ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ (APCOS) ను ప్రభుత్వం ఉంచుతుందా? రద్దు చేస్తుందా? అనే చర్చ ఔట్ సోర్స్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.


ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైయున్న సంస్థ (ఆప్కాస్). ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఎంపికైన ఉద్యోగులను ఒక ప్రభుత్వ సంస్థ కిందకు తెచ్చి ఔట్ సోర్స్ ఏజెన్సీలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధానాన్ని నాటి ప్రభుత్వం రద్దు చేసింది. జీతాలు ఆయా సంస్థలు ఆప్కాస్ కు చెల్లిస్తే అక్కడి నుంచి ఉద్యోగుల అకౌంట్స్ కు నేరుగా చేరే అవకాశం ప్రస్తుతం ఉంది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం, రికార్డుల్లో రాసే మొత్తానికి జీతం ఇవ్వకుండా కోత విధించడం వంటివి చేస్తున్నారని భావించిన ప్రభుత్వం ఆ విధానానికి గతంలో స్వస్తి పలికి ఆప్కాస్ ను తీసుకొచ్చింది.

ఇప్పుడేం జరగబోతోంది..

జగన్ ప్రభుత్వం కంటే ముందు గతంలో మాధిరిగా ప్రైవేటు ఏజెన్సీల కు పగ్గాలు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో అనిచ్చితి, ఆందోళన నెలకొంది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇస్తూ ఔట్ సోర్శింగ్ ఉద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని బుదవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే విజయానంద్ ను ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు, ఏపీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సుమన్, అల్లం సురేశ్ బాబు లు కలిసి వినతిపత్రం అందించారు.

ప్రస్తుతం ఉన్న ఆప్కాస్ ను రద్దు చేయాల్సి వస్తే నూతన విధానంలో ఆంధ్రప్రధేశ్ లో పనిచేస్తున్న సుమారు రెండున్నర లక్షల మంది ఔట్ సోర్స్ ఉద్యోగులందరికి అప్కాస్ కంటే మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, గతంలో ఏజెన్సీ లు చేసిన అనేక తప్పులకు ఉద్యోగులు బలి అయ్యారని, ఆయా ఏజెన్సీ లపై ప్రభుత్వం అనేక కేసులు కూడా నమోదు చేసిందని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

ఉద్యోగులు కోరుకుంటున్నది ఏమిటి..

1. ఏజెన్సీ ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించ వద్దు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు, జీతాలు కాపాడాలి.

2. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కొనసాగించాలని, సంబంధిత డిపార్ట్ మెంట్స్ ద్వారా నేరుగా ఆయా శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు జీతాలు చెల్లించాలి.

3. ఆప్కాస్ రద్దు చేయాల్సి వస్తే, అంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మెప్మా, సెర్ప్ సొసైటీల లోని ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీనీ అన్ని ప్రభుత్వ శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తూ, ఉద్యోగ భద్రత, భరోసా కల్పించాలి.

4. కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన అనేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి.

5. కూటమి ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరిని ఆయా శాఖలకు అప్పచెప్పే విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాత విధానాన్ని (ప్రైవేటు ఏజెన్సీలు) ప్రోత్సహించకుండా చూడాలి.

Next Story