కామినేని కోసం హీరో వెంకటేశ్ ప్రచారం చేస్తారా?
కామినేని శ్రీనివాస్, రఘురామిరెడ్డిలు కాంగ్రెస్, బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. రఘురామిరెడ్డికి ప్రచారం చేస్తున్న హీరో వెంకటేశ్ కామినేని కోసం వస్తారా?
కుటుంబంలోనే అన్నా చెల్లెళ్లు, భార్యా భర్తలు ఒకరిపై ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు సెలబ్రెటీలైతే ఎవరి కోసం ప్రచారం చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లోకి పోతారు. వారి బాధ కూడా వర్ణాతీతంగా ఉంటుంది. ఒక విధంగా ఇదే పరిస్థితి హీరో వెంకటేశ్‌కు కూడా ఎదురైందని చెప్పొచ్చు. రఘురామిరెడ్డి, కామినే శ్రీనివాసులు బంధువులు కావడం, ఒకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే మరొకరు బీజేపీ తరపున పోటీ చేయడం వల్ల హీరో వెంకటేశ్ ఇరుకున పడతారేమోనని అందరూ భావించారు. అయితే మంగళవారం రఘురామిరెడ్డి కోసం ప్రచారం చేయడంతో ఇప్పుడు కామినేని విషయం ఏమవుతుందోనని ఎదురు చూస్తున్నారు.
ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ఆయన వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోకు వెంకటేశ్ అభిమానులతో పాటు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్ ముందుకు సాగారు. రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వియ్యంకులు అవుతారు. దీంతో తన వియ్యంకుడిని గెలిపించేందుకు వెంకటేష్ రంగంలోకి దిగారు. రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు. రఘురాం రెడ్డి తరపున కాంగ్రెస్ మంత్రులు ,నేతలతో పాటు పొంగులేటి కుటుంబ సభ్యులు అందరూ ప్రచారం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఈయన కూడా సినీనటుడు వెంకటేశ్‌కు బంధువే. వెంకటేశ్ భార్యకు కామినేని శ్రీనివాస్ స్వయాన మేన మామ. దీంతో వెంకటేశ్‌కు కామినేని బాబాయి అవుతారు. ఇప్పటికే కామినేని శ్రీనివాస్ తరుఫున కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. బాబాయి కోసం అబ్బాయి వెంకటేశ్ ప్రచారానికి వస్తారా రాడా అనే సంధిగ్ధత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీలు దేశంలో భిన్న పార్టీలు. ఒకరితో ఒకరు కలవడం చాలా కష్టం. ఒకరి తరపున ప్రచారం చేసి మరొకరిని విమర్శించాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది.
హీరో వెంకటేశ్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వీయ్యంకుడు రఘురామిరెడ్డి కోసం ఇప్పటికే ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్ కూడా ప్రచారానికి రావలసిందిగా వెంకటేశ్‌ను కోరారు. తనకున్న బలంతో పాటు సీనీ గ్లామర్ తోడైతే గెలుపు సులువు అవుతుందని కామినేని భావిస్తున్నారు. హీరో వెంకటేశ్‌కు అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన ఎవరి కోసం పని చేస్తే అటువైపు అభిమానులు కూడా మొగ్గు చూపే చాన్స్ ఉంది. ఇప్పటికే వియ్యంకుడి కోసం ఖమ్మంలో ప్రచారం చేసిన వెంకటేశ్ అక్కడ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేసి ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బాబాయి కామినేని కోసం బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారా అనే అనుమానాలు కైకలూరు నియోజక ప్రజల్లో ఉంది.
Next Story