పొత్తు ఓకే... ఓట్లు బదిలీ జరిగేనా...?
x
Source: Twitter

పొత్తు ఓకే... ఓట్లు బదిలీ జరిగేనా...?

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటయ్యాయి... నేతలు కలిశారు. మరి కార్యకర్తలు కలుస్తారా... ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుంది...?


(తంగేటి నానాజీ )



విశాఖపట్నం: వైరి పార్టీలు ఒకటయ్యాయి. చిరకాల ప్రత్యర్థులు చేతులు కలిపారు. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పొత్తు కారణంగా నేతలు కలుస్తున్నారు సరే... పార్టీపై కరుడు కట్టిన అభిమానం పెంచుకున్న కార్యకర్తలు కలుస్తారా...? పార్టీ నుంచి పార్టీకి ఓటు బదిలీ అవుతుందా...? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కార్యకర్తల్లో అయోమయం....

ఏ పార్టీకైనా లీడర్ కంటే క్యాడరే ఇంపార్టెంట్... తమ అభిమాన నేత అయినా... అభిమాన పార్టీ అయినా... ఒక్కసారి అభిమానం పెంచుకుంటే నాటినుండి వెన్నంటే నడుస్తారు. తమ వీధుల్లో, గ్రామాల్లో వైరి పార్టీలు.. వైరి వర్గాలు... వారి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. నేతలు చేతులు కలిపినంత ఈజీగా కార్యకర్తలు చేతులు కలపలేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వారి విశ్లేషణకు తగ్గట్టుగానే నియోజకవర్గాల్లో సీను కనిపిస్తుంది. టీడీపీ, జనసేన, బీజెపీలు జట్టు కట్టి నేతలను ఒక్కటి చేసినప్పటికీ కార్యకర్తల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో నేతల మధ్య సయోధ్య కుదిర్చినంత ఈజీగా కార్యకర్తల మధ్య సయోధ్య కుదర్చలేకపోతున్నారు. అందుకే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి కలిసిన నేతలు... కార్యకర్తలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ పొత్తు అధికార పక్షానికి లాభమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఓటు బదిలీ జరిగేనా....

'టీడీపీ, జనసేన పొత్తు నాయకులు, కార్యకర్తలు కోరుకున్నదే. ఇక్కడి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. పార్టీ నుంచి పార్టీకి ఓటు బదిలీ కూడా 90 శాతం జరుగుతుంది. బీజేపీ, టీడీపీ మధ్య ఓటు బదిలీ అంతగా జరగకపోవచ్చు. బీజేపీతో పొత్తు తమకు నష్టమని ఆది నుంచి కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు.' అంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఎస్ఎస్ శివశంకర్. పార్టీల మధ్య పొత్తు, నాయకుల మధ్య సయోధ్య బాగానే కుదిరిపోయింది. కార్యకర్తలను ఎలాగోలా దారికి తెచ్చుకుంటున్నారు.
అయితే పార్టీ నుంచి పార్టీకి ఓటు బదిలీ ఎంతవరకు జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పూర్తిస్థాయిలో ఓటు బదిలీ చేసుకోగలిగితేనే పొత్తు ప్రభావం అధికారపక్షంపై పడుతుంది. లేకుంటే కూటమికి అది నష్టం చేకూరుస్తుంది. పొత్తు కారణంగా ఓట్లు చీల్తే అది అధికార పక్షానికి కలసి వస్తోంది. పొత్తులు కుదిరాయి, అభ్యర్థుల ఖరారు తర్వాత మూడు పార్టీల అధిష్టానాలు ఈ అంశంపై దృష్టి సారించబోతుందని సమాచారం. ఏది ఏమైనా పొత్తు ఫలిస్తుందా... అధికార పార్టీ ఎత్తు ఫలిస్తుందా... అన్నది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
Read More
Next Story