ఆంధ్రా మేధావులారా.. ఓట్ల కొనుగోలుపై ఉద్యమిస్తారా?
x
Source: Twitter

ఆంధ్రా మేధావులారా.. ఓట్ల కొనుగోలుపై ఉద్యమిస్తారా?

దేశంలో ఎన్నికల నాగారా మోగిన వేళ ఓటర్లకు అవగాహన కల్పించడానికి తమిళనాడులో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఇదే విధంగా ఆంధ్రలోని మేధావులు కూడా ఉద్యమిస్తారా..



ఎన్నికలు దగ్గర పడ్డాయంటే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి రాజకీయ పార్టీలు అనేక రకాలుగా ప్రయత్నిస్తాయి. వాటిలో ఓటర్లకు డబ్బులు పంచడం, ఖరీదైన బహుమతులు ఇవ్వడం వంటివి కూడా ఉంటాయి. అన్ని ఎన్నికల్లో ఇవి షరామామూలే. వాటిని అరికట్టడానికి ఎన్నికల సంఘం, ప్రభుత్వ యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటున్నా వాటి వల్ల ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో నియంత్రించడానికి ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రభుత్వ యంత్రాంగం కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంటుంది.
వాటిలో అవగాహన కార్యక్రమాలు కూడా భాగమే. డబ్బులు ఇవ్వకుండా పార్టీలను నియంత్రించడంతో పాటు ఓటును అమ్ముకోకుండా ప్రజలను కూడా చైతన్య పరచాలని అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటుంది యంత్రాంగం. ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా పాలకవర్గం సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది. ఎవరి ప్రేరణ, ప్రభావం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను ప్రభావితం చేయడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం.
ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో టీఎన్‌ఎస్‌టీసీ బస్సులపై ఓటును అమ్ముకోవద్దన్న స్టిక్కర్లను విరుదునగర్ జిల్లా పాలకవర్గం అంటించింది. ఈ పోస్టర్లు ఈ మేసేజ్‌ను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల చెంతకు చేరుస్తుందని జిల్లా కలెక్టర్ వీపీ జయశీలన్ తెలిపారు. ఈ క్యాంపెయిన్‌ను విస్తృతం చేయడం కోసమే తాము ‘మై ఓట్ ఫర్ నాట్ సేల్’ క్యాంపెయిన్ సెల్పీ పాయింట్‌లను కలెక్టరేట్ పరిసరాల్లో ప్రారంభించినట్లు వెల్లడించారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర ఫొటో దిగి దాన్ని షేర్ చేయడం ద్వారా ఓటును అమ్ముకోవద్దని, తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న మెసేజ్‌ను రాష్ట్రమంతటా విస్తరించొచ్చని ఆయన చెప్పారు.
‘‘ఓటర్లందరూ ఏప్రిల్ 19న పోలింగ్ బూత్‌లకు చేరుకోవాలి. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా చేయాలి. ఎవరూ తమ ఓటును అమ్ముకోవద్దు. ఓటును అమ్ముకోవడం అంటే మన ఐదేళ్ల జీవనాన్ని, ఐదేళ్ల పాటు మన హక్కులను అమ్ముకోవడమే’’అని ఓటర్లకు అవగాహన కల్పించారు. తమిళనాడులో చేస్తున్న ఈ క్యాంపెయిన్‌ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా హాట్‌టాపిక్‌గా మారింది.
ఓటును అమ్ముకోవద్దు
దేశమంతటా ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఏ ఓటరు కూడా తమ ఓటును అమ్ముకోవద్దని సుపరిపాలన వేదిక వ్యవస్థాపకుడు పద్మనాభ రెడ్డి ఇటీవల నిర్మించిన అవగాహన కార్యక్రమంలో తెలిపారు. ‘‘ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఓటరు తన ఓటు హక్కును మంచి నేతను ఎన్నుకోడానికి వినియోగించాలి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల డబ్బుతోనే చేస్తున్నారు తప్ప వారి సొంత డబ్బు కాదన్న అంశాన్ని ఓటర్లు గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలి. నోటుకు ఆశపడి వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకోవద్దు’’అని ఆయన సూచించారు.
ఆంధ్రాలో ఎందుకు చేయకూడదు!
పార్లమెంటు సహా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్రలో కూడా ఈ తరహా క్యాంపెయిన్ ఎందుకు చేయకూడదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఓటు అమ్ముకోవద్దని చెప్పే మేధావులు ఇటువంటి క్యాంపెయిన్‌ ప్రారంభించడానికి చొరవ ఎందుకు తీసుకోరు. ఇలాంటి క్యాంపెయిన్‌లను చేయకూడదా అంటే అలా ఏమీ లేదు. ఓటర్లకు అవగాహన కల్పించడానికి అధికారులు అనేక రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వాటిలో భాగంగానే ఇటువంటి క్యాంపెయిన్ కూడా చేయొచ్చు కదా అన్న ప్రశ్నలు ఆంధ్ర ఓటర్లలో తలెత్తుతున్నాయి.
విశ్లేషకులు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి క్యాంపెయిన్‌లను ఆంధ్రలో చేయకపోవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. తాయిలాలు అందుకుని ఇలాంటి క్యాంపెయిన్‌ల విషయంలో అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని మేధావులు ఓట్ల కొనుగోలుపై ఉద్యమిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు అధికారులే సమాధానం ఇవ్వాలి.


Read More
Next Story