విజయవాడ పార్లమెంట్ అన్నదమ్ములకు సవాల్‌గా మారింది. ప్రత్యర్థులుగా మారి బరిలో ఉన్న కేశినేని బ్రదర్స్.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ప్లామెంట్ నియోజక వర్గం మరో సారి హాట్ టాపిక్‌గా మారింది. సొంత అన్నదమ్ములు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై మరొకరు పోటీలో నిలవడంతో రాజకీయం ఆసక్తిగా మారింది. అన్న గెలుస్తాడా లేదా తమ్ముడు నెగ్గుతాడా అనేది అటు రాజకీయ వర్గాల్లోను, ఇటు ఎన్టీఆర్ జిల్లా వాసుల్లోను చర్చ నీయాంశంగా మారింది.
విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానీ, టీడీపీ నుంచి బరిలో ఉన్న కేశినేని చిన్నీ సొంత అన్నదమ్ములు. అన్న నానీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాల్లో ఆ పార్టీని వీడి సీఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో అదే పార్టీ నుంచి బరిలో ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో అన్న గెలుపు కోసం తెరవెనుక చక్రం తిప్ని తమ్ముడు కేశినేని చిన్నీ అన్నను విభేదించి అన్నపైన తిరుగుబాటు ప్రకటించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
గత ఎన్నికల వరకు కలిసి మెలిసి ఉన్న కేశినేని బ్రదర్స్ తర్వాత చోటు చేసుకున్న ఆస్తి, కుటుంబ తగాదాల నేపథ్యంలో విడిపోయారు. పోలీసు స్టేషన్‌ల వరకు వీరి పంచాయతీ వెళ్లింది. దీంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగింది. బేదాభిప్రాయాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో విడిపోయారు. ఈ లోగా ఎన్నికలు వచ్చాయి. దీంతో ప్రత్యర్థులుగా మారారు. ఇలా ప్రత్యర్థులుగా మారిన అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారనేది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ పరిధిలో జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోగా, విజయవాడ పార్లమెంట్‌తో పాటు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గాలను టీడీపీ సొంతం చేసుకుంది. ఈ సారి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారింది. 2024 ఎన్నికల్లో 79.36 శాతం ఎన్నికల పోలింగ్ నమోదైంది.
గత రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానీ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకున్నా ఆయన పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల్లో మింగుడుపడని అంశంగా మారింది. ఆయనకు దగ్గరగా ఉంటూ వచ్చిన కొంత మంది నేతల్లో కూడా ఇదే ఫీలింగ్ ఉంది. దీనికి తోడు అప్పటి వరకు తెరవెనుక ఉంటూ వచ్చిన కేశినేని చిన్నీకి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఆదరణ లభించింది. కేశినేని చిన్నీకి చంద్రబాబు నాయుడు, లోకేష్ నుంచి కూడా సపోర్టు ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు మరింత చేరువయ్యారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లోని టీడీపీ శ్రేణులతో ఆయన మమేకం అవుతూ, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. అప్పటి వరకు కేశినేని నానీ వెంట ఉన్న టీడీపీ శ్రేణులు దూరం కావడం, అప్పటి వరకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు నానీకి దగ్గరకావడంలో నెలకొన్న విభేదాలు వంటి కారణాలతో కేశినేని నాని అనుకున్న మేరకు ఎన్టీఆర్ జిల్లా ఓటర్లకు చేరువ కాలేక పోయారనే టాక్ ఆ పార్టీ నేతల్లో ఉంది. మరో వైపు ఎన్టీఆర్ టీడీపీ నేతలు, కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకొని రావడం, గ్రూపులు, వర్గాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అప్పటి వరకు మనస్పర్థలతో దూరంగా ఉంటున్న టీడీపీ నేతల మధ్య సామరస్య వాతావరణాన్ని తీసుకొని రావడం, కూటమి భాగస్వాములైన బీజేపీ, జనసేన పార్టీల శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందు వెళ్లడంలో కేశినేని చిన్నీ సక్సెస్ అయ్యారనే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. దీనికి తోడు కేశినేని కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది చిన్నీకి సపోర్టివ్‌గా నిలబడటం, నానీ టీడీపీలోకి వెళ్లడంపై వ్యతిరేకత నెలకొనడంతో కుటుంబ సభ్యుల మద్ధతు కూడా చిన్నీకి లభించినటై్టందనే టాక్ కూడా ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది.
వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు, నేతల్లో అంతర్గత ఆదిపత్యం పోరు కూడా కేశినేని నానీకి ఒక మైనస్‌గా మారిందని చర్చించుకుంటున్నారు. ఎవరికి వారే నేతలుగా ఉండాలనుకోవడం, అభ్యర్థులందరూ సీనియర్ నాయకులు కావడం, ఏ ఒక్కరి మధ్య సఖ్యత లేక పోవడం, ఏక తాటిపైకి వచ్చి ఎంపీ గెలుపు కోసం పని చేయలేక పోవడం, నగదు పంపిణీ, వంటి కారణాలు ఎంపీ నానీకి మైస్ అంశాలుగా చర్చ సాగుతోంది.
విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి రంగంలోకి రావడంతో ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ స్వరూపం మారిపోయిందని, ఈ జిల్లాలో రాజకీయంగా ప్రభావం చూపే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మద్దతును కూడగట్టుకోవడంలోను, టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరినీ ఒక తాటిపైకి తేవడంలోను, నగదు పంపిణీలోను, ఎలాగైనా ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీని గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో పని చేయడంలోను సక్సెస్ అయ్యారనే చర్చ కూడా జిల్లా వ్యాప్తంగా ఉంది. అంతేకాకుండా సీఎం జగన్ మోహన్‌రెడ్డి కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఎన్టీఆర్ జిల్లాలోని కమ్మ సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపాయి. దీనికి తోడు రాజధాని అమరావతిని నామ రూపాల్లేకుండా చేయడం, విజయవాడ నగర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని, దీంతో వైఎస్‌ఆర్‌సీపీకి ఈ అంశాలన్నీ ప్రతికూలంగా మారాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేప«థ్యంలో అన్న కేశినేని నానీ కంటే తమ్ముడు కేశినేని చిన్నీకే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే టాక్ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది.
Next Story