికే కాదు. వామపక్ష పార్టీలు, సంఘాలను దగ్గరి నుంచి గమనించే వారికి అవన్నీ సుపరిచితమే. ఆ కోవలోనే..
తిరుపతిలో ప్రారంభమయ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు ముందు సూత్రప్రాయంగా చర్చించనున్నారు. ప్రతినిధుల ముగింపు రోజు అంటే ఈ నెల 17వ తేదీ నూతన నాయకత్వాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. దీనికోసం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ, ఏఐవైఎఫ్ ఇన్జార్జి, ఎంపీ పీ. సంతోష్ కుమార్ సారధ్యంలోని కమిటీ తిరుపతి సీపీఐ కార్యాలయంలో భేటీ కావడం ద్వారా చర్చించినట్లు యువజన నేతల ద్వారా తెలిసింది. వారి నిర్ణయం ఎవరికి పదవి దక్కుతుందనేది నిర్ణయించే అవకాశం ఉంటుంది.
జాతీయ స్థాయి ఎంపిక చేసే నాయకత్వానికి ప్రధాన అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. అందులో యువతను ప్రేరేపించే ఉపన్యాసాలు ఇవ్వడం, సమస్యలపై పోరాటాలతో పాటు భాషా ప్రావీణ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అ అంశాల్లో తెలంగాణ నుంచి ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నడాక్టర్ సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉంది. కర్ణాటక నుంచి పోటీలో ఉన్న హరీష్ బాలాకు తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాటకారితనం, పట్టు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత జాతీయ బీహార్ నుంచి రేసులో ఉన్న రోషన్ సేన్ కు కూడా మూడు భాషలు మాట్లాడతారని చెబుతున్నారు. అయితే త్రిసభ్య కమిటీ ఎవరిని ఎంపిక చేస్తుందనేది రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
అజెండా ఇదే...
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ మహాసభల్లో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. యువత కోసం, దేశానికి ఉజ్వల భవిష్యత్ కోసం 66 ఏళ్లుగా పోరాటం చేస్తోందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు సుఖ్జిందర్ మహేసరి చెప్పారు.

"యువతకు విద్య, ఉపాధి, వైద్యం, ఎన్నికల సంస్కరణలు, దేశంలో మతసామరస్యం కాపాడడం" వంటి అంశాలపై కార్యాచరణ సిద్ధం చేస్తాం అని సుఖీందర్ చెప్పారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం యువత కోసం భగత్ సింగ్ పేరిట అమలు చేస్తున్న పథకం విస్తృతం చేయాలనే అశంతో పాటు అందులో పనిచేస్తున్న సిబ్బంది వేత రూ. 30 వేలకు పెంచాలనే డిమాండ్ పై దేశవ్యాపిత కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.
"18 ఏళ్లకే ఓటు హక్కు కావాలని డిమాండ్ చేయడమే కాదు. 1974లోనే సీపీఐ ఎంపీ, సీకే. చంద్రప్పన్ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు" అని సుఖీందర్ గుర్తు చేశారు. ఈ మహాసభల్లో ఎన్నికల్లో సంస్కరణలపై చర్చించి, కార్యాచరణ సిద్ధం చేస్తామ సుఖీందర్ చెప్పారు.
ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు కొలువులు ఇచ్చి, అదానీకి కంపెనీలకు మాత్రం 14 ఏళ్లు కాలపరిమితి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ 12 ఏళ్లలో నిరుద్యోగం ఎక్కువైందని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క రైల్వేల్లోనే 4 లక్షల ఉద్యోగాలు పైగా ఖాళీలు ఉన్నాయి. అని సుఖీందర్ గుర్తు చేశారు.
ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల్లో నిరుద్యోగం, అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా, ప్రజలకు మెరుగైన జీవనం, మతోన్మాదుల నుంచి కాపాడడం లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేస్తామని ఆయన చెబుతున్నారు.
Read More
Next Story