సంచార జీవికి బ్రేక్ పడింది....  రెండోసారి గెలుస్తారా....?
x
Source: Twitter

సంచార జీవికి బ్రేక్ పడింది.... రెండోసారి గెలుస్తారా....?

ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండో సారి పోటీ చేయడం అలవాటు లేని గంటా శ్రీనివాసరావు తన సెంటిమెంట్కు విరుద్ధంగా రెండో సారి పోటీ చేస్తున్నారు. మరి ఆయన గెలుస్తారా...?



(తంగేటి నానాజీ)
విశాఖపట్నం: నియోజకవర్గం ఎక్కడైనా... పార్టీ ఏదైనా... పోటీ చేసి గెలిచి చూపించడం ఆయన స్టైల్... ఒక్కసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయరు. అలాంటి ఆయన ఈసారి రెండోసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన భీమిలి నియోజకవర్గం నుంచి మళ్లీ 2024 ఎన్నికల బరిలోకి దిగారు. గంటా సీటు విషయంలో చివరి వరకు ఉత్కంఠ సాగినప్పటికీ చివరి నిమిషంలో టీడీపీ అధిష్టానం భీమిలి స్థానానికి గంటా శ్రీనివాసును ప్రకటించింది. దీంతో ఆయన సెంటిమెంట్‌కు బ్రేక్ పడింది. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలోనే రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఓటమెరుగని నేత...
'గంటా శ్రీనివాసరావు'.... ఉత్తరాంధ్రలో ఈ పేరు వినని వారు, తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఈయన 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి తొలిత అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2004 లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లోనే ప్రజారాజ్యం పార్టీ రావడంతో మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో గంటా పీఆర్పీ‌లో చేరారు. 2009లో పీఆర్‌పీ నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. ఇక్కడ ఆయనకు మరో అంశం కలిసొచ్చింది. పీఆర్‌పీ.. కాంగ్రెస్‌లో విలీనం కావడంతో పీఆర్‌పీ కోటాలో రాష్ట్ర మంత్రి అయిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో గంటా తిరిగి సొంత గూటికి చేరారు. టీడీపీ తరఫున భీమిలి టికెట్ సాధించి 2014లో మళ్లీ ఎమ్మెల్యే అయిపోయారు. అంతేకాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. తిరిగి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలో లేనందున ఎమ్మెల్యే గానే ఉండిపోయారు.
చివరి నిమిషంలో ఖరారైన బెర్తు...
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చివరి నిమిషంలో భీమిలి బెర్తు ఖరారు అయింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించినప్పటికీ గంటా ససేమిరా అనడంతో టీడీపీ అధినేత చంద్రబాబు భీమిలికే గంటాను ఖాయం చేశారు.
మిత్రుల మధ్య పోటీ....
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి... దీనిని నిజం చేస్తూ భీమిలి నియోజకవర్గంలో ఒకనాటి మిత్రులు నేడు ప్రత్యర్ధులుగా మారారు. టిడిపి బిజెపి జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా...అధికార వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికల బరువులో ఉన్నారు. వీరిరువురు ఒకనాటి స్నేహితులు... ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత టిడిపిలోకి కలిసే జంప్ చేశారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉండిపోగా అవంతి శ్రీనివాస్ మాత్రం వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. అయినప్పటికీ వీరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని వీరి సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇరువురు వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండడంతో వీరి మధ్య ఎన్నికల పోరు అనివార్యమైంది. గెలుపు ఎవరిని వరిస్తుందో వాటమి ఎవరిని కౌగిలించుకుంటుందో వేచి చూడాల్సిందే.... ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో వీరి మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది.
సెంటిమెంట్‌కు విరుద్ధంగా.,..
సెంటిమెంట్‌కు విరుద్ధంగా గంటా శ్రీనివాస్ ఈసారి పోటీకి దిగారు. పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి పోటీ చేయని గంటా శ్రీనివాసరావు గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన భీమిలి నియోజకవర్గంలోనే రెండోసారి పోటీ చేస్తున్నారు. ఎన్నికల మేనేజ్మెంట్‌లో చాణక్యుడైన గంటా శ్రీనివాస్ రెండోసారి నెగ్గుకోస్తారా.... అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Read More
Next Story