ఆంధ్రాలో లక్షమంది అంగన్వాడీ సిబ్బందిని తొలగిస్తున్నారా?
x

ఆంధ్రాలో లక్షమంది అంగన్వాడీ సిబ్బందిని తొలగిస్తున్నారా?

లక్ష మంది అంగన్వాడీల సమ్మె కీలకదశకు చేరింది. ఎస్మా ప్రయోగానికి కార్మికులు బెదర లేదు. ప్రభుత్వం వారిని తొలగిస్తుందా. ఎన్నికలపుడు లక్ష కుటుంబాల ఆగ్రహం మంచిదేనా


-కె.పోలారి

లక్షమంది అంగన్వాడీ శ్రామికుల సమ్మె సంక్రాంతి రోజుకి 35వ రోజుకు చేరింది. ఎస్మా (ESMA) ప్రయోగించి కూడా పదవ రోజుకు చేరింది. సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అంగన్వాడీ ఐక్య కార్యాచరణ (జె.ఏ.సి) తో చర్చలు జరిగాయి. ఎస్మా ప్రయోగం తర్వాత కూడా రెండు సార్లు జరిగాయి. రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి పాలనాధికార్లు పాల్గొన్నారు. ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధ వాదనలు చేశారు. ఆఖరిలో 12-01-2024 నాటి చర్చల్లో ప్రభుత్వం అసలు విషయం బయటపెట్టింది. అంగన్వాడీలకు జీతభత్యాల పెంపుకు తగిన సొమ్ము ప్రభుత్వం వద్ద వున్నా, పెంచరట! ఇది సీనియర్ మంత్రి బొత్స, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సజ్జల వినిపించిన వాదన. ఇది రాష్ట్రముఖ్యమంత్రి వాదనే! జీతాల పెంపుకి ఐదేళ్ళు ముహూర్తం వుందట. అంతవరకూ తమ ప్రభుత్వ పాలసీ ప్రకారం పెంచదట! ఈ లోపు పెంచితే ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యుల తలలను బేతాళుడు నరికివేస్తాడా! ఇదితర్కం కోసమా? లేదా కుతర్కమా? ఇది ఎవరి బుర్రలో పుట్టిన ఆలోచన.

అంగన్వాడీ, ఆశా, మద్యాహ్న భోజనం వంటి స్కీమ్ వర్కర్లకి ముష్టి పారితోషికం, గౌరవ వేతనం తప్ప వేతన విధానం లేదని వీరికి తెలియదా? వారిని వేతన కార్మికవర్గంగా గుర్తించాలనే కార్మిక సంఘాల డిమాండ్ని త్రోసిపుచ్చుతున్న సర్కారుకి తెలియదా? స్కీమ్ వర్కర్లకు పేస్కేల్స్ రివిజన్ (పిఆర్సి) పద్ధతి అమలుకాదని తెలియదా? పి.ఆర్.సి వర్తించే కార్మిక, ఉద్యోగ వర్గాలకు వర్తించే కాలపరిమితి స్కీం వర్కర్లకు ఎలా వర్తిస్తాయి? మూడు నెలలకోసారో, ఆరు నెలలకోసారో కరవు భత్యం (డి.ఏ) పెరిగే వారితో ఎలా ముడి పెడుతుంది? డి. ఏ వర్తించే వారి ముహూర్తాన్ని స్కీం వర్కర్లకి ముడిపెట్టడంలో అర్థం వుందా? డి.ఏ వర్తించని హమాలీ, ముఠా, జట్టు వంటి అసంఘటిత కార్మికులకు రెండేళ్ళకో, ఏడాదికో కూలి పెంపు ఒప్పందాలు జరిగే సంగతి తెలియదా?

2019 జూలైలో వెయ్యి పెంచినపుడు 11,500 రూ॥లతో ఏ సరుకులు వచ్చాయి? అదే సరుకులను కొనడానికి నేడు 20 వేల రూ॥ల కంటే మించే ఖర్చు కావడం లేదా? సరుకుల్లో ఉపయోగపు విలువ పెరగలేదు. వాటి కొనుగోలుకు ఉపయోగించే డబ్బు విలువ తగ్గింది. సరుకులు లావు కాలేదు. డబ్బు చిక్కిపోయింది. 2019 లో మంత్రుల అలవెన్సులు ఎంత? ఇప్పుడెంత? అప్పుడు మంత్రి పెట్రోలు అలవెన్సు ఎంత? ఇప్పుడెంత? తమ నివాస, ప్రయాణ

తదితర బిల్లులు అప్పుడెంత? ఇప్పుడెంత? తమ అధికార నివాసాల్లో అప్పుడు నీరు, కరెంట్, ఇంటి పన్ను వగైరాలు ఎంత? ఇప్పుడెంత? ఆ పెరిగే ధరల్ని తమ జేబుల్లోంచి చెల్లిస్తున్నారా? ప్రభుత్వ బొక్కసం నుంచా? వాటికి ఐదేళ్ళు ముహూర్తం లేదా?

పిఆర్సీ ముహూర్తాలను స్కీమ్ వర్కర్లకు వర్తిస్తాయనే వాదనలు తర్కం ఎదుట నిలిచేవి కావు. ఈ బుర్రలేని వాదన చేసే ముందు తమ వాగ్దానాలు గుర్తు రాలేదా?

