ఏజెన్సీలో ఏ పార్టీకి మెజారిటీ తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది? గత ఎన్నికల్లో అన్ని సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవడమే కాకుండా భారీ మెజారిటీ వచ్చింది?


ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచే సీట్లలో ఏజెన్సీ ఏరియా ఒకటి. ఏ పార్టీ గెలిచినా ఒకే వైపు మొగ్గు చూపుతారు వారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఏజెన్సీ పట్టం కట్టింది. ఈ సారి కూడా అలాగే ఉందా? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణి, ఎన్‌డిఏ కూటమి తరపున బిజెపి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ పడుతున్నారు. ఇండియా కూటమి నుంచి పి అప్పలనర్స సీపీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగారు. 2014లో కొత్తపల్లి గీత వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆమెకు అప్పుడు 91,398 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2019లో గొడ్డేటి మాధవిని వైఎస్సార్‌సీపీ పోటీకి దించింది. కిశోర్‌చంద్రదేవ్‌పై 2,24,089ఓట్ల మెజారిటీతో మాధవి గెలుపొందారు. భారీ మెజారిటీతో మాధవి గెలిచారు. 2024 ఎన్నికల్లో చెట్టి తనూజారాణిని వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించింది.

ఈ సారి ఈమె పరిస్థితి ఎలా ఉంటుందనేది పలువురిలో చర్చకు దారి తీసింది. అరకు అసెంబ్లీ నుంచి గతంలో గెలిచిన చెట్టి పల్గుణ రెండో కుమారుడు చెట్టి వినయ్‌ భార్య ఈమె. అభ్యర్థి మార్పు అనివార్యమనే పరిస్థితికి వైఎస్సార్‌సీపీ రావడం జరిగింది. ప్రతిసారీ అభ్యర్థిని మారుస్తూ వచ్చింది. కొత్తపల్లి గీత వైఎస్సార్‌సీపీలో గెలిచి ఆ తరువాత టీడీపీలో చేరి అనంతరం కొత్త పార్టీ పెట్టి, ఆ పార్టీని బిజెపిలో విలీనం చేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా అరకు నుంచి రంగంలోకి దిగింది. గిరిజనుల్లో ఈమెపై సదాభిప్రాయం లేకుండా పోయిందని చెప్పొచ్చు. మచిలీపట్నం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన గీత సోదిలోనే లేకుండా పోయింది. పలు ఆర్థిక నేరాల కేసుల్లో నిందితురాలు కూడా.
అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ పడుతున్న తనూజారాణి, అప్పలనర్సకు మధ్యనే పోటీ ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనూజారాణి మొదటి స్థానంలోనూ, రెండో స్థానంలో అప్పలనర్సకు ఓట్లు ఎక్కువ పోలైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థి కె గీత రెండో స్థానంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తపల్లి గీతపై గిరిజనులకు మంచి అభిప్రాయం లేనందున ఆమెను పరిగణలోకి తీసుకోవడం లేదనే పలువురు చెబుతున్నారు. గతంలో గెలిచిన గీత గిరిజనులకు చేసిందేమీ లేదనే వాదన కూడా ఉంది. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఏజెన్సీలోనే ఉన్నందున అక్కడి గిరిజనులు కూడా మొదటి స్థానంలో వైఎస్సార్‌సీపీ, రెండో స్థానంలో అప్పల నర్సను చూస్తున్నారని అంటున్నారు.
అరకు పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీకి గతంలో వచ్చిన మెజారిటీ సగానికి పైగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా ఎక్కువ ఓట్లు చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, సీపీఎం అంటే అరకు ప్రాంతంలో ఎంతో మంది గిరిజనులు అభిమానంతో ఉన్నారని పలువురు చెబుతున్నారు. సాలూరు నుంచి గత ఎన్నికల్లో గెలిచిన పీడిక రాజన్నదొర 20,029 మెజారిటీ సాధించారు. ఈసారి ఈ పరిస్థితి ఉండే అవకాశం లేదంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అయినా మెజారిటీ బాగా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నాలుగోసారి ఇక్కడి నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఐదోసారి విజయం సాధిస్తారు. ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థి ఎవరనేది చూసే పరిస్థితుల్లో గిరిజనులు లేరు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌ అంటే రాజశేఖర్‌రెడ్డి మాకు ఎంతో మేలు చేశారనేది వారి బావన. ప్రధానంగా వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో వారి మనసులను హత్తుకుంది.
గిరిజన నాయకుల్లో పెరిగిన అసంతృప్తి
గిరిజన ఏరియాల్లో అభ్యర్థులను వైఎస్సార్‌సీపీ ఇష్టానుసారం మార్చేసింది. ఎవరో ఒకరు చెప్పిన మాటలు విని ఇష్టానుసారం అభ్యర్థుల మార్పులు చేసిందని, ఇది మాకు నచ్చలేదని పలువురు చెబుతున్నారు. బయటకు చెప్పేందుకు సుముఖంగా లేకపోయినా చెట్టి పల్గుణ లాంటి వారిలోనూ ఎంతో బాధ ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ పల్గుణ చెడ్డవాడైతే ఆయన కోడలు మంచి వారు ఎలా అవుతారనే ప్రశ్న కూడా గిరిజనుల్లో ఉంది. పల్గుణ కుటుంబం మంచి కుటుంబమని తాము భావిస్తున్నామంటున్నారు. గిరిజన రిజర్వుడు నియోజకవర్గాలపై ప్రతి పార్టీకి చిన్నచూపు ఉందని, అధికార పార్టీపై మాకు ఉన్న నమ్మకాన్ని వారే తగ్గించుకున్నారని గిరిజన నాయకులు చెబుతున్నారు.
Next Story