బస్సులో యాత్ర.. జిల్లాల్లోనే జగన్ బస
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఈ నెల 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా వైసీపీ ప్రచారం మార్మోగుతుందో లేదో..
ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ఆంధ్రలో ఎన్నికల ప్రచార రథాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో తమదైన మార్క్ చూపుతూ దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రాష్ట్రంలో ప్రచార హోరు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన సీఎం జగన్ తాజాగా బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఈ నెల 27 నుంచి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించి ఈ యాత్రను సీఎం జగన్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ యాత్రకు ‘మేమంతా సిద్ధం’ పేరును ఖరారు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు.
యాత్ర సాగేది ఇలా
యాత్రలో భాగంగా ప్రతిరోజు వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి అవుతామని, సాయంత్రం సమయంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 27,28,29 మూడు రోజుల్లో జరిగే యాత్ర షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. సిద్ధం సభ జరిగిన నాలుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ‘‘ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు సీఎం జగన్ నిర్విరామంగా యాత్రలో ఉంటారు.
పండగలు, సెలవు రోజుల్లో కూడా యాత్ర కొనసాగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మలివిడత ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ చేస్తారు. ఎంతమంది కూటమి కట్టినా మా బ్రాండ్ సీఎం జగన్‌ను కదిలించలేరు. మాకు వ్యతిరేకంగా వస్తున్న అన్ని శక్తులను ఒంటరిగానే ఎదుర్కొని ఓడిస్తాం’’అని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు ఆయన.
జగన్ ప్రచారం మార్మోగేనా!
ఎన్నికల ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచి ప్రారంభించడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఈ యాత్ర మొదటి మూడు రోజులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. వైఎస్‌ఆర్ ఘాట్ నుంచి యాత్ర ప్రారంభమై 27న ప్రొద్దుటూరులో సీఎం జగన్ తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఈ యాత్ర కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం అక్కడే సభ కూడా ఉంటుంది. 30న ఎమ్మిగనూరులో యాత్ర చేసి సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ బస్సు యాత్రలో కూడా పాదయాత్ర తరహాలోనే సీఎం జగన్ యాక్టివిటీ ఉంటుంది.
ఈ యాత్రలతో రాష్ట్రంలో జగన్ ప్రచారం మార్మోగుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు పాటలను కూడా విడుదల చేశారు. ఆ రెండు పాటలు ప్రస్తుతం రాష్ట్రమంతా వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్న పాట వినిపిస్తోంది. ఈ పాటలు తన ప్రసంగాలతో రాష్ట్రమంతా ప్రచార హోరు ఎత్తించడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. మరి వారు ఆశించిన, ఊహించిన స్థాయిలో రాష్ట్రంలో జగన్ ప్రచారం మార్మోగుతుందో లేదో చూడాలి.
Next Story