నర్సరావుపేట అనిల్‌ను ఆదరించేనా?

నర్సరావుపేట నుంచి ఎంపీలుగా నెల్లూరు వాసులు నేదుమల్లి, మేకపాటిలు గతంలో గెలిచారు. ఇప్పుడు పోలుబోయిన అనిల్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు.


నర్సరావుపేట అనిల్‌ను ఆదరించేనా?
x
Polluboyina Anil Kumar Yadav and YS Jagan

జి విజయ కుమార్

మజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన నేత పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ను నర్సరావుపేట పార్లమెంట్‌ ప్రజలు ఆదరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. గతంలో నెల్లూరుకు చెందిన ఇద్దరు నేతలకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టిన చారిత్రక నేపథ్యంలో ఈ సారి కూడా కలిసొస్తుందనే ఆలోచనతో నెల్లూరుకు చెందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రంగంలోకి దింపినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
నెల్లూరు నేతలు ఇద్దరు ఎంపీలుగా నర్సరావుపేట నుంచి..
గతంలో నెల్లూరుకు చెందిన నేతలను నర్సరావుపేట ప్రజలు ఆదరించిన చరిత్ర ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి ఎంపీలుగా గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డిలే ఆ ఇద్దరు నేతలు. నేదురమల్లి జనార్థన్‌ రెడ్డి 1999లో జరిగిన ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ముస్లీం మైనారిటీ వర్గానికి చెందిన ఎస్‌ఎం లాల్‌జాన్‌ భాషను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో నేదురమల్లి జనార్థన్‌రెడ్డి విజయం సా«ధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నేదురమల్లి జనార్థన్‌రెడ్డికి 4,32,266 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్‌ఎం లాల్‌జాన్‌ భాషకు 4,18,384 ఓట్లు లభించాయి. సుమారు 13వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో నెల్లూరుకు చెందిన నేదురమల్లి జనార్థన్‌రెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా నెల్లూరుకు చెందిన నేతకే నర్సరావుపేట ప్రజలు పట్టం కట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి రంగంలోకి దిగారు. మద్ది లక్ష్మయ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు బరీలోకి దింపారు. కానీ రాజమోహన్‌రెడ్డికే నర్సరావుపేట పార్లమెంట్‌ ప్రజలు జై కొట్టారు. పోటా పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలోకి దిగిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి భారీ విజయాన్ని చేజిక్కుంచుకున్నారు. దాదాపు 86వేలకుపైగా మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మద్ది లక్ష్మయ్యపై గెలిచారు. ఇలా ఊరు కాని ఊరొచ్చి పోటీ చేసిన నెల్లూరు నేతలను నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజక ప్రజలు గెలుపును కట్టబెట్టి అక్కున చేర్చుకున్నారు. తాజాగా నెల్లూరుకు చెందిన మరో నేత నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానానికి పోటీ పడుతున్నారు. మాజీ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు నెల్లూరు నేతలకు పట్టం కట్టిన నర్సరావుపేట పార్లమెంట్‌ ప్రజలు ఈ సారి కూడా పట్టం కడుతారా లేదా అనేది వేచి చూడాలి. నెల్లూరు జిల్లాకు, నర్సరావుపేటకు ఏదో తెలియన అనుబంధం కూడా ఉందని నాయకులు చెబుతున్నారు.
బిసి కార్డు ఉపయోగపడుతుందా?
ఇప్పటి వరకు పోటీ చేసిన నెల్లూరు నేతలు ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఈ సారి మాత్రం బీసీ వర్గానికి చెందిన నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ రంగంలోకి దిగారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రాజకీయ బదిలీల్లో నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానం కూడా ఒకటి. 1980లో జన్మించిన అనిల్‌కుమార్‌ 2008లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. కార్పొరేటర్‌గా ప్రస్థానం ప్రారంభిచిన ఆయన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరు సిటీ నుంచి 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం జగన్‌ తొలి మంత్రి వర్గంలో ఇరిగేషన్‌ మంత్రిగా పని చేశారు. తాజాగా ఆయనను నెల్లూరు సిటీ నుంచి నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానానికి రాజకీయ బదిలీ చేసారు. బీసీలు ఎక్కువుగా ఉన్నారని, ఆ కార్డుతోనే ఇక్కడకు సీఎం జగన్‌ పంపినట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే బీసీ కార్డు అనిల్‌కు ఎంత వరకు ఉపయోగపడుతుందనేది వేచి చూడాలి.
నాన్‌లోకల్‌ పని చేస్తుందా ..
గతంలో నాన్‌లోకల్స్‌ను నర్సరావుపేట పార్లమెంట్‌ ప్రజలు ఆదరించారు. అందుకనే ఇద్దరు నెల్లూరు నేతలు ఇక్కడకు వచ్చి పోటీ చేసినా గెలుపొందారు. ఇటీవల కాలంలో లోకల్, నాన్‌లోకల్‌ ఫీలింగ్‌ ఎక్కువైంది. లోకల్‌ నాయకులైతే అందుబాటులో ఉంటారని, ఏదో ఒక సమయంలో దొరుకుతారని సమస్యలు పరిష్కారం అవుతాయని, అదే నాన్‌లోకల్‌ నాయకుడైతే స్థానికంగా ఉండటం కష్టమని, కలవడం కూడా కష్టమని ఇక సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయనే అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నాన్‌లోకల్‌ లోకల్‌ అవరోధాలను దాటి ప్రజల మన్ననలను గెలవడం సవాలుగానే మారింది.
టీడీపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు
నర్సరావుపేట వైఎస్సార్‌సీపీ సిట్టింగ్‌ ఎంపీ టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల బరిలోకి దిగారు. 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి ఆయన గెలుపొందారు. తర్వాత పార్టీ మారి టీడీపీలో చేరారు. లావు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.
సామాజిక వర్గాలు
నర్సరావుపేట పార్లమెంట్‌ పరిధిలో ఇతర వర్గాలు ఉన్నా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల వారిదే రాజకీయ అధికారం. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో కమ్మ 2.15 లక్షలు, రెడ్డి 1.50లక్షలు, ముస్లిమ్‌ 1.8లక్షలు, మాదిగ 1.90లక్షలు, యాదవ 1.15లక్షలు, మాల 1.10లక్షలు, కాపు 1.3లక్షలు, వడ్డెర 84వేలు, వైశ్య 74వేలు, రజక 55వేలు, సుగాలి 48వేలు, ఎరుకలి 45వేలు, బ్రాహ్మిణ్‌ 15వేలు ఇలా ఇంకా పలు సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి.
నర్సరావుపేట పార్లమెంట్‌ పరిధిలో చిలకలూరిపేట, నర్సరావుపేట సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. వీటిలో అధిక స్థానాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే గత ఎన్నికల్లో గెలిచింది.
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో
నర్సరావుపేట పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి ఇప్పటి వరకు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నాయకులే ఎంపీలుగా గెలుస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏడు సార్లు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నాలుగు సార్లు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకులు మూడు సార్లు ఎంపీలుగా గెలిచారు.
Next Story