రాష్ట్ర మంత్రి లోకేష్‌ వారం రోజుల పాటు అమెరికా పర్యటన చేశారు. ఫలితాలు ఏ మేరకు ఉంటాయనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది.


అమెరికాలో వారం రోజుల పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌ చేసిన పర్యటన సత్ఫలితాలను ఇస్తుందా? లేదా? అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. మేధావి వర్గంలో ఈ చర్చ ప్రధానంగా సాగటం విశేషం. ఏపీ బ్రాండ్‌ వైఎస్సార్‌సీపీ హయాంలో దెబ్బతిన్నదని, అందుకే తాను అమెరికా పర్యటనకు వెళ్లాల్సి వచ్చిందని లోకేష్‌ అనటం విశేషం. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతి పేరుతో ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని భావించింది. అందుకు అనుగుణంగా కొన్ని పనులు కూడా మొదలు పెట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమరావతి నగరం అవసరం లేదని, రాజధాని నిర్మాణం కోసం బలవంతంగా భూములు ఇచ్చిన వారికి తిరిగి భూములు ఇచ్చేస్తామని ప్రకటించారు. దీంతో అమరావతి నగరం అనే మాట మూలన పడింది. అమరావతి నిర్మించాల్సిందేనని భూములు ఇచ్చిన కొందరు రైతులు ఐదేళ్ల పాటు ఆందోళన కొనసాగించారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అందువల్ల బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిన్నదని, అందుకే తాను అమెరికా పర్యటన చేయాల్సి వచ్చిందని లోకేష్‌ చెప్పారు.

అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లు, తెలుగుదేశం పార్టీ అభిమానులు లోకేష్‌ను సాదరంగా ఆహ్వానించారు. వారి ద్వారానే కొన్ని కంపెనీల వారితో చర్చలు జరిపారు. అమరావతిలో కంపెనీలు నెలకొల్పి అక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీల వారిని లోకేష్‌ కోరారు. ఆయన ప్రధానంగా మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్‌ విడియా, యాపిల్, గూగుల్‌ క్లౌడ్, పెరోట్‌ గ్రూప్, రేవేచర్, సెల్స్‌ఫోర్స్, పాల్కన్‌ ఎక్స్, జడ్‌ స్కాలర్‌ వంటి కంపెనీలతో చర్చించారు. ఆ కంపెనీల నుంచి కొందరు ప్రతినిధులు హాజరు కాగా వారితో మాట్లాడారు. అయితే ఇందులో చెప్పుకోదగినవి ఐదు కంపెనీలు మాత్రమే ఉన్నాయి. తిరిగి 2025లో దావోస్‌లో పెట్టుబడుల సదస్సు జరగబోతోంది. అప్పటికి ఈ కంపెనీల వారితో ఒకటికి రెండు సార్లు టచ్‌లోకి వెళ్లి దావోస్‌ సదస్సులో వీరితో ఒప్పందాలు చేసుకునే విధంగా పర్యటన సాగింది.
గత నెల 29న లాస్‌వేగాస్‌లో 23దేశాలకు చెందిన 2,300 చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్న ఐటీ సర్వ్‌ సినర్జీ సమిట్‌కు లోకేష్‌ హాజరై ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్, ఇండియా స్పోరా ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టాలని, రాయితీల విషయం కూడా చర్చిద్దామని వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. లోకేష్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సిఐఐ ప్రతినిధులతో చర్చించారు. ఇండస్ట్రీస్‌ కన్సల్‌టేటివ్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధులతో రెండు సార్లు విశాఖలో సమావేశమయ్యారు. టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌తో చంద్రబాబు చర్చించారు. విశాఖకు టీసీఎస్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హెసీఎల్‌ ప్రతినిధులతో ఇప్పటికే లోకేష్‌ చర్చలు జరిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దావోస్‌లో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సుకు చిన్న హోటల్స్‌ నడుపుకునే వారిని కూడా పిలిపించి పారిశ్రామిక వేత్తలతో గొప్ప సదస్సు జరిగిందని, పెట్టుబడులు కొల్లలుగా వస్తున్నాయని చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని ఒప్పందాల తరువాత వారికి ఆ కంపెనీలే లేవని సర్వేల్లో తేలింది. అందుకే ఈ సారైనా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు పేరున్న కంపెనీలు అయితే బాగుంటుందనేది పలువురి మాట.
తెలుగు అసోసియేషన్స్‌ వారి ఆహ్వానం మేరకు అమెరికా లోకేష్‌ వెళ్లారని, ఆ సందర్భంలోనే పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారనేది వాస్తవం. కేవలం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లలేదని, అమెరికాలో ఉన్న టీడీపీ అభిమానుల ఆహ్వానం మేరకు వెళ్లారని పలువురు చెబుతున్నారు. ఎవరి ఆహ్వానం మేరకు వెళ్లినా మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, యాపిల్, గూగుల్‌ క్లౌడ్‌ వంటి సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారంటే తప్పకుండా ఏపీలో సంస్థలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Next Story