అదనపు నిధులు తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అవుతారా?
x

అదనపు నిధులు తీసుకురావడంలో చంద్రబాబు సక్సెస్ అవుతారా?

పదేపదే ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు. అదనపు నిధుల కోసం కేంద్రంతో చర్చలు. మరి ఇంత శ్రమిస్తున్న చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌కు అదనపు నిధులు తెస్తారా? కేంద్రం ఇస్తుందా?


ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి పార్టీలు తమ పార్క్ పాలనకు తెరలేపాయి. అన్ని అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని క్యాబినెట్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఖజానా అడుగంటి ఉందని, కావున ప్రతి శాఖ కూడా ఖర్చులు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ఒకవైపు ఖర్చులు తగ్గించాలంటూనే మరోవైపు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్ట్‌ల పూర్తికి శరవేగంగా పావులు కదుపుతోంది. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను కూడా కట్టేస్తామని చెప్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ప్రాధన్యత సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు 45 నిమిషాలు చంద్రబాబు చర్చించారని, అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో కూడా ఆయన పలు కీలక అంశాలు, రాష్ట్రానికి కావాల్సిన అదనపు నిధుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రకు ఆశించిన నిధులు వస్తాయా!

కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న ఆర్థిక సంవత్సరం 2024-2025కు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తులు కూడా ప్రారంభిచేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి గతులను, అవసరాలను వివరించి రాష్ట్రానికి అదనపు నిధులు కోరాలని చంద్రబాబు హస్తినకు వెళ్లారు. అనుకున్న విధంగా కేంద్ర మంత్రులతో కావాల్సిన నిధుల గురించి చర్చించారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. వీటిలో ముఖ్యంగా పోలవరం, అమరావతి నిర్మాణాలకు అధిక మొత్తంలో అదనపు బడ్జెట్ కోరారని, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుకు కూడా అదనపు బడ్జెట్ ఆమోదించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి త్వరలో వచ్చే కేంద్ర ప్రాజెక్ట్‌లపై కూడా చంద్రబాబు చర్చించారు. ఈ క్రమంలోనే ఆశించిన నిధులు వస్తాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై విశ్లేషకుల్లో కూడా మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన తప్పుకుంటే ఎన్‌డీఏ ప్రభుత్వం ఇబ్బందులో పడుతుంది. అధికారం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎంత వీలైతే అంత అక్కున చేర్చుకోవడానికే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దీనిని బట్టి చూస్తే చంద్రబాబు అడిగిన అదనపు నిధులకు కేంద్రం ఓకే చెప్తుంది. ప్రకటిస్తుంది కూడా. అంతకుమించి కేంద్రంలోని ఎన్‌డీఏ దగ్గర మరో ఆప్షన్ కూడా లేదు. టీడీపీ ఏమాత్రం అప్‌సెట్ అయి కూటమి నుంచి తప్పుకున్నా బీజేపీకే నష్టం జరుగుతుంది. ఏపీలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. కానీ కేంద్రంలో అలా కాదు. టీడీపీ తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తే కేంద్రంలోని అధికారం తలకిందులు అయ్యే అవకాశాలున్నాయి’ అని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.

మరికొందరు అదేమీ ఉండదని అంటున్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకంగా ఉన్న మాట వాస్తమే అయినా.. ఒక్కడ టీడీపీతో బీజేపీకి ఎంత అవసరం ఉందో అదే విధంగా బీజేపీ అవసరం కూడా టీడీపీకి అంతే ఉంది. ఎన్‌డీఏ కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు టీడీపీ ప్రకటిస్తే కేంద్రంలో వచ్చే మార్పులు ఏమీ ఉండవు. మహా అయితే ఇండి కూటమి మరికాస్త బలమైన ప్రతిపక్షం కావడం తప్ప. కేంద్రంలో ప్రభుత్వ స్థాపనకు 272 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. వాటిలో ఎన్‌డీఏ కూటమి 292 స్థానాలు సాధించింది. వాటిలో టీడీపీ 16 స్థానాలు కలిగి ఉంది. అంటే ఒకవేళ టీడీపీ.. కూటమి నుంచి తప్పుకుంటే కూటమి ఎంపీ స్థానాల సంఖ్య 276కు పడిపోతుంది. అంటే టీడీపీ ఒంటరిగా కూటమి నుంచి తప్పుకున్నా కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు చేసిన ప్రతి డిమాండ్‌కు సరేనంటూ తలవూపాల్సిన అవసరం ఎన్‌డీఏకు లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అడిగిన అదనపు నిధులు తప్పకుండా ఆంధ్రకు వస్తాయని చెప్పలేం’’ అని మరికొందరు వాదిస్తున్నారు. దీంతో పాటుగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందని వారు వివరిస్తున్నారు. అందుకు జనసేనకు కేవలం 2 ఎంపీ స్థానాలు ఉండటమే కారణం అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రకు కావాల్సిన అదనపు నిధులను చంద్రబాబు తీసుకురాగలుగుతారా అన్న అనుమానాలు అధికమవుతున్నాయి. కాగా ఈ నిధులను పొందడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందులో భాగంగా సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి రెండు సార్లు ఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపారు. మరి ఆంధ్రకు అదనపు నిధులు వస్తాయా రావా అన్నది తెలియాలంటే ఈ నెల 23న జరిగే బడ్జెట్ సెషన్స్ వరకు ఆగాల్సిందే.

Read More
Next Story