ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేశాయి. టీడీపీకి 16 ఎంపీ స్థానాలు రాగా, బీజేపీకి 3, జనసేనకు 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున టీడీపీ పార్లమెంటరీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని, కోశాధికారిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని నియమించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ఎంపీలకే కీలక పాత్రని, అమరావతి, పోలవరంతో పాటు విభజన హామీలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించాలని దిశానిర్థేశం చేశారు. మొదటి పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడంతో టీడీపీ జాతీయ కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశం జరిగింది. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యారు. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి గురించి వారికి దిశా నిర్థేశం చేశారు.
ఎన్డీఏ భాగస్వాములైనందున కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేసే అవకాశం లేదు. అలా అని ప్రతి బిల్లును పూర్తి స్థాయిలో సమర్థించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ బిల్లు ప్రజా ప్రయోజనాలకు సానుకూలంగా ఉందా.. వ్యతిరేకంగా ఉందా.. అనే అంశాలను పరిగణలోకి తీసుకొని మాట్లాడవలసి ఉంటుందని ఎంపీలకు సూచించినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఏదో ఒక సందర్భంలో గుర్తు చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన సయమంలో ఇచ్చిన హామీలను అమలు చేయించుకునేందుకు ఇది మంచి అవకాశమని, ఆ దిశగా పార్లమెంట్‌లో వ్యవహార శైలి ఉండాలని దిశా నిర్థేశం చేశారు. ప్రతి అంశం కూడా డిమాండ్ చేస్తున్నట్లు కాకుండా సానుకూలంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చర్చించుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, తన వైపు నుంచి ఎలా చేయాలో అవన్నీ తాను ప్రధాని మోదీ, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలతో సందర్భం వచ్చినప్పుడుల్లా చర్చిస్తానని ఎంపీలతో అన్నట్లు సమాచారం. ప్రతి ఎంపీ కేంద్ర ప్రభుత్వంలోని ఒకటి, రెండు శాఖలపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రంలోను శాఖలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలోనే టాప్ పది యూనివర్శిటీలు, ఆసుపత్రులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొని రావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.
యువకుడు, విద్యావంతుడైన శ్రీకృష్ణ దేవరాయలను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికున్నందున అందరూ మాట్లాడుకొని ఒకే మాటపై పార్లమెంట్‌లో ఉండాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు, మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సూచించారు. కేంద్ర పథకాలను, నిధులను సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని దిశా నిర్థేశం చేశారు.
ఎంపీల్లో ఎక్కువ శాతం తొలి సారి ఎన్నికైన వారే కావడం విశేషం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, హిందూపురం ఎంపీ బీజే పార్థసారథి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి నేతలు ఇది వరకు ఎంపీలుగా ఉండగా, తక్కిన వారందరూ తొలి సారి ఎంపీలుగా నెగ్గారు. మూడో సారి ఎంపీగా నెగ్గిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, తొలి సారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి పదవులు దక్కడం విశేషం.
అయితే రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో ఎంత మేరకు చక్రం తిప్పుతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విభజన హామీలు నెరవేర్చుకోవడంలోను, ప్రత్యేక హోదాను సాధించడంలోను, పోలవం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి కీలక అంశాలను నెరవేర్చు కోవడంలో సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగితే తప్ప వచ్చేవి కాదని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. 2014లో నాడు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ఎన్నిక సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినా రాష్ట్రానికి పెద్దగా సహాయం అందింది లేదు. అయితే ఈ సారి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా మారడంతో ఈ సారైనా రాష్ట్రానికి మేలు జరుగుతుందేమో చూడాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు ఉన్నారు.