తెలంగాణా ప్రభుత్వం కంటే వెయ్యి రుపాయలు అధికంగా ఇస్తాననేది ముఖ్యమంత్రి హామీ కాదా? తెలంగాణా సర్కారు పెంచినా, ఐదేళ్ళు ముహూర్తం వరకూ పెంచేది లేదని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు? అప్పుడు లేని “ ముహూర్తం ” ఇప్పుడెందుకు? అంగన్వాడీలకు జీతభత్యాలు ఇప్పుడే పెంచాలనే ప్రేమ తమ ప్రభుత్వానికి వున్నా, ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేదని తొలి నుండి వాదన చేస్తూ వచ్చారు. తే.12-01-2024 నాటి చర్చల్లో హఠాత్తుగా డబ్బు సమస్య కాదనే వాస్తవాన్ని బయట పెట్టారు? ప్రజలు నవ్వుకుంటారనే భయం లేదా?

మంత్రి బోత్సా గతం మర్చిపోయారా?

చర్చల కోసం ముఖ్యమంత్రి నుంచి లైసెన్సు పొందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు జీతభత్యాలు, డి.ఏ, ద్రవ్యోల్బణం గూర్చి తెలుసు. విజయనగరం జిల్లాలో జూటు మిల్లుల, గరివిడి ఫేకర్ ఫ్యాక్టరీ, హమాలీ వివాధాల్లో మధ్యవర్తి పాత్ర పోషించారు. నెల్లిమర్ల జూట్ మిల్లులో లోతుగా దిగారు. నెల్లిమర్ల జూట్ మిల్ అక్రమ లాకౌట్ వ్యతిరేక కార్మిక సభలో మంత్రి హెూదాలో హాజరై కార్మికనేత వలె యాజమాన్య వాదనల్ని ఖండించి ద్రవ్యోల్బణం, డి. ఏలపై ప్రసంగించారు. ఇవన్నీ అంగన్వాడీల విషయంలోమరిచిపోయారా?

తాము చెప్పిన 'ముహూర్తం' పై నమ్మకం ఉంచి, వెంటనే విధులకు హాజరు కాకపోతే ఎస్మా ప్రకారం శిక్షిస్తామనీ, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనీ, కొత్తవారిని రిక్రూట్ చేస్తామనీ బొత్స, సజ్జల నోటితో ముఖ్యమంత్రి చెప్పించారు. ఈ బెదిరింపుకు అంగన్వాడీల శ్రామికవర్గం తలవంచబోదని స్పష్టం చేస్తున్నాం.

పేద మహిళా కార్మికుల మీద ఎస్మా

రోజుకు రూ.400 కూడా గిట్టని పేద స్త్రీ కార్మికులపై ‘ఎస్మా' ప్రయోగం అన్యాయం. ఆదానీ కోరితే గంగవరం, కృష్ణపట్నం రేవులను సైతం అప్పగిస్తున్న ముఖ్యమంత్రికి లక్ష మంది అంగన్వాడీల కష్టాలు గుర్తురావు. ఎస్మా ప్రయోగమే నియంతృత్వ పాలనకు పడుతుంది. దాని పేరిట లక్ష మంది జీవనోపాధికి ఎసరుపెట్ట జూస్తే జగన్ ప్రభుత్వ రాజకీయ వినాశనానికి దారితీస్తుంది. జయలలిత సర్కారుకు ఏ గతి పట్టిందో తెలియదేమో!

లక్షమందికి కోటి మీద తోడుంటారు?

ఇది లక్షమంది శ్రామిక స్త్రీల పోరాటం. వారికి కోటి మంది తోడుగా నిలుస్తారు. ఐదు కోట్ల మంది మద్దతు ఇస్తారు. నేటి జిల్లా, డివిజన్ కేంద్రాల్లో ధర్నా శిబిరాల పోరాటాన్ని ఊరూరుకూ మార్చాలనే ఉబలాటం వుందేమో! జగన్ సర్కారు ఉద్యోగులను తొలిగించేందుకు పూనుకుంటే అది రాజకీయ మూల్యాన్ని చెల్లించక తప్పదు. జగన్ కంటే రెండు దశాబ్దాలకు ముందే అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబుకు ఏ గుణపాఠం జరిగిందో తెలుసుకుంటే మంచిది. ఈ ఆందోళన పట్ల మద్దతు ఇచ్చే పేరిట కూడా టిడిపి అంగన్వాడీల ఎదుట తలదించుకొని మద్దతు ఇవ్వడం గమనార్హం. పాతికేళ్ళైనా ఆనాటి నేరం నేటికీ మాసిపోవడం లేదు. నాటి చంద్రబాబు లాగే అంగన్వాడీల మీద యుద్ధానికి దిగుతుందో లేదా ఇకనైనా విజ్ఞతతో వేతన ఒప్పందం చేస్తుందో జగన్ సర్కారు తేల్చుకోవాలి.

ఈ ఐక్య పోరాటాన్ని మరింత విస్తరించుకొని విశాల ఐక్యతా పోరాటంగా మార్చేందుకు కార్మిక సంఘాలు పూనుకుంటాయి. ఎస్మా పేరిట అణచివేతకు దిగితే ప్రజస్వామిక పోరాటంగా మార్చే కృషి చేపడదాం. ఊరూరా ప్రజా ఉద్యమంగా కూడా మార్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఉమ్మడి ఏ.పిలో సైతం లేని విధంగా సుదీర్ఘ సమ్మె జరిగింది. రాష్ట్ర కార్మికోద్యమంలో చరిత్ర కెక్కుతోంది.

(కె.పోలారి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి. ఇఫ్టూ)

Read More
Next Story